వడివడిగా వైయస్‌ఆర్‌సీపీ.. విడివిడిగా టీడీపీ, బీజేపీ

– కాకినాడలో సమిష్టిగా దూసుకుపోతున్న వైయస్‌ఆర్‌సీపీ
– ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్న టీడీపీ, బీజేపీలు
– బీజేపీకి కేటాయించిన స్థానాల్లో టీడీపీ రెబల్‌ అభ్యర్థులు
– టీడీపీలో మంత్రులకు, ఎమ్మెల్యే వనమాడికి కుదరని సయోధ్య

కార్పొరేషన్‌ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మేయర్‌ పీఠాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా అవసరమైన కార్యాచరణకు సమాయత్తమవుతోంది. 48 డివిజన్లకుగాను మెజార్టీ స్థానాలతోపాటు మేయర్‌ పీఠాన్ని గెలుచుకునేందుకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు అధ్యక్షతన జరిగే సమావేశానికి పార్టీ రాష్ట్ర ప్రధా న కార్యదర్శి, ఎంపీ వి.విజయసాయి రెడ్డి, జిల్లా పరిశీలకులు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, మరో సీనియర్‌ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, కార్పొరేషన్‌ ఎన్ని కల పర్యవేక్షకులు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిలు కాకినాడ ఎన్నికలపై కసరత్తు చేస్తున్నారు. 

ఇద్దరు ముగ్గురు పెట్టుబడిదారుల కోసం యాంకరేజ్‌ పోర్టుపై ఆధారపడ్డ ఎంతోమంది కార్మికులను రోడ్డున పడేయడం.. జన్మభూమి కమిటీల ద్వారా సమాంతర వ్యవస్థను నడుపుతూ టీడీపీ వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. కాకినాడకు డంపింగ్‌ యార్డును ఏర్పాటు చేయలేకపోవడం, గందరగోళంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థ, ట్రాఫిక్‌ సమస్య తదితర సమస్యలను వైయస్‌ఆర్‌సీపీ ప్రధానంగా ప్రస్తావిస్తుంది. పిఠాపురం రాజా స్థలాలు, పోర్టు భూములు, పైడా ట్రస్ట్‌ భూముల కబ్జాలపై విచారణ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. గృహకల్ప మరమ్మతులకు రూ.10 వేలు ఇచ్చినట్టు ప్రకటించి నెలలు గడుస్తున్నా ఒక్క రూపాయి విదల్చకుండా ఉత్తుత్తి ప్రచారం నిర్వహించడంపైనా ప్రధానంగా దృష్టిసారించారు. 

బీజేపీ–టీడీపీకి పొత్తు పోటు
బీజేపీ, టీడీపీ పొత్తు ఇప్పుడు తలనొప్పిగా మారింది. టీడీపీ అభ్యర్థులు బరిలో ఉన్న డివిజన్లో బీజేపీ నాయకులు అటువైపు తొంగిచూడడం లేదు. అలాగే ఇటు  బీజేపీకి కేటాయించిన తొమ్మిది డివిజన్లలోనూ టీడీపీ నాయకులు కూడా ఎక్కడా కనిపించడం లేదు. ఇప్పటి వరకు ఒకరిపై ఒకరు కారాలు, మిరియాలు నూరుకొని కలిసి పనిచేయడం చాలా కష్టమని ఇరుపార్టీ నాయకులు చెప్పకనే చెబుతున్నారు.

కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీడీపీ పొత్తు ధర్మం పాటించట్లేదని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు ఆగ్రహంతో ఉన్నారు. పొత్తు కుదరక ముందు 23 డివిజన్లలో బీజేపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారని, అయితే టీడీపీ పెద్దలతో కలసి సీట్ల పంపకాలపై చర్చలు జరిపాక కుదిరిన పొత్తు ఒప్పందం మేరకు తొమ్మిది స్థానాల్లోనే అభ్యర్థుల్ని ఉంచామని తెలిపారు. మిగిలిన 14 స్థానాల్లోనూ తమ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించారని చెప్పారు. కానీ ఈ 9 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించకుండా పొత్తు ధర్మానికి విరుద్ధంగా వ్యవహరించారని విమర్శించారు.

టీడీపీలోనూ వర్గపోరు
అధికార టీడీపీలో వర్గపోరు చాపకింద నీరులా సాగుతోంది. ఎన్నికల్లో గెలుపుమాట అటుంచితే పార్టీ పరువు బజారున పడిపోతుందోనన్న భయం ద్వితీయ శ్రేణి నాయకుల్లో మొదలైంది. సీట్ల కేటాయింపులో మంత్రులు యనమల, చినరాజప్పలు చక్రం తిప్పడం, ఎమ్మెల్యే వనమాడికి ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ఎమ్మెల్యే వర్గం ‘స్వతంత్రంగా బరిలో నిలిపింది. ఎన్నికల మ్యానిఫెస్టో పేరుతో అధిష్టానం ముద్రించి పంపిన కరపత్రాన్ని విడుదల చేసే కీలక సమావేశానికి ఎమ్మెల్యే హాజరుకాకుండా కినుక వహించడంపై సర్వత్రా చర్చజరుగుతోంది. బీజేపీ కేటాయించిన సీట్లలో వనమాడి వర్గం స్వతంత్రంగా బరిలోకి దిగడం, టీడీపీ అభ్యర్థులున్న చోటా టీడీపీ రెబల్‌గా పోటీలో ఉండడం ఇవన్నీ వనమాడి వెనుకుండి నడిపిస్తున్నారని మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  నగరంలో ఇళ్లు, రేషన్‌ కార్డులు, రోడ్లు, వ్యక్తిగత మరుగుదొడ్లు, తాగునీరు.. ఇలా పలు సమస్యలతో నగరవాసులు సతమతమవుతుంటే గడిచిన మూడేళ్లలో నగరానికి రూ.1212కోట్లతో అభివృద్ధి  పనులు చేశామని జిల్లా పార్టీ కార్యాలయంలో కరపత్రం విడుదల చేశారు. 
Back to Top