విత్తుతో పాటే పంటల నమోదూ ప్రారంభం 

జోరుగా ఈ–పంట నమోదు 

90 శాతం పూర్తయిన పరిశీలన..70 శాతం ఈకేవైసీ నమోదు 

సాగైన విస్తీర్ణం 89.96 లక్షల ఎకరాలు 

క్షేత్ర స్థాయి పరిశీలన పూర్తయిన విస్తీర్ణం 80.52 లక్షల ఎకరాలు 

వచ్చే నెల 15 కల్లా మొత్తం ప్రక్రియ పూర్తి చేయాలని లక్ష్యం 

సున్నా వడ్డీ, రాయితీలకు ఈ పంట నమోదే ప్రామాణికం 

అమరావతి: ఈసారి విత్తుతో పాటు పంటల నమోదు కూడా ఒకేసారి ప్రారంభమైంది. విత్తనం వేసిన వెంటనే రైతులు తమ పంట వివరాలను ఆర్బీకేలో నమోదు చేశారు. ఆ  తర్వాత 15–20 రోజుల్లో ఆర్బీకేల్లోని వ్యవసాయ, ఉద్యాన సహాయకులు క్షేత్ర స్థాయిలో పరిశీలనకు వెళ్లారు. ఆర్‌బీయూడీపీ యాప్‌లోని వివరాలతో సరిపోల్చి అన్నీ సక్రమంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత పంట ఫొటో, ఇతర వివరాలను అప్‌లోడ్‌ చేశారు. మూడో దశలో రైతుల వేలిముద్రలు (ఈ–కేవైసీ) తీసుకొని ఈ–పంట వివరాలతో అనుసంధానించారు. ఈ యాప్‌లో పంట వివరాలు నమోదు కాగానే రైతు మొబైల్‌ నంబర్‌కు ఎస్‌ఎంఎస్‌ ద్వారా సమాచారం పంపారు. ‘మీ పంట ఈ క్రాప్‌లో నమోదైనట్టు’గా ధ్రువీకరించే రశీదు (డిజిటల్‌ ఎక్‌నాలెడ్జ్‌మెంట్‌ కాపీ)ని కూడా అందజేశారు.

 

ఎంత నమోదైందంటే
ఖరీఫ్‌లో సాధారణ విస్తీర్ణం 92.21 లక్షల ఎకరాలు కాగా, ఈ ఏడాది 89.96 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఖరీఫ్‌లో సాగు చేస్తున్న రైతులు అందరూ ఆర్బీకేల్లో పంట వివరాలు నమోదు చేసుకున్నారు. సాగైన విస్తీర్ణంలో 80,52,863 ఎకరాల్లో (దాదాపు 90 శాతం) పంటల క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేశారు. ఇప్పటి వరకు 77,00,550 ఎకరాల్లో పంటలకు సంబంధించి రైతులకు రశీదులు అందజేశారు.
కృష్ణా జిల్లా ఉయ్యూరు సమీపంలో రైతు ఫొటో తీసి పంట వివరాలు నమోదు చేస్తున్న సిబ్బంది 

ఈ ఖరీఫ్‌లో పంటలు సాగు చేస్తున్న 42,92,773 మంది రైతులకు గాను ఇప్పటివరకు 29,86,151 మంది వేలిముద్రలను ఈ క్రాప్‌తో అనుసంధానించడం ద్వారా 70 శాతం ఈ కేవైసీ పూర్తి చేశారు. ఇంకా 9.43 లక్షల ఎకరాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేయాల్సి ఉంది. 13.06 లక్షల రైతుల వేలిముద్రలను ఈ క్రాప్‌తో అనుసంధానించాల్సి ఉంది. ఉభయగోదావరి జిల్లాల్లో నవంబర్‌ 5వ తేదీ, రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో నవంబర్‌ 15 కల్లా ఈకేవైసీతో సహా మొత్తం ప్రక్రియ పూర్తి చెయ్యాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వ్యవసాయ శాఖ కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ ‘సాక్షి’కి తెలిపారు.

కోతలు ప్రారంభమయ్యే నాటికి కొనుగోలు కేంద్రాలు
కోతలు ప్రారంభమయ్యే నాటికి ఆర్బీకే స్థాయిలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కొనుగోలు సందర్భంగా ఏ ఒక్క రైతు ఇబ్బందిపడకుండా చర్యలు చేపట్టారు. 

