ఎ.పి రాజకీయాల్లో ఒకే ఒక్కడు...వైయస్‌ జగన్‌

 

     
పండ‌గ‌లా జ‌న‌నేత పాద‌యాత్ర‌
కష్టనష్టాలను, కన్నీటి వ్యధలను పంచుకుంటున్న ప్ర‌జ‌లు
బాబు పాలనా వైఫల్యాలను ఎండగడుతున్న జైత్రయాత్ర

పది నెలలుగా వైయస్‌ జగన్‌ ప్రజల మధ్యనే నడుస్తున్నారు. వేలు, లక్షలాదిగా జనం ఆయన వెంట తరలివస్తున్నారు. అడుగులో అడుగులేస్తూ నడుస్తున్నారు. ఓవైపు జగన్‌ పాదయాత్రను పండగలా చేసుకుంటూనే, మరోవైపు తమ కష్టనష్టాలను, కన్నీటి వ్యధలను పంచుకుంటున్నారు.
బాబుగారి నాలుగున్నరేళ్ల పాలనలో ధ్వంసమైన తమ జీవిత ముఖచిత్రాలను పట్టిచూపుతున్నారు. ఓవైపు పండుముసలులు, మరోవైపు రోగగ్రస్తులు, సంక్షేమ పథకాలు అందని ఆర్తులు అందరూ తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. వారికి ధైర్యాన్ని నూరిపోస్తూ, నేనున్నానంటూ భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు విపక్ష నేత. జగన్‌ చెంత సామాన్య ప్రజలకు అంతులేని మనో ధైర్యం కలుగుతోంది. రేపటి భవిష్యత్తుపై  ఆశలూ రేగుతున్నాయి.
కనివినీ ఊహించని రీతిలో కదిలిస్తున్న పాదయాత్ర
వైయస్‌ జగన్‌ పాదయాత్ర సంకల్పించి, మొదటి అడుగులు వేసిన  రోజు నుంచి, 3వేల కిలోమీటర్లకు చేరువవుతున్నా, రోజురోజుకూ ప్రజాదరణ పెరుగుతూ పోతూనే వుంది కానీ, తగ్గడం లేదు. ఆయన ప్రతి మాటను ప్రజలు శ్రద్దగా ఆలకిస్తున్నారు. సాక్ష్యాలతో సహా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతుంటే, అవున్నిజమని గట్టిగా మద్దతు పలుకుతున్నారు.

ఇది నిజమే కదా

జగన్‌ కోసం జనం వేలు, లక్షలుగా తరలిరావడానికి కేవలం జనాకర్షణే కారణమా? వైయస్సార్‌ పథకాలు ఇంటింటి దీపాలై వెలగడమే కారణమా? కచ్చితంగా అది వాస్తవమే కావచ్చు. కానీ అదే సమయంలో ఎంత మంది వారసులకు ఇలాంటి జనాకర్షణ వుంది. సాక్షాత్తూ బాబుగారి చినబాబు గురించి ఆలోచించినా, అబ్బే అంత సీన్‌ లేదనిపిస్తుంది. అంతెందుకు పెదబాబుకు కూడా ఇంత జనాకర్షణ లేదు. కాస్త బుద్దివున్న వాళ్లకెవరికైనా ...ఇది నిజమే కదా అనిపించకపోదు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఇంత జనాకర్షణ వున్న నేత జగన్‌ దరిదాపుల్లోనే లేరు. సరే ఆ విషయాన్ని అక్కడితో వదిలేద్దాం. పై రెండు కారణాలే...జగన్‌ మీద జనాభిమానాన్ని ఇబ్బడి ముబ్బడిగా పెంచిందా?
బాబుగారి పాలనే జనాభిమానాన్ని మరింత పెంచిదనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్నికల ముందు బాబుగారు, జనం వెంట పడ్డారు. తానొక్కడే సరిపోడనుకుని అటు నరేంద్రమోడీని, ఇటు పవన్‌ కళ్యాణ్‌ను వెంటపెట్టుకుని తిరిగారు. హామీల కొద్దీ గుప్పించి ప్రజలను మభ్యపెట్టారు. ఆయనే కాకుంటే, తన వెంట నిలిచిన పెద్ద మనుషులతోనూ మరిన్ని హామీలను గుప్పించేలా చేస్తారు. మచ్చుకు ఒకటి ’ఐదేళ్లు కాదు పదేళ్లు ప్రత్యేకహోదా’ అన్న హామీ.

