బాబు 40ఏళ్ల అనుభవం అక్కరకొచ్చిందా..?

అమరావతి : నలభై ఏళ్ల అనుభవం.. రాజధానికి ఒక్క శాశ్వత ఇటుక కూడా వేయలేకపోయింది.. సమర్థుడిని, పాలనాదక్షుడినని చెప్పుకునే నాయకుడి ఐదేళ్ల పాలనలో స్వయంగా సీఎం నివాసానికి కూతవేటు దూరంలోని 2.6 కిలోమీటర్ల ఫ్లైఓవర్‌ పూర్తికాలేదు. దార్శనికుడి ఐదేళ్ల ఏలుబడిలో... రాజధానిలో భాగమైన విజయవాడ, గుంటూరు నగరాలు మురికి కూపాలుగా మారింది వాస్తవం కాదా? నిప్పునని నిత్యం చెప్పుకునే నిజాయితీపరుడి రాజ్యంలో.. లక్షల కోట్లు అవినీతి ఎలా జరిగింది? రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడుతున్నానని ఊదరగొట్టే.. కూలీనెం.1 ఐదేళ్ల పరిపాలనలో చిన్నచిన్న పెండింగ్‌ పనులు సైతం పూర్తికాలేదు. అన్నీ తాత్కాలిక నిర్మాణాలు, ప్రజాధనం దుబారా, విలువలకు తిలోదకాలు.. ప్రచార కండూతి.. ఇవి చంద్రబాబు ఐదేళ్ల పాలనలో అడుగడుగునా కనిపించే సచిత్ర దృశ్యాలు.

అనుభవజ్ఞుడి ఐదేళ్ల అసమర్థ,అవినీతి పాలననే.. స్వర్ణాంధ్ర అనుకుందామా..? 

నలభై ఏళ్ల అనుభవంతో ఆంధ్రావనికి అంతర్జాతీయ స్థాయి రాజధానిని నిర్మిస్తానన్నారు..కాని ఐదేళ్లుగా రాజధాని కోసం కనీసం ఒక్క శాశ్వత ఇటుకైనా వేశారా.. రైతుల నుంచి 35 వేల ఎకరాల పంట భూములు లాక్కోవడం, తన వాళ్లకు కట్టబెట్టడం తప్ప.. రాజధాని నిర్మాణానికి ఒక్క రాయి అయినా ఎత్తారా? లేదే!!మరి అనుభవం అక్కరకొచ్చినట్టా... మాటలతో మభ్యపెట్టినట్టా..?! 
రాష్ట్రానికి శాశ్వత ప్రయోజనాలకోసమే పని చేస్తున్నానంటూ..ఉపన్యాసాలు ఇస్తూ... గత ఐదేళ్లలో రాజధానిలో తాత్కాలిక సచివాలయం..తాత్కాలిక శాసనసభ.. శాసన మండలి.. అన్నీ తాత్కాలిక కట్టడాలే! ఈ తాత్కాలిక నిర్మాణాలకు చదరపు అడుగుకు రూ.11వేలను ఖర్చు చేసి తన కోటరీకి లబ్ధి చేకూర్చడం చంద్రబాబుకే చెల్లింది. 
అవినీతిలో ఎత్తిపోతలు

నిజాయితీ... తాను నిప్పునని పదే పదే చెప్పుకునే చంద్రబాబు ఐదేళ్ల పాలనలో.. ఇసుక, మట్టి, గనుల దగ్గర నుంచి రాజధాని భూముల వరకూ.. జన్మభూమి కమిటీల నుంచి టీడీపీ నాయకులు, ప్రభుత్వ పెద్దల దాకా..  వాటాలు వేసుకొని మరీ సాగించిన దోపడీ పర్వం లక్షల కోట్లు దాటిందన్నది జగమెరిగిన సత్యం కాదా? అంతెందుకు ఒక్క పట్టిసీమ ఎత్తిపోతల్లోనే.. రూ.374 కోట్ల దోచేశారని కాగ్‌ ఇచ్చిన నివేదికే చంద్రబాబు అవినీతికి అధికారిక నిదర్శనం. ఇప్పుడు చెప్పండి.. చంద్రబాబు నిప్పా.. అవినీతి కుప్పా? 
విలువలకు వలువలేవీ?
నైతిక విలువలతో రాజకీయాలు చేస్తున్నా అంటూ పదే పదే చంద్రబాబు చెబుతున్నారు. కానీ.. దేశంలో రాజకీయాల్లో నైతిక విలువలకు వలువలు వదిలింది చంద్రబాబేనని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి సీఎం పీఠాన్ని కైవసం చేసుకున్నాక.. 1996 లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కోవాల్సి వచ్చింది. దేశంలో ఆ ఎన్నికల్లోనే ఓటర్లకు డబ్బులను ఎరగా వేసి..ప్రలోభ పెట్టే కార్యక్రమానికి మొట్టమొదట సారిగా చంద్రబాబే ప్రారంభించారు. 1998 లోక్‌సభ మధ్యంతరఎన్నికల్లో.. 1999 సాధారణ ఎన్నికలు, 2004, 2014 ఎన్నికల్లోనూ ధనప్రవాహాన్ని ఏరులై పారించారు. నంద్యాల ఉప ఎన్నికలో ధనప్రవాహాన్ని పరాకాష్టకు చేర్చారు. ప్రస్తుత ఎన్నికల్లోనూ ఒక్కో నియోజకవర్గానికి సగటున రూ.30 కోట్లు వెదజల్లి.. ఓటర్లను ప్రలోభ పెట్టడానికి పావులు కదుపుతున్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తుంగలో తొక్కి.. వెఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిని రూ.25 కోట్లకుపైగా వెదజల్లి.. కొనుగోలు చేశారు. ఇవీ రాజకీయాల్లో చంద్రబాబు పాటిస్తున్న నైతిక విలువలు..!

