వైయస్‌ జగనే ఓ ధైర్యం

–5వ తేదీ నుంచి కర్నూలు జిల్లాలో రైతు భరోసా యాత్ర
–శ్రీశైలం నియోజకవర్గం నుంచి ప్రారంభం
– బాబు హామీలతో మోసపోయిన రైతులు
–అప్పుల బాధ తాళలేక అన్నదాతల బలవన్మరణం
– రైతన్నను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం
– చనిపోయిన రైతు కుటుంబాల్లో  ధైర్యం నింపనున్న ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌  

కర్నూలు: రైతులు, రైతు కుటుంబాలు అంటే దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరుడికి ఎంతో ఇష్టం. అందుకే మండుటెండల్లో కాలినడకన రాష్ట్రమంతా పర్యటించిన మహానేత.. ఎక్కడికక్కడ రైతు కుటుంబాల్ని పలకరించారు. వారి కష్టాలు, కడగండ్లను తెలుసుకొన్నారు. నేనున్నా అంటూ భరోసా ఇచ్చారు. అదే బాటలో నేడు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రైతు భరోసా యాత్ర సంకల్పించారు. కష్టాల్లో ఉన్న రైతాంగానికి నేనున్నా అంటూ భరోసా కల్పిస్తున్నారు. అప్పులు తాళలేక ఆత్మ హత్యలు చేసుకున్న కుటుంబాల్లో భరోసా నింపేందుకు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మరో జిల్లాలో రైతు భరోసా యాత్రకు సిద్ధమయ్యారు. కరువుతో అల్లాడుతున్న రైతులను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించింది. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ అనే అబద్ధపు హామీని నమ్మి మోసపోయిన అన్నదాతలు అప్పులు తీర్చే స్థోమత లేక బలవన్మరణాలకు పాల్పడ్డారు. చనిపోయిన రైతు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోకపోవడంతో బాధిత కుటుంబాలు మరింత క్రుంగిపోయాయి. ఇలాంటి సమయంలో చట్టసభలో ప్రభుత్వాన్ని నిలదీసిన వైయస్‌ జగన్‌..తానే బాధిత కుటుంబాలను కలిసి వారిలో భరోసా నింపుతానని వాగ్ధానం చేశారు. ఇచ్చిన మాట కోసం ఆయన ఇప్పటికే అనంతపురం జిల్లాలో రైతు భరోసా యాత్ర చేపట్టారు. ఐదు విడతల్లో బాధిత కుటుంబాలను పరామర్శించి, వారికి ధైర్యం నూరిపోశారు. రాయలసీమలోని మరో కరువు జిల్లా అయిన కర్నూలులో కూడా రైతు భరోసా యాత్రకు వైయస్‌ జగన్‌ సిద్ధపడ్డారు. రుణమాఫీ కాకపోవడం..వ్యవసాయం కలిసి రాకపోవడంతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల్లో భరోసా నింపేందుకు  వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి..జిల్లాలో రైతు భరోసా యాత్రను చేపట్టనున్నారు. శ్రీశైలం నియోజకవర్గంలో జనవరి 5 నుంచి ఈ యాత్ర  ప్రారంభం కానుంది. 

నిద్రపోతున్న సర్కార్‌
ప్రకృతి కరుణించక, చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రాయలసీమ జిల్లాల్లో కరువు పరిస్థితులు రాజ్యమేలుతున్నాయి. వరుస పంట నష్టాలతో అన్నదాతలు కుదేలవుతున్నారు. రైతులను ఆదుకోవడంలో అధికార తెలుగుదేశం పార్టీ విఫలమయ్యింది.  ఎన్నికల ముందు రైతు రుణాలన్నింటినీ మాఫీ చేస్తానని, తాకట్టు పెట్టిన బంగారం విడిపిస్తానని మోసపూరిత వాగ్దానాలతో టీడీపీ అధినేత చంద్రబాబు గద్దెనెక్కారు. తీరా ఎన్నికల్లో గెలిచిన తర్వాత రైతు రుణాలను ఏ మాత్రమూ మాఫీ చేయలేదు. ఏటేటా అప్పుల పెరిగి.. వరుస కరువులతో పంటలు పండక, పండిన పంటకు గిట్టుబాటు ధరలు లేక.. రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.ఇంత జరుగుతున్నా.. చంద్రబాబు ప్రభుత్వంలో ఎలాంటి చలనం రావడం లేదు. అసెంబ్లీ సమావేశాల్లో రైతుల ఆత్మహత్యలపై ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ జాబితాను కూడా సమర్పించారు. అయినకప్పటికీ ప్రభుత్వం నుంచి పెద్దగా స్పందన రాలేదు. బాధిత కుటుంబాల పరిస్థితి దయానీయంగా మారింది. చంద్రబాబు ఒక సందర్భంలో మాట్లాడుతూ ‘‘రాష్ట్రంలో అసలు ఆత్మహత్యలే లేవన్నారు’’. అసెంబ్లీ వేదికగా వైయస్‌ జగన్‌ నిలదీయడంతో ఎవరైన ఆత్మహత్యలకు పాల్పడితే ప్రభుత్వం ఆదుకుంటుందని సీఎం సమాధానం ఇచ్చారు. అయితే ఇంత వరకు ఆత్మహత్య చేసుకున్న రైతు, చేనేత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోలేదు. దీంతో ప్రభుత్వాన్ని మేల్కొలిపేందుకు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రైతు భరోసా యాత్రకు నడుం బిగించారు. ప్రభుత్వానికి తెలియజెప్పేలా ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను పరామర్శించడంతో పాటు ఆయా ప్రాంతాల్లో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులను తెలుసుకునేందుకు, కుటుంబ పెద్దను కోల్పోయిన రైతు కుటుంబాలకు ధైర్యం చెప్పేందుకు, వారికి భరోసా కల్పించేందుకు వైయస్‌ జగన్‌ 2015, ఫిబ్రవరి 22 నుంచి అనంతపురం జిల్లాలో రైతు భరోసా యాత్రకు శ్రీకారం చుట్టారు.  ఐదు విడతలుగా ఆ జిల్లాలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతు, చేనేత కుటుంబాలను పరామర్శించారు.  

యాత్ర సాగేదిలా..
కర్నూలు జిల్లాలో ఈ నెల 5వ తేదీ నుంచి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రైతు భరోసా యాత్ర ప్రారంభమవుతుందని  పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి తెలిపారు. మొదటి విడత రైతు భరోసా యాత్రలో భాగంగా శ్రీశైలం, నంద్యాల నియోజకవర్గాల్లో పర్యటించేందుకు గురువారం ఉదయం వైయస్‌ జగన్‌ హైదరాబాద్‌ నుంచి బయలుదేరి మధ్యాహ్నం శ్రీశైలం సమీపంలోని లింగాలగట్టుకు చేరుకుంటారన్నారు. అక్కడి ప్రజలతో కాసేపు సమావేశమైన అనంతరం శ్రీశైలం డ్యాంను సందర్శిస్తారన్నారు. ఆ తర్వాత సున్నిపెంటకు చేరుకొని రోడ్‌షో నిర్వహిస్తారన్నారు. రాత్రి శ్రీశైలంలో బస చేస్తారని గౌరు తెలిపారు. శుక్రవారం శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న అనంతరం ఆత్మకూరుకు చేరుకుని బహిరంగ సభలో ప్రసంగిస్తారని గౌరు వెంకటరెడ్డి వెల్లడించారు. 
  
 
Back to Top