దశాబ్దాల రాజకీయం... శతాబ్దాల కీర్తి

నేడు డాక్టర్‌ వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి జయంతి,  రైతు దినోత్సవం

జనం గుండెల్లో కొలువై ఉన్న మహానేత డాక్టర్‌ యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి! ఎన్నికల్లో ఏనాడూ ఓటమి ఎరుగని నేత! రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని బలంగా నమ్మిన రైతుజన బాంధవుడు. లక్ష కోట్లు ఖర్చయినా కోటి ఎకరాలకు సాగు నీరు అందించాలన్న లక్ష్యం కోసం పనిచేసిన అపర భగీరథుడు. నిరుపేదలకు కూడా ఆరోగ్య భద్రతను కల్పించిన ఆరోగ్యశ్రీ ప్రదాత. పింఛనుదారులకు ప్రతినెలా 1వ తారీఖునే పింఛన్‌ అందించడం వైఎస్‌ పాలనలోనే మొదలైంది. పేద కుటుంబాల విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వడం సరికొత్త ప్రయోగం. ఏ రంగాన్నీ, ఏ వర్గాన్నీ నిర్లక్ష్యం చేయని సుపరిపాలకుడు వైఎస్‌. ఆయన ఆశయాల కొనసాగింపునకు ఆవిర్భవించిన వైసీపీ నేటి నుంచి జరిగే ప్లీనరీలో అందుకు పునరంకితమవుతోంది.

విశ్వసనీయత, ఆపేక్ష, ధైర్యం, కరుణ, జాగరూకత... ఈ ఐదు లక్షణాలూ కలిగిన విలక్షణ వ్యక్తిత్వం వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి సొంతం. కడప జిల్లా జమ్మల మడుగు మిషనరీ ఆస్పత్రిలో 1949 జులై 8న వైఎస్‌ జన్మించారు. ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన తర్వాత, రూపాయికే వైద్యం అందించారు. నాడి చూసి ప్రజల జబ్బులను పసిగట్టి చికిత్స చేసిన ఆయన... 28 ఏళ్ల వయసులోనే రాజకీయ నాయకుడిగా మారి, అతి పిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా జయకేతనం ఎగుర వేశారు. నాలుగు సార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.  ఓటమి ఎరుగని నేతగా చరిత్ర సృష్టించారు.

కీలక నిర్ణయాలు తీసుకోవడంలోనూ, అమలు చేయడంలోనూ అధికారులకు వైఎస్‌ పూర్తి స్వేచ్ఛనిచ్చేవారు. ఉదాహరణకు ఒకసారి కొందరు ఎమ్మెల్యేలు వచ్చి, ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పోస్టులు ఖాళీగా ఉన్నాయనీ, తమ వారికి ఇప్పించాలనీ అడిగారు. అప్పుడు వెంటనే సంబంధిత వర్సిటీ వీసీకి ఫోన్‌ చేసి, ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ ఇవ్వాలనీ, ఎమ్మెల్యేలు చెప్పిన వారికి అర్హతను బట్టి పోస్టులు ఇవ్వాలనీ సూచించారు. అయితే వీసీ 14 ఏళ్లుగా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న వారున్నారనీ, ముందు వారికి అవకాశం ఇచ్చిన తర్వాతే కొత్తవారికి ఉద్యోగాలు ఇస్తే బాగుంటుందనీ అన్నారు. ‘ఓకే! అలాగే కానివ్వండి. వీసీగా మీరే యూనివర్సిటీకి బాస్‌. మేం చెప్పిన వారికే ఇవ్వాలనేం లేదు’ అని వైఎస్‌ ఆయనకు స్పష్టం చేశారు. అదీ ఆయన వ్యక్తిత్వం. అదే సమయంలో ఫైళ్లను ఎప్పటికప్పుడు క్లియర్‌ చేయాలని అధికారులను ఆదేశించేవారు. ఆలస్యం చేస్తే సహించేవారు కాదు.

సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఎస్‌కే జోషి వైఎస్‌ఆర్‌ హయాంలో ఆరేళ్ళ పాటు ఇరిగేషన్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా పని చేశారు. తాను ఆ పదవిలో పనిచేసిన ఆరేళ్లలో ఎన్నడూ, ఏ సందర్భంలోనూ  వైఎస్సార్‌ ‘వీరికి ఈ ఫేవర్‌ చేయండి’ అని చెప్పలేదనీ, పూర్తి స్వేచ్ఛ తమకిచ్చారనీ చెప్పారు. ఇటువంటి అధికారుల సహకారంతోనే వైఎస్‌ పాలనలో అద్భుతాలను ఆవిష్కరించారు.