‘ఈ–పంట’లో నమోదుతో లాభాలెన్నో...
ఈ క్రాప్‌ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. సాగు ఉత్పాదకాలు, పంట రుణాలు, సున్నా వడ్డీ, పెట్టుబడి రాయితీలు, పంటల బీమా, పంట నష్టపరిహారంతో పాటు పండించిన పంటలను కనీస మద్దతు ధరకు అమ్ముకోవచ్చు. తాజాగా సాగుకు అవసరమైన సలహాలు, సూచనలు పొందే వెసులుబాటు కూడా కల్పించారు. ఏ సర్వే నంబర్‌లో ఏ రకం పంట వేశారు, ఎప్పుడు కోతకొస్తుంది. ఎంత దిగుబడి వస్తుంది, పంట నాణ్యత ఎలా ఉంటుందో కూడా తెలుసుకోవచ్చు.

ఎన్నో ప్రయోజనాలు
► మిరప సాగు చేసా. పంట వివరాలు నమోదు చేయించుకున్నా. ఈ పంట నమోదుతో ఎన్నో ప్రయోజనాలు పొందే అవకాశం ఏర్పడింది. విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులే కాదు.. పంట రుణాలు,. పెట్టుబడి సాయం, పంట నష్టపరిహారం.. ఇలా ప్రతిదీ ఈ పంటలో వివరాల ఆధారంగానే ఇస్తున్నారు. 
– సీహెచ్‌ వెంకట సతీష్‌కుమార్, చినఓగిరాల

శ్రీకాకుళం జిల్లా దారబకు చెందిన ఈ రైతు పేరు ఎస్‌.సిమ్మయ్య. ఈ ఖరీఫ్‌లో 3 ఎకరాల్లో వరి సాగు చేశాడు. ఆర్బీకేలో బుక్‌ చేసుకున్న వెంటనే ఇతనికి విత్తనాలు ఇచ్చారు. వాటిని నాటిన అనంతరం ఆర్బీకేలో పంట వివరాలు (ఈ–పంటలో) నమోదు చేయించాడు. వెంటనే సిబ్బంది అతని పొలానికి వచ్చి పంట వివరాలు తీసుకున్నారు. ఫొటోలు తీసుకొన్నారు. వేలిముద్రలు తీసుకొని ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేశారు. రశీదు కూడా ఇచ్చారు. ఇప్పుడు తనకు ప్రభుత్వం నుంచి పలు ప్రయోజనాలు అందుతాయని సిమ్మయ్య సంతోషంగా ఉన్నాడు.

ఈ రైతు పేరు మారెప్ప. అనంతపురం జిల్లా దురదకుంట. 9 ఎకరాల్లో వేరుశనగ వేశాడు. విత్తనాలు వేయగానే ఆర్బీకేలో పంట వివరాలు నమోదు చేశాడు. 15 రోజుల్లో వ్యవసాయ సిబ్బంది వచ్చి పంట ఫొటోలు, వివరాలు తీసుకున్నారు. రైతు వేలిముద్రలు కూడా తీసుకొని, రశీదు ఇచ్చారు. ఇకపై తెగుళ్లు, చీడపీడల నుంచి పంటను రక్షించుకోవడానికి వ్యవసాయ అధికారుల తోడ్పాటు లభిస్తుందని, పంట విక్రయం కూడా సులభమవుతుందని మారెప్ప ఘంటాపథంగా చెబుతున్నాడు.

ఇలా రాష్ట్రంలో దాదాపు 43 లక్షల మంది రైతులు తమ పంటలు ఈ–పంటలో నమోదు చేయించుకున్నారు. దాదాపు 70 శాతం రైతుల ఈ కేవైసీ పూర్తయింది. మిగతా 30 శాతం రైతుల పంటల నమోదు కూడా వేగవంతంగా చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి రైతు ఏ రాయితీ పొందాలన్నా పంటల నమోదు (ఈ–క్రాప్‌) తప్పనిసరి. ఈ ఏడాది మరింత సాంకేతికతతో కొత్తగా తీసుకొచ్చిన  రైతు భరోసా యూనిఫైడ్‌ డిజిటల్‌ ప్లా్లట్‌ఫామ్‌ (ఆర్‌బీయూడీపీ) ద్వారా ఈ పంట నమోదు జరుగుతోంది.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top