రోడ్డున పడ్డ పచ్చ పార్టీ పరువు

– వైయస్‌ జగన్‌ వ్యాఖ్యలను రాద్ధాంతం చేయబోయి బొక్కబోర్లా 
– శిల్పా చక్రపాణిరెడ్డి రాజీనామాతో అడ్డంగా బుక్కయిన పచ్చదొరలు
– జననేత ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేక అడ్డగోలు వాదన 
– ఇప్పటికే వైయస్‌ఆర్‌సీపీ గెలుపు ఖాయం.. తేలాల్సింది మెజారిటీయే 

నంద్యాలలో టీడీపీ నాయకుల పరిస్థితి అగమ్య గో చరంగా ఉంది. బ్రహ్మానందరెడ్డిని నంద్యాల టీడీపీ అభ్యర్థిగా ప్రకటించిన నాటిం నుంచే వారు అన్యమనస్కంగానే ప్రచారం చేస్తున్నారు. గెలుస్తామో లేదోనని అనుమానం వారిని వెంటాడుతూనే ఉండేది.  మొన్న జరిగిన వైయస్‌ఆర్‌ సీపీ బహిరంగ సభతో వారిలో నిస్సత్తువ ఆవరించింది. వైయస్‌ జగన్‌ బహిరంగ సభకు తరలివచ్చిన జన సందోహాన్ని చూసి పచ్చ నేతల గొంతులో పచ్చి వెలక్కాయపడింది. ఎప్పుడూ చూసే మనిషిని చూడ్డానికి ఇంత మంది జనాలా అని నోరెళ్ల బెట్టారు. అసలే గెలుపు అవకాశాలపై మళ్లగుల్లాలు పడుతున్న తరుణంలో జగన్‌ రాకతో నంద్యాల్లో సీన్‌ రివర్స్‌ అయ్యింది. వాళ్ల లెక్కలు, అంచనాలు తారుమారయ్యాయి. గెలుపుపై ఆశలొదుకోవడం మంచిదనే నిర్ణయానికొచ్చేశారు. షరామామూలుగానే వైయస్‌ జగన్‌ పోరాటాలను పక్కన పెట్టి ఎక్కడ దొరుకుతాడా? అని తప్పులెతికే పచ్చ దండు నంద్యాల సభపైనా ఆ విధంగానే దృష్టిపెట్టింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా జనాలను మోసగించిన చంద్రబాబు లాంటి వ్యక్తిని ప్రశ్నించకూడదట. శాంతిభద్రతలను కాపాడాల్సిన ప్రభుత్వం తన స్వార్థ రాజకీయాల కోసం వైయస్ జగన్ వ్యాఖ్యలను వక్రీకరించి మరీ దిష్టిబొమ్మలను తగలబెడుతూ హింసాయుత వాతావరణం సృష్టించడం వారి నియంతృత్వ పోకడలకు దర్పణం. 

       వైయస్‌ జగన్‌  వస్తున్నాడనగానే లక్ష మందికి పైగా జనాలు నంద్యాల సభకు తరలొస్తే పచ్చ దండుకు అది కనబడలేదా..? జగన్‌ ప్రసంగిస్తున్న సమయంలో మార్మోగిన జైజగన్ నినాదాలు, చప్పట్లు, ఈలలు, అరుపులతో బ్రహ్మరథం పట్టింది వారికి వినపడలేదా..? మూడు నెలలు కూడా గడవకముందే నైతిక విలువలకు కట్టుబడి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి శిల్పా చక్రపాణిరెడ్డి వైయస్‌ఆర్‌సీపీలో చేరింది పచ్చనేతలకు కానరాలేదా..? నేను స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామా చేస్తున్నానని బహిరంగంగా నంద్యాల ప్రజల ముందు రాజీనామా చేసి వైయస్‌ జగన్‌ చేతిలో పెట్టిన శిల్పా చక్రపాణిరెడ్డి సవాల్‌ గుర్తులేదా..? 21 మంది ఎమ్మెల్యేలు వైయస్‌ఆర్‌సీపీలో గెలిచి పార్టీ మారి టీడీపీలో చేరినప్పుడు  వారి చేత రాజీనామా చేయించాలన్న సోయి ముఖ్యమంత్రికి లేకుండా పోయింది.  నువ్వు రాజీనామా చేస్తే నేనూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి శ్రీశైలం బరిలో తేల్చుకుందామని సవాల్‌ విసిరిన బుడ్డా రాజశేఖర్‌రెడ్డి ఏమయ్యాడో ఇంతవరకు అంతులేదు. ఆయనెక్కడ దాక్కున్నాడో మరి. 

చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లాకు ఎలాంటి హామీలిచ్చారు. వాటిని ఏ విధంగా పక్కన పెట్టేశాడో ప్రతి ఒక్క హామీని వివరంగా చదివి మరీ వైయస్ జగన్  వినిపించారు. రాష్ట్రం విడిపోయాక వచ్చిన మొదటి పంద్రాగస్టు వేడుకలను కర్నూలులో ఆడంబరంగా నిర్వహించిన చంద్రబాబు ఎన్నో రకాల హామీలు గుప్పించి వెళ్లారు. కర్నూలును స్మార్ట్‌ సిటీగా మారుస్తామని,నూతన విమానాశ్రయం, అవుకు వద్ద నూతన పారిశ్రామిక నగరం, హైదరాబాద్‌–బెంగళూర్‌ పారిశ్రామిక కారిడార్‌ ప్రతిపాదన, టెక్స్‌టైల్‌ క్లస్టర్‌ వంటి హామీలు ఏమయ్యాయో తెలీదు. ఎన్నికల సమయంలో ఆలూరు, కోసిగి, ఆత్మకూరులో నిర్వహించిన బహిరంగ సభలో  వేదావతి నదిపై ఎత్తిపోతల పథకం నిర్మాణం, నాగులదిన్నె వంతెన పునర్నిర్మాణం, మంత్రాలయంలో 30 పడకల ఆసుపత్రి, డిగ్రీ కళాశాల ఏర్పాటు, వాల్మీకులను ఎస్సీల్లో చేర్చడం, బుడగ జంగాల హక్కుల రక్షణ లాంటి ఎన్నో హామీలిచ్చి మూడేళ్లయినా పట్టించుకోలేదు. ఇవన్నీ ఏమయ్యాయి బాబు అని వైయస్ జగన్ సంధించిన ప్రశ్నలకు పచ్చపార్టీ దగ్గర సమాధానం కరువైంది.  కర్నూలు జిల్లా టీడీపీ నాయకులకు  చంద్రబాబు చేసిన అన్యాయం గుర్తుకు రాలేదు. ఇంత అన్యాయం చేశాక నంద్యాలకెళ్లి ఏ మొహం పెట్టుకుని ఓట్లడగాలి అని బాబును ప్రశ్నించే ధైర్యం లేదు వారికి. ఎన్నికల బాధ్యతలను చూస్తున్న రాయలసీమ మంత్రులు ప్రజలకు ఏం చెప్పాలో ఆలోచించుకోకుండా పనికిమాలిన ఆరోపణలతో కాలక్షేపం చేయడం వారి దిగుజారుడుతనమే. ఒక బహిరంగ సభలో ప్రతిపక్షం అన్ని ప్రశ్నలు లేవనెత్తితే బాబు దగ్గర సమాధానం లేదు. దమ్ముంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తే అదంతా పక్కనపెట్టి  ఏదో ఆరోపించారని దాన్ని పట్టుకుని వేలాడుతూ ముఖ్యమంత్రిని టీడీపీ నాయకులే స్వయంగా రోడ్డుకు లాగుతున్నారు. జగన్‌ అన్నదాంట్లో తప్పేముందని.. ఆయన చెప్పిన దాంట్లో న్యాయముందిగా అనే స్థాయికి తీసుకొచ్చారు. ఇప్పటికే వైయస్‌ జగన్‌ బహిరంగ సభలో అన్న  మాటలు స్థానికుల మీద తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. నంద్యాల ఉప ఎన్నికల ఏకగ్రీవం అయ్యుంటే ఈమాత్రం అభివృద్ధినైనా మీరు చూడగలిగేవారా అని అన్న మాటలకు నంద్యాల ప్రజలు ఆలోచనలో పడ్డారు. తప్పు చేస్తున్నావ్‌ బాబూ అన్న మాటలు ఇప్పటికే బాగా వైరల్‌గా మారాయి. నంద్యాల అంతటా గోడల మీద వెలిశాయి. బాబు మోసపూరిత పాలనకు ముగింపు పలికేందుకు నంద్యాల ప్రజలు సిద్ధమయ్యారు. 
Back to Top