టీడీపీలో భయం.భయం

– బాబు ఏ క్షణానైనా అరెస్టవుతాడని సందేహాలు
– జగన్‌ ప్రధానిని కలిశాక పార్టీలో అంతర్మథనం
– తప్పుడు కథనాలతో ఆంధ్రజ్యోతి కొత్త ఎత్తుగడ
– కేడర్‌లో శక్తి నింపేందుకు ప్రయత్నాలు 

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలన మీద కంటే వైయస్‌ఆర్‌సీపీ అధినేత జగన్‌పై కక్ష తీర్చుకునేందుకే అత్యధిక సమయం కేటాయిస్తున్నారు.  వైయస్ జగన్ ను నేరుగా ఎదుర్కోలేక చంద్రబాబు దొడ్డిదారిన దొంగ రాజకీయాలు చేస్తున్నారు. ప్రజాసమస్యలపైన, ప్రభుత్వ అవినీతిపై పోరాడుతున్న వైయస్ జగన్ పై కక్ష తీర్చుకునేందుకు బాబు ఓ ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసినా చేస్తాడని పలువురు ఎద్దేవా చేస్తున్నారు. వైయస్‌ జగన్‌ ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకున్న ఎపిసోడ్‌ను టీడీపీ నాయకులు జీడిపాకంలా ఇంకా సాగదీస్తూనే ఉన్నారు. టీడీపీ నాయకుల అభిప్రాయం ప్రకారం జగన్‌కు ఎలాంటి హక్కులు లేవు. ఉండకూడదు కూడా.  ఆయన ప్రధానిని కలవడం తప్పు.. అపాయింట్‌మెంట్‌ ఇచ్చి ప్రధాని వినతిపత్రాలు స్వీకరించడం తప్పున్నర. అంటే ఇక్కడ వైయస్‌ జగన్‌తోపాటు ప్రధాని నరేంద్రమోడీ కూడా తప్పు చేశారంట.. ఇదీ టీడీపీ నాయకులు చేస్తున్న ప్రచారం.

వైయస్‌ జగన్‌పై ఉన్నవి ఆరోపణలు మాత్రమే..
వైయస్ జగన్ పై కేసులకు సంబంధించి ఆరోపణలు మాత్రమే. వీటిపై విచారణ జరుగుతోంది. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. అంతే. కానీ దోషి మాత్రం కాదు. జగన్‌ తప్పు చేశారని ఏ న్యాయస్థానమూ నిర్థారించలేదు. ఆయన ఈమధ్య బెయిల్‌ నిబంధనలు అతిక్రమించారని, కాబట్టి బెయిల్‌ రద్దు చేయాలని దర్యాప్తు సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను సీబీఐ న్యాయస్థానం కొట్టేసింది. టీడీపీ నాయకులకు ఈ సంగతి తెలియదా? మాట మాట్లాడితే జగన్‌పై కేసులున్నాయి అంటూ ఇంతెత్తున ఎగిరిపడే టీడీపీ నాయకులకు తమ అధినేత చంద్రబాబుపై కేసులున్నాయనే విషయం గుర్తు లేదా? బాబు 18కేసుల్లో స్టే తెచ్చుకున్నారు. ఆ విషయం అలా ఉంచితే తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ’ఓటుకు కోట్లు’ కేసులో చంద్రబాబు నిందితుడే కదా...? ఈ కేసు తరువాత చంద్రబాబు ప్రధానిని ఎన్నిసార్లు కలుసుకున్నారో టీడీపీ నాయకులకు తెలియంది కాదు. ప్రధానిని జగన్‌ కలుసుకోవడం తప్పయితే చంద్రబాబు కలుసుకోవడం తప్పున్నర. ఎందుకంటే ముఖ్యమంత్రి ఓటుకు కోట్లు కేసులో సాక్ష్యాధారాలతో సహా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయి కూడ పదవిలో కొనసాగుతున్నారు కాబట్టి. 

