అమరావతి : ‘పెట్రో ధరలు పెంచాల్సినంత పెంచేసి, ఆటవిడుపులా ఇప్పుడు అరకొరగా తగ్గించి.. రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలుపుతామంటున్నారు. ఐదో, పదో తగ్గించి.. దాన్ని రాజకీయానికి వాడుకుందామని ప్రయత్నిస్తున్నారు. సర్ చార్జీలు, సెస్‌లు పేరిట చేస్తున్న వసూళ్లలో రాష్ట్రాలకు వాటా లేకుండా చేసిన వారే ఇప్పుడు రాష్ట్రాల గురించి మాట్లాడుతున్నారు. మరో పక్క టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు భారీగా పెట్రో బాదుడు బాది.. ప్రజల నడ్డి విరిచేసి, ఇప్పుడు దాన్ని మరిచిపోయి, తాము పెంచిన పన్నులను తగ్గించాలని కొత్తపాట అందుకొని రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రయత్నాలు ప్రారంభించింది. ఇవి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో గతంలో అధికారంలో ఉన్న టీడీపీ కుయుక్తులు. ఈ నేపథ్యంలో పెట్రో ధరలపై వాస్తవ విషయాలను ప్రజల ముందు ఉంచుతున్నాం’ అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది. ఇరు పార్టీల అసలు స్వరూపాన్ని నేరుగా ప్రజలకే వివరిస్తూ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఇవీ వాస్తవాలు.. ► ముడి చమురు ధర అంతర్జాతీయ మార్కెట్‌లో గణనీయంగా తగ్గినప్పటికీ, అందుకు అనుగుణంగా దేశీయ మార్కెట్‌లో ధరలు తగ్గించలేదు. 2019 మేలో లీటరు పెట్రోలు రూ.76.89, డీజిలు రూ.71.50 ఉండగా, ఈ సంవత్సరం నవంబర్ 1న పెట్రోలు రూ.115.99, డీజిలు రూ.108.66కు ధరలు పెరిగాయి. ఇంత బారీగా ధరలు పెరగడం వాస్తవం కాదా? ► పెట్రోలు, డీజిలు మీద కేంద్రం వసూలు చేస్తున్న మొత్తం పన్నుల్లో రాష్ట్రాల వాటా కేవలం 5.8 శాతానికే పరిమితం. వాస్తవంగా అయితే నేరుగా పన్నుల పేరిట వసూలు చేస్తే రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సి ఉంటుంది. కానీ సెస్‌లు, సర్ చార్జీలు, అదనపు ఎక్సైజ్ డ్యూటీ, అదనపు ప్రత్యేక ఎక్సైజ్ డ్యూటీ పేరిట కేంద్రం వసూలు చేస్తోంది. ఇలా వసూలు చేస్తున్న మొత్తంలో ఒక్క పైసా కూడా రాష్ట్రాలకు వాటా ఇవ్వడం లేదు. ► పెట్రో ఉత్పత్తుల విక్రయాల మీద రూ.3.35 లక్షల కోట్లు వసూలు చేసినప్పటికీ, రాష్ట్రాలకు ఇచ్చిన వాటా రూ.19,475 కోట్లు (5.8%) మాత్రమే. వాస్తవంగా కేంద్రం వసూలు చేసే పన్నుల్లో రాష్ట్రాలకు 41 శాతం వాటా పంచవలసి ఉంది. అయితే పెట్రో ఆదాయాన్ని డివిజబుల్ పూల్లోకి రాకుండా సెస్‌లు, సర్ చార్జి రూపంలో సుమారు రూ.2,87,500 కోట్లు వసూలు చేసి, ఆ మేరకు రాష్ట్రాలకు ఇవ్వవలసిన వాటా తగ్గించిన విషయం వాస్తవం కాదా? ► రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రోడ్ల మీద దృష్టి పెట్టలేదు. ఫలితంగా రోడ్లు దెబ్బతిన్నాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విస్తారంగా వర్షాలు కురిశాయి. ఫలితంగా రోడ్లు ఇబ్బందికరంగా తయారయ్యాయి. ఈ నేపథ్యంలో రూ.2,205 కోట్లతో 8,970 కిలోమీటర్ల మేర రోడ్ల అభివృద్ధి, మరమ్మతులు చేస్తున్న విషయం విదితమే. దీని కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా లీటరు మీద కేవలం రూ.1 మాత్రమే సుంకంగా విధింంచాల్సి వచ్చింది. ► కోవిడ్ వల్ల రాష్ట్ర ప్రభుత్వం రూ.30 వేల కోట్ల రాబడిని కోల్పోయింది. అయినా ఒక్కసారి ఒక్క రూపాయి తప్ప ఎప్పుడూ పెట్రోలు, డీజిలు మీద పన్నులు పెంచలేదన్నది వాస్తవం.