అనుక్షణం జనహితమే లక్ష్యంగా పనిచేసే వైఎస్సార్‌... రైతు పక్షపాతి. ౖరైతు బాగుంటేనే దేశం బాగుంటుందనీ, లక్ష కోట్లు ఖర్చయినా కోటి ఎకరాలకు సాగు నీరు అందించి, కోట్లాది మంది రైతుల కళ్లలో ఆనందాన్ని చూడడమే తన లక్ష్యమనీ చెప్పేవారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ‘జలయజ్ఞం’ పేరిట సాగునీటి చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. ఐదేళ్లలోనే 80 భారీ, మధ్య, చిన్న తరహా ప్రాజెక్టులు చేపట్టి, 13 పూర్తి చేశారు. దాదాపు 25 లక్షల ఎకరాలకు పైగా భూములకు సాగునీటి సౌకర్యం కల్పించారు. రైతులకు ‘ఉచిత విద్యుత్‌’ చారిత్రక అవసరమని వైఎస్‌ ఉద్ఘాటించారు. ఢిల్లీలో పార్టీ పెద్దలు, కొందరు ఆర్థికవేత్తలు ఈ పథకాన్ని అమలు చేయగలరా అని అనుమానం వ్యక్తం చేశారు. ‘అధికారంలోకి వచ్చి, నేను ముఖ్యమంత్రి అయితే ఈ పథకాన్ని కొనసాగిస్తా. రైతులకు ఉచితంగా కరెంటు ఇవ్వలేని నాడు నేను సీఎం పదవిలో ఒక్క క్షణం కూడా కొనసాగను’ అని తేల్చిచెప్పారు. 2004లో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత తొలి సంతకం ‘ఉచిత విద్యుత్‌’ ఫైలు పైనే చేశారాయన. అనంతర కాలంలో దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్‌ పథకాన్ని అమలు చేస్తున్నారు.

2007లో అమెరికాలో జరిగిన ‘ప్రపంచ వ్యవసాయ వేదిక’ సమావేశంలో భారత్‌ ఏకైక ప్రతినిధిగా వైఎస్‌ పాల్గొన్నారు. అక్కడ ఓ బహుళజాతి విత్తన కంపెనీ ప్రతినిధులు కలిశారు. ఆ కంపెనీకి చెందిన పత్తి విత్తనాల ధరపై అప్పటికే సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వేసిన కేసు నడుస్తోంది. వారు ఆ కేసును వెనక్కి తీసుకోవాలని గట్టిగా కోరారు. అది అంతర్జాతీయ కంపెనీ అనీ, కాస్త పట్టూ విడుపూ ప్రదర్శించమనీ ఢిల్లీలో అత్యున్నత స్థాయిలో ఉన్నవారు కూడా సూచించారు. అయినా వైఎస్‌ వెనక్కి తగ్గలేదు. అనంతర కాలంలో సుప్రీంకోర్టులో కేసు గెలిచారు. తద్వారా ఏటా రూ 3,000 కోట్ల చొప్పున గత 16 ఏళ్లలో రైతాంగానికి దాదాపు రూ 48,000 కోట్లు ఆదా కావటం ఒక చరిత్రాత్మక ఘట్టం. ఆనాడు ఐదు వందల గ్రాముల పత్తి విత్తనాల  ప్యాకెట్‌ ధర దాదాపు 1,600 రూపాయలు ఉంటే, అందులో దాదాపు వెయ్యి రూపాయలు రాయితీగా ఉండేది. విత్తనాల ధరను 750 రూపాయలకు తగ్గిస్తూ వైఎస్‌ ప్రభుత్వం పత్తి విత్తనాల ధరలు నిర్ణయించే చట్టాన్ని తీసుకొచ్చింది. దాదాపు ఐదు రాష్ట్రాలు ఆ చట్టాన్ని అనుకరించడంతో ఆ చట్టం దేశం దృష్టిని ఆకర్షిం చింది. ఆ విషయాన్ని ఉటంకిస్తూ అమెరికాకు చెందిన ప్రఖ్యాత పత్రిక ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ వైఎస్‌ను ఎంతగానో ప్రశంసించింది. వైఎస్‌ రైతుల కోసం ఎంతకైనా తెగిస్తారనడానికి ఈ ఒక్క ఉదంతమే ఉదాహరణ.