దుబారా బాబు 
రెవెన్యూ లోటు, ఆర్థిక పరిస్థితి సహకరించకున్నా.. అందుబాటులో ఉన్న వనరులకు సమర్థవంగా వినియోగించుకుని.. ఒక్క రూపాయి కూడా వృథా చేయకుండా అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపట్టానని చంద్రబాబు పదేపదే చెబుతుంటారు. గత ఐదేళ్లలో హంగులు ఆర్భాటాలు.. విందులు వినోదాలు.. స్వదేశీ, విదేశీ యాత్రలు.. విహారయాత్రలు.. రియాలిటీ షోల పేరుతో భారీఎత్తున ప్రజాధనాన్ని దుబారా చేశారు. రాజధానికి భూమి పూజ పేరుతో ఒకసారి.. శంకుస్థాపన పేరుతో మరోసారి.. ప్రభుత్వ భవనాల శంకుస్థాపన పేరుతో ఇంకోసారి.. రహదారులకు శంకుస్థాపన పేరుతో మరొకసారి.. ఇలా అనేకసార్లు రాజధానికి శంకుస్థాపనలు చేసి భారీగా రూ.250 కోట్లకు పైగా ఖర్చు చేశారు. చివరకు పోలవరం విహారయాత్ర పేరుతో రూ.121.81 కోట్లను దుర్వినియోగం చేశారు. ఇప్పుడు చెప్పండి ప్రజాధనాన్నిసద్వినియోగం చేసుకునే తీరు ఇదేనా? 

ప్రచార యావకి29 మంది బలి
2015లో గోదావరి పుష్కరాల ప్రారంభ ముహూర్తంలోనే గోదావరిలో స్నానం చేస్తే.. పుణ్యం వస్తుందంటూ భారీ ఎత్తున ప్రచారం చేశారు. దాంతో రాజమహేంద్రవరానికి ప్రజలు పోటెత్తారు. సీఎం చంద్రబాబు నిబంధనల ప్రకారం– వీఐపీ ఘాట్‌ వద్ద స్నానం చేయకుండా.. భక్తులకు కేటాయించిన పుష్కర ఘాట్‌లో స్నానం చేసేందుకు వచ్చారు. భారీఎత్తున పోటెత్తిన భక్తుల నడుమ.. పుష్కరాల్లో తన వైభవాన్ని చాటిచెప్పేలా నేషనల్‌ జియోగ్రఫిక్‌ ఛానల్, సినీ దర్శకుడు బోయపాటి శ్రీనుతో చిత్రీకరణకుప్రయత్నించారు. చిత్రీకరణ పూర్తయి.. చంద్రబాబువెళ్లిపోయాక పుష్కర ఘాట్‌లోకి భక్తులను ఒకేసారి వదలడంతో తొక్కిసలాట జరిగి 29 మంది కన్నుమూశారు. చంద్రబాబు వీఐపీ ఘాట్‌లో స్నానం చేసి ఉంటే ఈ ఘోరం జరిగేదా? ఇప్పుడు చెప్పండి చంద్రబాబు ప్రచార కండూతి వల్లే 29 మంది బలయ్యారన్నది వాస్తవం కాదా?! 

నీ అసమర్థ పాలనకు ‘దుర్గమ్మే’ సాక్షి

తన సమర్థతతో, పాలనాదక్షతతో నవ్యాంధ్రను నిర్మిస్తానన్ననాయకుడు.. ఐదేళ్ల పాలన తర్వాత  స్వయంగా ముఖ్యమంత్రి నివాసానికి కూత వేటు దూరంలోని 2.6 కిలోమీటర్ల పొడవైన కనకదుర్గ ప్లైఓవర్‌ను కూడా నిర్మించలేకపోయారు.. కృష్ణా పుష్కరాలు ప్రారంభమయ్యేలోగా అంటే.. ఆగస్టు 12, 2016 నాటికే ప్లైఓవర్‌ను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కృష్ణా పుష్కరాలు పూర్తయి 32 నెలలు గడిచిపోయాయి. కానీ.. ప్లైఓవర్‌ పూర్తి కాలేదు. విజయవాడ నగర ప్రజల ట్రాఫిక్‌ కష్టాలు తీరనేలేదు. ఇప్పుడు చెప్పండి.. బాబు సమర్థుడా.. పాలనా దక్షుడా?! లేక అది ఆయన అసమర్థతకు నిలువుటద్దమా?! సమీక్షలు సరే.. పనులెక్కడ?
హార్డ్‌వర్క్‌.. ప్రజల కోసం రోజుకు 18 గంటలు
పనిచేస్తున్నట్లు ఊదరగొట్టే చంద్రబాబు పాలన అంటే.. ఉత్తి సమీక్షలే సమీక్షలు.. పనులు నత్తనడక.. ఫలితాలు శూన్యం..! అనే విషయం ఏ చిన్న అధికారిని అడిగినా చెబుతారు. ఉదాహరణకు వెలిగొండ ప్రాజెక్టు మొదటి సొరంగంలో కేవలం 3.2 కిమీల పనులు పూర్తి చేస్తే నీటిని విడుదల చేయవచ్చు. కానీ.. ఐదేళ్ల తర్వాత కూడా పనులు ముందుకు సాగక.. ఇప్పటికీ 2.8 కి.మీ. సొరంగం పనులు మిగిలిపోవడాన్ని బట్టి చూస్తేబాబు హార్డ్‌ వర్క్‌ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.  

 

Back to Top