అమరావతి: దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలను ప్రజల ముంగిటకే చేరవేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నెలలవారీగా అమలుకు సంబంధించి ప్రత్యేకంగా రూపొందించిన క్యాలండర్‌పై ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో అన్నివర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ముఖ్యంగా నవరత్నాల ద్వారా మహిళలతో సహా పేదలు, అట్టడుగు, బలహీన వర్గాల కోసం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక శాఖ కార్యదర్శి (ఎక్స్ అఫిషియో) జి.విజయ్‌కుమార్ ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. సంక్షేమ పథకాలను ఒక క్రమపద్థతిలో నిర్మాణాత్మకంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, దీనికి అనుగుణంగా 2021–22 సంవత్సరానికి సంబంధించి నెలలవారీగా వార్షిక క్యాలెండర్ విడుదల చేస్తున్నట్లు తెలిపారు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ, జగనన్న గోరుముద్ద, రైతులకు తొమ్మిది గంటల ఉచిత విద్యుత్, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, వైఎస్సార్ ఆరోగ్య ఆసరా, వైఎస్సార్ పెన్షన్ కానుక తదితర పథకాలతోపాటు ఇతర సంక్షేమ కార్యక్రమాల అమలుకు సంబంధించి క్యాలండర్ రూపొందించారు.