<br/><br/>ఆర్థిక మంత్రి గతేడాది ఇదే సమయానికి అసలు విషయం బైటపెట్టారు. ఆదాయం ఆశాజనకంగా లేనందున అప్పులతో నెట్టుకొస్తున్నాం అంటూ చెప్పుకొచ్చారు. వార్షిక ఆర్థిక పరిస్థితుల గురించి సమీక్ష చేసిన యనమల ఈరకంగా వాఖ్యానించారు. ఆదాయ ఖర్చుల మదింపు తర్వాత తెలిసిన విషయం ఏమంటే ముఖ్యమంత్రిగారి బినామీలు, ఆయన పుత్రరత్నంగారు ఉన్న శాఖల్లో నిధుల వినియోగం కొండలా పెరిగిపోతోందని. ఓపక్క ఆదాయం తగ్గిపోయి, మరోపక్క ఖర్చులు పెరిగిపోయి రాష్ట్ర ఖజానాపరిస్థితి క్షీణిస్తోందని శెలవిచ్చారు. ఇచ్చిన నిధులకన్నా ఎక్కువ కోరుతున్న, ఎక్కువ ఖర్చు పెడుతున్న శాఖల పేర్లు కూడా యనమల బయటపెట్టారు. అందులో చినబాబు పంచాయితీరాజ్, దేవినేని నీటిపారుదల శాఖ ముందు వరసలో ఉన్నాయట. పట్టణాభివృద్ధి, రోడ్డు భవనాల శాఖలు కూడా తక్కువేం తినలేదంటున్నారు. గత ఏడాదని ఏముంది ప్రతి సంవత్సరం వార్షిక ఆర్థిక స్థితిగతుల పరిస్థితి ఇలాగే ఉంటోంది. ప్రతిఏడూ మొదటి ఆరునెలల్లోనే ఈ శాఖలకు అదనపు నిధులిచ్చామని తేల్చారు యనమల.రాష్ట్ర అభివృద్ధిలో కీలకపాత్ర పోషించే నాలుగు శాఖలు, ఇంత అదనపు వ్యయాన్ని చేస్తూ కూడా ఎలాంటి ఫలితాన్నీ ఇవ్వలేకపోవడంలో ఆంతర్యం ఏమిటి? పంచాయితీ, గ్రామీణాభివృద్ధి శాఖల పనితీరుకు కితాబులు, రివార్డులు బోలెడు వచ్చిపడుతున్నాయ్. కానీ వాటికి ప్రామాణికతే కనిపించడం లేదు. గ్రామాల్లో సరైన తాగునీరు లేదు. మరుగుదొడ్ల కోసం కేంద్రం ఇచ్చిన నిధులను కూడా పచ్చతమ్ముళ్లు మింగేసారు. గ్రామాల్లో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి. పింఛన్లు, ఇళ్లమంజూరులో జన్మభూమికమిటీల జోక్యం ఎక్కువవ్వడంతో గ్రామాల్లో వర్గపోరులు పెరిగిపోయాయి. ఇదీ ముఖ్యమంత్రి తనయుడు లోకేశం గారి గ్రామీణాభివృద్ధిశాఖ అభివృద్ధి. మరి ఇలాంటి అభివృద్ధికి అదనపు నిధులు ఎలా ఖర్చు అయ్యాయో ఆ మంత్రిగారే సమాధానం ఇవ్వాలి. ఇక నీటిపారుదల శాఖ. పోలవరాన్ని 2018కల్లా పూర్తి చేసి తీరుతాం అంటూ బస్తీమే సవాల్ చేసారు దేవినేని ఉమ. 2019కి చేరువైపోతున్నా పోలవరం ఊసే ఉండటం లేదు. ఇటీవలే వచ్చిన కేంద్ర అధికారుల బృందం అంతా తప్పుల తడకలా ఉన్న పోలవరం వ్యయం గురించి, పనుల్లో లోటుపాట్ల గురించి తలంటి వెళ్లింది. ఇక మిగిలిన ప్రాజెక్టుల గతి కూడా ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నచందంగా ఉంది. కాంట్రాక్టర్లను మార్చడం, వారికి అధిక మొత్తాలు చెల్లించడం, ఇచ్చిన కాంట్రాక్టుకే మళ్లీ సబ్ కాంట్రాక్టులు ఇచ్చి, వారికి బిల్లులు చెల్లించడం, ముందస్తు చెల్లింపులు ఇలా నీటిపారుదల శాఖలో కావాల్సినంతగా వృధాగా నిధుల వరదపారుతోంది.. దాదాపుగా ప్రతి శాఖ అనవసరపు ఖర్చులు చేస్తోందని, కొన్నిశాఖల అప్పులు కుప్పలుగా పెరిగిపోతున్నాయని కాగ్ కూడా తప్పుబట్టింది. ఐనా సరే నాలుగేళ్లుగా దిద్దుబాటు చర్యలే లేవు. ఇక ఎన్నికలు సమీపిస్తున్నవేళ అప్పులు, తిప్పలు లెక్కలన్నీ ఎలక్షన్ల హవాలో కొట్టుకుపోనున్నాయి. వీలైనంత కొత్త అప్పులుసృష్టించుకుని రాష్ట్రన్ని మరింతరుణగ్రస్తం చేసి చేతులు దులుపుకునే పనిలో చంద్రబాబు ప్రభుత్వం ఉన్నట్టు అర్థం అవుతోంది.