ప్రధాని ఫోన్‌ చేసి చెప్పారా..?
చంద్రబాబు ప్రభుత్వంలోనే ఎంతోమంది నేరుగాళ్లున్నారు. వీరిలో హత్యా నేరారోపణలున్నవారు, కిడ్నాపర్లు, ఆర్థిక నేరస్తులున్నారు. మరి అలాంటి వాళ్లని పెట్టుకొని పరిపాలన సాగిస్తున్న చంద్రబాబుని ఏమనాలి..?  ఇక టీడీపీ అనుకూల పత్రిక ‘అమ్మ...జగనా’ అంటూ ఓ కథనం  ప్రచురించింది. ఇదేదో ప్రధాని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు ఫోన్‌ చేసి చెప్పినట్టు ప్రచారం చేసుకుంది. తనకు తెలియంది తెలిసినట్టుగా ఉడికీ ఉడకని వార్తలను అచ్చొత్తి జనం మీదకు రుద్దే ప్రయత్నం చేస్తోంది. బాబు భజన చేస్తూ వైయస్ జగన్ పై విషం కక్కుతోంది.  అభూత కల్పనలతో అసత్య కథనాలు రాస్తూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పత్రికా విలువలను దిగజారుస్తోంది. బాబు తాన అంటే తందాన అంటూ కంపరం పుట్టేంచేవిధంగా అబద్ధపు కథనాలతో పేజీలను నింపేసి ప్రజలపై విసిరిపారేస్తోంది. 

బూతు పత్రికలో చెత్త రాతలు మామూలే...
ఓటుకు నోటు కేసు ఇంతలా జాప్యం జరగకుండా నత్తనడక నడుస్తోందంటే చంద్రబాబు ఢిల్లీలో చేసిన లాబీయింగ్, కేసీఆర్‌తో అనవసరంగా పెట్టుకోకుండా ఉండటమే కారణం కాదా? జైలు శిక్షలు పడినవారికి  తమ శిక్షను రివ్యూ చేయాలని కోరే హక్కు ఉన్నప్పుడు విచారణను  ఎదుర్కొంటున్న జగన్‌కు అన్ని హక్కులుంటాయి. కాదనేందుకు టీడీపీకే కాదు ఏ పార్టీ నాయకులకూ హక్కు లేదు. ఏ పార్టీ నాయకులైనా సరే రాజకీయాలు హుందాగా ఉండాలిగాని దిగజారి వ్యవహరించకూడదు. చేతిలో పత్రిక ఉంది కదా.. కాపాడేందుకు అధికారం ఉంది కదా అని ఇష్టమొచ్చినట్టు పేలితే మూల్యం చెల్లించుకోకతప్పదు. ఇప్పటికే ఆ పత్రిక పక్క రాష్ట్రం తెలంగాణలో మూతబడి అపఖ్యాతిని మూటగట్టుకుంది.  ఐనా కూడ ప్రవర్తనలో మార్పు రాలేదు. ఏపీలోనూ లేనిది ఉన్నట్టు రాస్తూ బాబు బూతు పత్రికగా పేరు గడించింది.  వైయస్‌ జగన్‌ ప్రధానికి రాసిన లేఖలో ఉన్నది ఆరు పేజీలైతే ఏడు పేజీల లేఖ అంటే ఇష్టారాజ్యంగా రాసేసుకున్నారు. అలా రాసినప్పుడే ఆ పత్రిక ఎంత  అబద్ధాల పుట్టనో తెలిసిపోతుంది. పైగా జగన్‌ ప్రధానికి రాసిన లేఖను మీడియా ద్వారా ప్రజలందరికీ తెలిసేలా బహిరంగ పరిచాడు. ఇందులో ఆయన దాచడానికేముంది. తానేదో బ్రహ్మరహస్యాన్ని కనుగొన్నట్టు బాబు భజన మీడియా కలరింగ్‌ ఇచ్చుకోవడం తప్ప. ఇదంతా చూస్తుంటే టీడీపీ వాళ్లను సంతృప్తి పరచడం కోసం రాసినట్టుగా ఉంది.  జగన్‌ ప్రధానిని కలిసొచ్చిన తర్వాత బాబు జైలుకెళతాడని టీడీపీ కేడర్ భయపడుతోంది.   ఈ నేపథ్యంలో షరా మామూలుగా కేడర్‌లో ఉత్తేజం నింపేందుకు వైయస్‌ జగన్‌ మీద బురదజల్లుతున్నారు. ఆంధ్రజ్యోతికి కానీ, టీడీపీకి కానీ ఇవేమీ కొత్త కాదు. టీడీపీ నాయకులకు ఇలాంటి వార్తలు చదవడం వింతా కాదు. అయితే తేలాల్సింది నిజానిజాలు మాత్రమే. అబద్ధాలకేముంది లక్ష ప్రచారం చేసుకోవచ్చు. నిజం అన్నది ఒక్కటే ఉంటుందన్నది మాత్రం నిజంగా నిజం. 
Back to Top