ఐదేళ్ల వైఎస్‌ పాలనలో చేపట్టిన పథకాలన్నీ జనరంజకమైనవే. 2003లో రాష్ట్రవ్యాప్తంగా మండుటెండల్లో దాదాపు 1,450 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేసినప్పుడు వైఎస్‌ ప్రతి కుటుంబాన్నీ కలిసి, వారి సమస్యలను తెలుసుకున్నారు. సీఎం అయిన తర్వాత పేదలకు కూడు, గూడు, విద్య, వైద్యం ఉచితంగా అందించాలన్న లక్ష్యాన్ని నెర వేర్చారు. పింఛనుదారులకు ప్రతినెలా 1వ తారీఖునే పింఛన్‌ అందిం చడం వైఎస్‌ పాలనలోనే మొదలైంది. దేశంలో ఎక్కడా లేని మరో వినూత్న పథకం ఫీజు రీయింబర్స్‌మెంట్‌. బడుగు, బలహీన వర్గాల కుటుంబాలకు చెందిన విద్యార్థులకు కొత్త జీవితాన్ని ప్రసాదించిన విశిష్ట పథకం. 2008లో ఉగాది పర్వదినాన రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని ప్రారంభించారు. 2009 ఎన్నికల్లో తిరిగి రెండోసారి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు బాగా పెరిగాయి. దీనిపై పెద్ద చర్చ జరి గింది. చాలామందికి తెలియని విషయం ఒకటి ఉంది. మార్కెట్‌లో ధరలు, ముఖ్యంగా సోనా మసూరీ ధర తగ్గేవరకూ సీఎం, ఆయన కుటుంబ సభ్యులూ 2 రూపాయలకు కిలో బియ్యం రకాన్నే వాడారు. 

పేదవారికి కార్పొరేట్‌ వైద్యం అందించాలనీ, గుండె జబ్బులు సహా ఇతర వ్యాధులతో ఎవరూ మరణించకూడదనీ వైఎస్‌ ‘ఆరోగ్యశ్రీ’ పథకాన్ని ప్రారంభించారు. సామాన్యులకు ఈ పథకం అపర సంజీవనిలా మారింది. 108 అత్యవసర అంబులెన్స్‌ సర్వీసు కూడా ఆయన ప్రారంభించిందే. 104 కాల్‌ సెంటర్‌ ఏర్పాటు గ్రామీణ ప్రజలకు ఇంటి వద్దకే వైద్య చికిత్సను అందించేందుకు చేపట్టిన మరో బృహత్తర పథకం. పావలా వడ్డీ, అభయ హస్తం, జలయజ్ఞం, రుణ మాఫీ, భూపంపిణీ, పశు క్రాంతి, ఇందిరమ్మ ఇళ్లు, స్వయం సహాయక బృందాలు... ఇలా అనేక పథకాలను విజయవంతంగా అమలు చేశారు. ఆయన ఏ రంగాన్నీ, ఏ వర్గాన్నీ నిర్లక్ష్యం చేయలేదు. వైఎస్‌ హయాంలో పాడి పంటలే కాదు, ఐటీ ఎగుమతులు కూడా గణ నీయంగా వృద్ధి చెందాయి.

రైతు సంక్షేమమే ధ్యేయంగా తుది శ్వాస వరకూ పనిచేసిన వైఎస్‌ పుట్టిన రోజైన జూలై 8ని ‘రైతు దినోత్సవం’గా జరుపుకొంటున్నాం. మూడు దశాబ్దాల ప్రజా జీవితంలో వైఎస్‌ ఎనలేని కీర్తి ప్రతిష్ఠలు సంపాదించారు. చివరికి ప్రజల కోసం వెళుతూ, హెలికాప్టర్‌ ప్రమా దంలో ప్రాణాలు కోల్పోయారు. ఒక మనిషి గొప్పతనం ఆయన చనిపోయినప్పుడు తెలుస్తుందంటారు. అది వైఎస్‌ విషయంలో అక్షర సత్యమైంది. భౌతికంగా మన మధ్య లేకున్నా, ఆయన చేసిన సేవ, ప్రవేశపెట్టిన పథకాల రూపంలో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోయారు. 

ఎ. చంద్రశేఖర్‌ రెడ్డి
వ్యాసకర్త రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్‌ సీఈఓ,
వైఎస్సార్‌కు నాటి ప్రెస్‌ సెక్రెటరీ

తాజా వీడియోలు

Back to Top