త్వరలో రాజన్న స్వర్ణయుగం: సబ్బం హరి

పాడేరు:

రాష్ట్రంలో త్వరలో రాజన్న స్వర్ణయుగం వస్తుందని అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి  పేర్కొన్నారు. కొద్ది రోజులు ఓపిక పడితే మంచిరోజులు వస్తాయన్నారు. విశాఖ జిల్లా పాడేరులో బుధవారం  ఏర్పాటైన వైయస్ఆర్ కాంగ్రెస్ భారీ బహిరంగ సభకు ఆయన హాజరయ్యారు. అంతకుముందు  భారీ ర్యాలీ నిర్వహించారు. పాడేరు, అరకులోయ నియోజకవర్గాలకు చెందిన సుమారు 5 వేల మంది గిరిజనులు ర్యాలీలో పాల్గొన్నారు. ఓపెన్ టాప్ జీపు నుంచి ప్రజలకు ఎంపీ అభివాదం చేశారు. అనంతరం జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ వంజంగి కాంతమ్మ అధ్యక్షతన మోదకొండమ్మ ఆలయ ప్రాంగణంలో బహిరంగ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలన కోసం రాష్ట్ర ప్రజలంతా ఎదురుచూస్తున్నారన్నారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్  పథకాలను ప్రస్తుత ప్రభుత్వం తుంగలోకి తొక్కిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ పెట్టి ఎన్ని మాటలు చెప్పినా చిరంజీవిని ప్రజలు సినీ నటుడుగానే చూశారన్నారు. డాక్టర్ వైయస్ఆర్ మరణంతో రాష్ట్ర పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు.  శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి వస్తేనే పరిస్థితి మారుతుందని అభిప్రయాపడ్డారు. మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబు మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు విశాఖ ఏజెన్సీలోని బాక్సయిట్ తవ్వకాల ఒప్పందాన్ని రద్దు చేయలేకపోవడం దారుణమన్నారు. అరకు డిక్లరేషన్‌కు అతీగతీ లేకుండా పోయిందన్నారు. జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ వంజంగి కాంతమ్మ మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి మత్స్యరాస బాలరాజు, మాజీ ఎమ్మెల్యే పూడి మంగపతిరావు, జిల్లాలోని పార్టీ సీనియర్ నాయకులు చంటిబాబురాజు, తదితరులు పాల్గొన్నారు.

Back to Top