వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ బస్సు యాత్రలో భాగంగా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ ను సందర్శించారు. అక్కడ రిటైర్డ్ ఇంజనీర్లు, ఇరిగేషన్ నిపుణులు, రైతు సంఘాల నాయకులతో కలిసి క్షేత్ర పరిశీలన జరిపారు. నీటి వినియోగం, విడుదల, వ్యవసాయ పరిస్థితుల మీద చర్చించారు. ఈ సందర్బంగా పట్టి సీమతో గోదావరి జిల్లాల రైతులకు పొంచి ఉన్న ముప్పును వారు వివరించారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పట్టిసీమను ఆపించాలని, లేనిపక్షంలో ప్రజలకు ముఖ్యంగా గోదావరి జిల్లాల రైతాంగానికి ఇక్కట్లు తప్పవని విన్నవించారు. ఆ సంభాషణ సారాంశం ఇలా ఉంది.
- గోదావరికి వస్తున్న నీరు చాలా తక్కువగా ఉంది. అంటే అసలు నీటి ప్రవాహం 1,500 క్యూసెక్కులు, సీలేరు నుంచి 4వేలు, బైపాస్ చేయగా వస్తున్నది 2వేల క్యూసెక్కులు. ఉపనదుల ప్రవాహాల్ని కలుపుకొంటే దాదాపు ఏడు ఏడున్నర వేల క్యూసెక్కుల నీరు వస్తోంది. మరి దీని నుంచి ఎనిమిదిన్నర వేల క్యూసెక్కుల నీటిని తోడేసేందుకు పట్టిసీమలో ప్రణాళికలు రచిస్తున్నారు. అంటే దిగువన ఉన్న గోదావరి డెల్టా ఎండిపోవాల్సిందేనా..!
- గోదావరికి వరదలు అంటే జూలై నెల చివరి నుంచి సెప్టెంబర్ చివరి దాకా, తప్పితే అక్టోబర్ దాకా వస్తాయి. దాదాపుగా 60 నుంచి 90 రోజుల పాటు వరదలు పొంగితే గొప్ప. కానీ ఏడాదిలో ఆరు నెలలు, ఏడు నెలల పాటు గోదావరి పొంగుతుందని తెలుగుదేశం నేతలు గొప్పలు చెబుతున్నారు. ఇది వట్టి మాట అని సాక్షాత్తు రిటైర్డు ఇంజనీర్లు కుండ బద్దలు కొట్టి చెబుతున్నా తలకు ఎక్కదా..!
- జూలై నెలాఖరు నుంచి అక్టోబర్ దాకా దాదాపు 10 వేల క్యూసెక్కుల మేర నీరు పారింది అనుకొందాం. ఆ తర్వాత నీటిమట్టం పడిపోవాల్సిందే. మరి అప్పుడు కూడా ఎగువ నీరు తోడటం ఆపుతారా..లేదా..!
- ప్రస్తుతం గోదావరి జిల్లాల రైతులు రెండో పంట మీదనే ఆధారపడుతున్నారు. మొదటి పంట ఎప్పుడూ వరదలు, ప్రకృతి బీభత్సాలకు నష్ట పోతూంటారు. అటువంటి రెండో పంటకు పట్టి సీమ తో ముప్పు పొంచి ఉంది కదా.
- పోలవరం ప్రాజెక్టుపూర్తయితే 194 టీఎమ్‌సీల నీటిని నిల్వచేసుకొనే వెసులుబాటు కలుగుతుంది. అప్పుడు వరద నీటిని ఆపుకొని రెండో పంటకు సమృద్ధిగా నీటిని ఇచ్చుకోవచ్చు.
- పట్టి సీమలో ఎక్కడా నీటిని నిల్వ చేసుకొనే వెసులుబాటు లేదు. అటువంటప్పుడు ఏకబిగిన తోడుకొంటూ పోతే, రెండో పంట నీటి పరిస్థితి ఏమిటి..
- లోకల్ గెజిట్ ఆర్డర్ - 1962 ప్రకారం దిగువ ప్రాంతాలకు మొదటగా నీరు ఇవ్వాల్సి ఉంటుంది. పట్టి సీమ పుణ్యమా అని నీరు తగ్గిపోతే లవణీయత సమస్యను ఎలా ఎదుర్కొంటారు.
- పోలవరం పూర్తయితే అన్ని ప్రాంతాలకు సక్రమంగా నీటి పంపిణీ జరుగుతుంది. ఈ సంగతి ఎందుకు పట్టించుకోవటం లేదు.
- అనవసరంగా కట్టడాలు మొదలెడితే ఎగువ రాష్ట్రాలు దాదాపు 70 టీఎమ్‌సీల నీటిని తీసుకొని వెళతాయి. అప్పుడు దిగువ ప్రాంతాల నీటి ఎద్దడికి ఎవరిది బాధ్యత..
ఇటువంటి ఎన్నో ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయినా సరే చంద్రబాబు ప్రభుత్వం గుడ్డిగా ముందుకు వెళ్లటానికి ప్రయత్నిస్తోందని వైఎస్ జగన్ సునిశితంగా విమర్శలు గుప్పించారు.