విశాఖలో షర్మిలకు జన నీరాజనం

విశాఖపట్నం 05 జూలై 2013:

అలుపెరుగని బాటసారి.. జగనన్న రాయబారి.. దివంగత మహానేత డాక్టర్  వైయస్ఆర్ తనయ విజయభేరి మోగించేందుకు నగరం నడిబొడ్డున నిలిచింది. ఓ మహిళ 199 రోజులు పాదయాత్ర చేపట్టి సుమారు 2,655 కిలోమీటర్లు నడిచిన ఘనత ప్రపంచం మునుపెన్నడూ చూడలేదు. చరిత్ర కనీవినీ ఎరుగని మహత్తర ఘట్టానికి నగరం వేదికగా మారింది. దీనికి అంతకు మించిన స్థాయిలో నగరవాసులు నీరాజనం పలికారు.  వేల సంఖ్యలో శ్రీమతి వైయస్ షర్మిల వెంట నడిచారు. పాదయాత్రకు ముందు, వెనుక కిలోమీటర్ల మేర రోడ్డుకిరువైపులా అనుసరించారు. డివైడర్లు, రెయిలింగ్ అంతా జనాలే..! శుక్రవారం నాటికి 200 రోజులు, 100 నియోజకవర్గాలకు శ్రీమతి షర్మిల యాత్ర చేరుకోనుంది.

గురువారం ఉదయం గాజువాక సమీపంలోని లంకా మైదానం నుంచి ఉదయం 9.10 గంటలకు శ్రీమతి షర్మిల పాదయాత్ర ప్రారంభమైంది. జాతీయ రహదారి మీదుగా గాజువాక మెయిన్ రోడ్డులో ఉన్న మహానేత విగ్రహానికి  పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా హాజరైన జనసందోహాన్నుద్దేశించి మాట్లాడారు. రాజశేఖరరెడ్డి ప్రభంజనానికి వందనం.. అంటూ ప్రారంభించిన ఆమె ప్రసంగానికి జనం నుంచి కరతాళ ధ్వనులు మిన్నంటాయి. ‘మీ అభిమానానికి మనస్ఫూర్తిగా వందనం.. మీ ఆశీస్సులు శ్రీ జగన్‌మోహన్‌రెడ్డికి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా’ అంటూ ఆమె తన ప్రసంగాన్ని ముగించారు. అంతకు ముందు ముస్లిం పెద్దలు బహూకరించిన ఖడ్గాన్ని ఝళిపించి పార్టీ శ్రేణుల్ని ఉత్సాహపరిచారు. పంచాయితీ ఎన్నికల సమరోత్సాహాన్ని నింపారు. అనంతరం పంతులుగారి మేడ, ఆటోనగర్, బీహెచ్‌పీవీ చేరుకున్నారు. బీహెచ్‌పీవీ కార్మికులు తమ సమస్యల్ని ఆమెకు నివేదించారు. వినతిపత్రం అందించారు. తర్వాత యాత్ర నాతయ్యపాలెం, షీలానగర్ మీదుగా సాగింది. అనంతరం 11.45 గంటలకు ఎయిర్‌పోర్టుకు కూతవేటు దూరంలో మధ్యాహ్న భోజన విరామం కోసం బస చేశారు.

మేళతాళాలు.. బాణసంచా మెరుపులు
సాయంత్రం 4.40 గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభమైంది. వైయస్ఆర్ సేవాదళం, సత్తి యువసేన, జి.వి.రవిరాజు సేన భారీ పతాకాలను చేతపట్టి రోడ్డుకిరువైపులా నిలిచారు. డప్పులు మేళాలు, తప్పెటగుళ్లు తాళాలు, బాణసంచా మెరుపులు ముందుండగా, భారీ సంఖ్యలో పార్టీ నేతలు, అభిమానులు అనుసరించగా శ్రీమతి వైయస్ షర్మిల ముందుకు నడిచారు. కాకానినగర్లో అభిమానులు రోడ్డును పూలబాటగా మార్చారు. అక్కడి నుంచి సాయంత్రం 5 గంటల సమయంలో ఎన్‌ఏడీ కూడలికి చేరుకున్నారు. ఇక్కడే ఉన్న చర్చి పాస్టర్ నుంచి దీవెనలు స్వీకరించారు. అక్కడే ఓ అభిమాని రూపొందించిన దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్‌పై రూపొందించిన  కేలండర్‌ను ఆమె ఆవిష్కరించారు. తర్వాత ఎన్‌ఏడీ కొత్తరోడ్డు వద్ద ఉన్న మహానేత విగ్రహానికి  పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పాత కరాసా, మర్రిపాలెం మీదుగా సాయంత్రం 6 గంటలకు 104 ఏరియాకు శ్రీమతి షర్మిల చేరుకున్నారు. మధ్యలో అభిమానులు రోడ్డుపై కార్పెట్, పూల రేకులు, బెలూన్ల తోరణాలతో షర్మిలకు ఘన స్వాగతం పలికారు. అక్కడే ఆమె టీ విరామం కోసం కాసేపు ఆగారు.

తాజా వీడియోలు

Back to Top