రాజన్న బిడ్డే కదా.. జగనన్న చెల్లే కదూ!

విజయనగరం :

‘రాజన్న బిడ్డే కదా... జగనన్న చెల్లె లే కదా వస్తున్నది..’ అంటూ గ్రామస్తుల ఆత్రం. ఒక్కసారి శ్రీమతి షర్మిలను చూడాలన్న తపన... కష్టాలు చెప్పుకుందామని రైతన్నల తొందర... మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో శరివాకంరాడె నెల్లిమర్ల, చీపురుపల్లి నియోజకవర్గాల్లో కనిపించిన దృశ్యాలివి. శ్రీమతి షర్మిల శనివారం విజయనగరం శివారులోని మిమ్సు వైద్య కళాశాల సమీపం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. అనంతరం నెల్లిమర్లలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. నాలుగేళ్లుగా బొత్స కుటుంబీకులు పదవులు అనుభవిస్తున్నారని, కానీ స్థానికులకు ఎలాంటి సదుపాయాలూ కల్పించలేకపోయారని విమర్శించారు. కిరణ్ పాలనను ఎండగడుతూనే, చంద్రబాబు అవినీతిని దునుమాడారు.‌ మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలను ఆమె మరోసారి గుర్తుచేశారు.

ఆ తరువాత శ్రీమతి షర్మిల పాదయాత్ర నెల్లిమర్ల రైల్వేస్టేషన్ ‌సమీపానికి సాగి భోజనం విరామానికి ఆగింది. శ్రీమతి షర్మిల అడుగుపెట్టిన ప్రతిచోటా ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. శ్రీమతి షర్మిలకు ఆత్మీయంగా స్వాగతం పలికేందుకు స్థానికులు పూలు పట్టుకుని బారులుతీరి కనిపించారు. శ్రీమతి షర్మిల కూడా అందరినీ ఆప్యాయంగా పలకరించారు.

అక్కడి నుంచి శ్రీమతి షర్మిల సాయంత్రానికి గుర్ల రోడ్డువైపు పాదయాత్ర కొనసాగించారు. నెల్లిమర్ల నియోజకవర్గ ప్రజల వీడ్కోలు, చీపురుపల్లి నియోజకవర్గం అభిమానుల స్వాగత సంబరాల మధ్య శ్రీమతి షర్మిల పాదయాత్ర జాతరను తలపించింది. గుర్ల కేంద్రంలో అశేష జనవాహిని ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు.

అనంతరం కెల్ల రోడ్డులో దివంగ త ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి శ్రీమతి షర్మిల పూలమాల వేసి నివాళులు అర్పించారు. తరువాత గుజ్జంగివలస వరకు పాదయాత్రగా వెళ్లారు. శనివారం రాత్రి 7.10 గంటల సమయంలో ఆమె రాత్రి బసకు వెళ్లారు. శనివారంనాడు 14.3 కిలోమీటర్లు శ్రీమతి షర్మిల పాదయాత్ర కొనసాగింది. మంత్రి బొత్స నియోజకవర్గంలో ప్రజలు అనూహ్యంగా శ్రీమతి షర్మిల పాదయాత్రకు తరలి రావడం చర్చనీయాంశంగా మారింది.

Back to Top