ఆయనొస్తాడని ఊద‌ర‌గొట్టారు

మేనిఫెస్టోలో ఏ ఒక్క వర్గాన్నీ వదలకుండా, ఏ ఒక్క హామీని మరిచిపోకుండా మరీ రంగుల్లో ముద్రించి, ప్రజల కళ్లకు గంతలు కట్టారు. అవి చాలవన్నట్టు, సమాజంలోని సవాలక్ష సమస్యలకు...ఆయనొస్తాడు..ఇక ఏ కష్టమూ లేనట్టేనని, ప్రకటనలకొద్దీ అబద్దాలాడేస్తారు. జాబు కావాలంటే బాబు రావాలన్న ఒక్కటి చాలు...ప్రజల చెవుల్లో చంద్రబాబుగారెంతగా పూలు  పెట్టారో తెలియడానికి. ఆ విధంగా అబద్దాల హామీలతో...మోసపు మాటలతో బాబుగారు ఆ ఎన్నికల్లో ...ఆ విధంగా ...ముందుకు పోయారు. ఇక అంతే, ప్రజలను పట్టించుకుంటే  ఒట్టు. ప్రత్యేకహోదాను తాకట్టు పెట్టేశారు. రుణమాఫీ జరిగిందా?లేదా?అనే నేటికీ తేల్చుకోలేక, బ్యాంకుల నోటీసులను చూస్తూ జనం పిచ్చెక్కిపోతున్నారు. ఇక డ్వాక్రా రుణాల మాఫీ సంగతి సరేసరి! ఏ ఒక్క వర్గానికి ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చని బాబుగారు, ఇదేంటని ఎవరైనా అడిగితే గుడ్లురిమారు. వేలు చూపి మరీ బెదిరించారు. మరి కాస్త ఆందోళన ఎక్కువ చేస్తే, జైల్లో పెట్టించారు. అక్రమ కేసులు పెట్టించారు. గుంటూరులో జరిగిన నారా హమారా సభలో...పాపం, ప్లకార్డులతో ప్రజాస్వామ్య పద్దతిలో నిరసన తెలిపిన ముస్లిం సోదరులను ఏకంగా దేశద్రోహులను తేల్చేశారు. నారాగారి జమానాలో పేదల, దళితుల భూములకు దిక్కులేకుండా పోయింది. అడుగుతీసి అడుగుతీస్తే భూకబ్జాల కన్నీటి కథలు ప్రతిధ్వనిస్తున్నాయి.
రేపటిరోజుల భరోసా
ప్రకృతి వనరులను కొల్లగొట్టేసిన బాబుగారు అండ్‌ కో...ఇప్పటికీ తమను మించిన ప్రజాసేవకులు లేరని డబ్బాలు కొట్టుకుంటుంటే...పాపం జనం బిత్తర పోయి చూస్తున్నారు. ఇంత మోసమా? ఇంత ద్రోహమా? ప్రజలంటే ఇంత నిర్లక్ష్యమా? అని బెంబేలెత్తుతున్న దశలో...సాగుతున్న విపక్షనేత పాదయాత్రలో వారు రేపటిరోజుల భరోసాను చూస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే చంద్రబాబుగారి నాలుగున్నరేళ్ల పాలనా వైఫల్యాలు, అక్రమాలు, దోపిడీ, నేలవిడిచి సాముచేస్తున్న పాలన తీరుతెన్నులు....వెరసి, ప్రతిపక్షనేతను ప్రజానేతగా మార్చేశాయి. జననేత అంటూ జై కొడుతున్నాయి. పాదయాత్ర జనంతో పోటెత్తుతోంది. సముద్రాలను తలపిస్తున్న, జనసముద్రాలిప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టబోతున్నాయి.  అవున్నిజం, ప్రజలకోసం నడిచొచ్చిన మనిషి. ప్రజలలోంచే మాట్లాడుతున్న మనిషి. ప్రజల సాధకబాధకాలు అర్థం చేసుకుంటున్న మనిషి...ఇప్పుడు ఎ.పి రాజకీయాల్లో ఒకే ఒక్కడు...వైయస్‌ జగన్‌. 
రేపటి ఎన్నికల వేళ...ప్రజాతీర్పు
రేపటి ఎన్నికలు... ప్రతి విషయంలో స్వలాభం చూసుకుని, రాజకీయం చేసి మాట్లాడే నారా చంద్రబాబుగారికి, ప్రజల పక్షం నిలిచి, ప్రజాసమస్యలను పట్టిచూపుతూ, రాష్ట్ర సమస్యలపై నిరంతరం పోరాడుతున్న వైయస్‌ జగన్మోహన్‌ల  మధ్యనే  అనడంలో ఎలాంటి సందేహానికి తావు లేదు. రేపటి ఎన్నికల వేళ...ప్రజాతీర్పు... డబ్బు గర్వంతో, టక్కుటమారాది రాజకీయ విద్యలతో తాను గెలిచేస్తానన్న ధీమాలో వున్న బాబుగారి వైపా? ఎందాకైనా మీకోసం అంటూ, ప్రజావిశ్వాసంతోనే రేపటి తన గెలుపు అనుకుంటున్న వైయస్‌ జగన్‌ వైపా? బాబుగారిని దారుణంగా మోసపోయిన ప్రజల పరిణతే తేల్చాల్సిన విషయం. 

 
Back to Top