వైయ‌స్ఆర్ ఈఎంసీకి గ్రీన్ సిగ్న‌ల్‌

త్వ‌ర‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ చేతుల మీదుగా వైయ‌స్ఆర్‌ ఈఎంసీ ప్రారంభం

కేంద్రం తుది అనుమతుల జారీ  

గ్రాంట్‌ రూపంలో రూ.350 కోట్లు విడుదల   

యాంకర్‌ కంపెనీగా డిక్సన్‌ టెక్నాలజీస్‌ రూ.300 కోట్ల పెట్టుబడులు 

మొత్తం రూ.748.76 కోట్లతో 540 ఎకరాల్లో వైఎస్సార్‌ ఈఎంసీ అభివృద్ధి 

రూ.10 వేల కోట్ల పెట్టుబడులు, లక్షమందికి ఉపాధి అంచనా 

తొలిదశలో రెడీటూ వర్క్‌ విధానంలో నాలుగు భారీ షెడ్ల నిర్మాణం 

  అమరావతి: ఈఎంసీ–2 పథకం కింద వైయ‌స్సార్‌ కడప జిల్లా కొప్పర్తిలో వైయ‌స్సార్‌ ఎల్రక్టానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్‌ (వైయ‌స్సార్‌ ఈఎంసీ) నిర్మాణానికి కేంద్రం తుది అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీచేసింది. 540 ఎకరాల్లో మొత్తం రూ.748.76 కోట్లతో అభివృద్ధి చేయనున్న ఈ ప్రాజెక్టుకు కేంద్రం గ్రాంట్‌ రూపంలో రూ.350 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర పరిశ్రమలు, పెట్టుబడులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్స్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌టీపీఐ) లేఖ రాసింది.

ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక ఎస్క్రో అకౌంట్‌ ప్రారంభించి రాష్ట్ర వాటాను జమచేస్తే కేంద్రం మంజూరు చేసిన మొత్తాన్ని మూడు విడతల్లో విడుదల చేస్తుంది. వైయ‌స్సార్‌ ఈఎంసీని అభివృద్ధి చేసిన తర్వాత ఎల్రక్టానిక్స్‌ తయారీ రంగానికి చెందిన కంపెనీలు యూనిట్లు ఏర్పాటు చేసేందుకు 347.40 ఎకరాలు విక్రయానికి లేదా లీజుకు అందుబాటులో ఉంటాయని, 92 ఎకరాల్లో రెడీ టు బిల్ట్‌ ఫ్యాక్టరీ షెడ్స్‌ నిర్మిస్తారని కేంద్రం ఆ ఉత్తర్వుల్లో వివరించింది. వైయ‌స్సార్‌ ఈఎంసీ ఏర్పాటుకు అనుమతి కోరుతూ గత సంవత్సరం అక్టోబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి డీపీఆర్‌ సమర్పించగా.. నాలుగు నెలల్లోనే తుది అనుమతులు రావడంపై అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

యాంకర్‌ కంపెనీగా డిక్సన్‌ 
వైయ‌స్సార్‌ ఈఎంసీలో యాంకర్‌ కంపెనీగా డిక్సన్‌ టెక్నాలజీస్‌ ఇండియా లిమిటెడ్‌ రూ.300 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 70 ఎకరాలు డిక్సన్‌ టెక్నాలజీస్‌కు కేటాయిస్తారు. ఈనెల 9వ తేదీన ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని క్యాంపు కార్యాలయంలో కలిసి కొప్పర్తిలో పెట్టుబడులు పెట్టడానికి ఆ కంపెనీ ప్రతినిధులు ఆసక్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు కేంద్రం వైయ‌స్సార్‌ ఈఎంసీకి తుది ఆమోదం తెలపడంతో త్వరలోనే యాంకర్‌ కంపెనీగా డిక్సన్‌ టెక్నాలజీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంటుందని ఏపీఐఐసీ అధికారులు తెలిపారు. లిథియం బ్యాటరీలు తయారు చేసే అవెంజ్, సోలార్‌ విద్యుత్‌కు వినియోగించే పీవీ మాడ్యుల్స్‌ తయారు చేసే రోన్యూ వంటి సంస్థలు కొప్పర్తి ఈఎంసీలో పెట్టుబడులు పెట్టడానికి ఇప్పటికే ప్రాథమిక చర్చలు జరిపాయి. 

త్వరలోనే ప్రారంభం 
వచ్చేనెలలో ఉగాదిలోగా వైయ‌స్సార్‌ ఈఎంసీని ప్రారంభించే విధంగా ఏపీఐఐసీ పనులను వేగంగా పూర్తిచేస్తోంది. ఇప్పటికే రూ.50 కోట్లతో నాలుగు రెడీ టు వర్క్‌ షెడ్ల నిర్మాణం, అంతర్గత రోడ్లు, ఆర్చ్‌ల నిర్మాణం వంటి పనులు చేపట్టింది. ఇందులో రెండు షెడ్ల నిర్మాణం పూర్తి కావచ్చిందని, మరో రెండు షెడ్లు పనులు సగం పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. ఇక్కడ ఏర్పాటు చేసే కంపెనీలు నేరుగా వచ్చిన రోజు నుంచే ఉత్పత్తి ప్రారంభించే విధంగా రెడీ టు వర్క్‌ విధానంలో అన్ని వసతులతో ఈఎంసీని అభివృద్ధి చేస్తున్నారు.

ఇందుకోసం మొత్తం 34 మాడ్యుల్స్‌ (రెడీ టు వర్క్‌ షెడ్స్‌)ను అభివృద్ధి చేస్తున్నారు. 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 30 మాడ్యుల్స్, 2.2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు మాడ్యుల్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఈ వైయ‌స్సార్‌ ఈఎంసీ ద్వారా సుమారు రూ.10 వేల కోట్ల పెట్టుబడులు, లక్షమందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నారు. వైయ‌స్సార్‌ ఈఎంసీలో పెట్టుబడులను ఆకర్షించడానికి ఇక్కడ ఏర్పాటు చేసే కంపెనీలకు ప్రత్యేక రాయితీలు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు కూడా జారీచేసిన సంగతి తెలిసిందే.   
 

తాజా వీడియోలు

Back to Top