స్వామీ.. బాబున్నాడు జాగ్రత్త


– ఏపీలో ఆలయాలకు, దేవుడి మాన్యాలకు, ఆభరణాలకు రక్షణేదీ..?
– గడిచిన నాలుగేళ్లలో భారీగా ఆలయాల కూల్చివేతలు 
– అభివృద్ధి పేరుతో ఆలయ ఆస్తులు అన్యాక్రాంతం
– చంద్రబాబు జేబు సంస్థగా తిరుమల తిరుపతి దేవస్థానం
– విచారణకు ఆదేశించే ధైర్యం చేయలేని స్థితిలో ముఖ్యమంత్రి.. 


చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడంటే దేవుడే భయపడిపోవాలి. ఆయన పాలనలో జనం సంగతి పక్కనపెడితే.. దేవుళ్లు కొలువై ఉండే దేవాలయాలకు కూడా రక్షణ లేకుండా పోతోంది. ఈ మాట కొత్తగా చెబుతున్నది కాదు.. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న నాటి నుంచీ జరుగుతున్నదిదే. పీఠాధిపతుల నుంచి చిన్న చిన్న ఆలయ అర్చకుల వరకు చంద్రబాబుపై విమర్శలు చేయని వారు లేరు. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం విషయానికొస్తే బాబుపై ఉన్న ఆరోపణలకు లెక్కలేదు. టీడీడీని చంద్రబాబు తన రాజకీయ ప్రయోజనాలకే ఎక్కువ వాడుకుంటూ వస్తున్నారు. దేశవ్యాప్తంగా పేరున్న ఏడుకొండల వేంకటేశ్వరుని కీర్తి ప్రతిష్టలు బాబుగారి రాజకీయ దిగజారుడుతనం కారణంగా పతనమై పోతున్నాయి. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నుంచి ఆభరణాల వరకు బాబు జమానాలో లెక్కలకు అందని సేవలుగానే మిగిలిపోతున్నాయి. 

టీటీడీ మెంబర్ల నియామకం ఎప్పుడూ వివాదాస్పదమే...
శ్రీవారి ఆభరణాలు, స్వామివారికి చేస్తున్న సేవలు, జరుగుతున్న అపచారం, ఆలయ అభివృద్ధి తదితర విషయాలను కాసేపు పక్కన పెడితే.. చంద్రబాబు హయాంలో టీటీడీ బోర్డు మెంబర్ల వ్యవహారం ఎప్పుడూ వివాదాస్పదమే. తన రాజకీయ ప్రయోజనాల కోసమే నియామకాలు జరుగుతున్నాయనేది జగమెరిగిన సత్యం. టీటీడీని కూడా రాజకీయాలకు వాడుకునే సంస్కృతికి శ్రీకారం చుట్టిందే చంద్రబాబు. ఒక ఆదికేశవుల నాయుడు, శేఖర్‌ రెడ్డి, ఈ మధ్యనే మహారాష్ట్ర ఆర్థికమంత్రి భార్యకు కూడా అవకాశం కల్పిస్తూ చంద్రబాబు తీసుకున్న నిర్ణయం నవ్వుల పాలైంది. ఒకవైపు బీజేపీని బాహాటంగా విమర్శిస్తూనే.. అదే బీజేపీకి చెందిన మంత్రి భార్యను టీటీడీ బోర్డు మెంబర్‌ను చేయడం బాబు ద్వంద్వ విధానాలకు నిదర్శనం. అన్నింటికన్నా మించి ఇటీవల టీటీడీ బోర్డు చైర్మన్‌గా సుధాకర్‌ యాదవ్‌ నియామకం తీవ్ర వివాదాస్పదమే. చాలా కాలం క్రితమే సుధాకర్‌యాదవ్‌ను బోర్డు చైర్మన్‌గా నియమించనున్నట్లు లీకులిచ్చిన చంద్రబాబు... క్రైస్తవ మత ప్రభోధకుడిని ఎలా నియమిస్తారంటూ ఆరోపణలు రావడంతో వెనక్కు తగ్గినట్టే తగ్గి చివరకు ఆయన్నే చైర్మన్‌ను చేశారు. ఇదే చంద్రబాబు తిరుమలేశుని తన రాజకీయ అవసరాల కోసం కూడా వాడుకున్నారు. 2014 ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నాయకుడు వైయస్‌ జగన్‌ శ్రీవారిని దర్శించుకుంటే క్రైస్తవుడంటూ గగ్గోలు పెట్టించాడు. అనుకూల మీడియా, జనాల ద్వారా పెద్ద ఎత్తున గోబెల్స్‌ ప్రచారం చేయించి లబ్ధిపొందాడు. దేవుడి మీద అంతటి భ క్తి పారవశ్యాలు ప్రదర్శించే చంద్రబాబు.. ఇప్పటివరకు రాజధాని, రాష్ట్రం అభివృద్ధికి సంబంధించి జరిగిన ఏ పూజా కార్యక్రమాల్లోనూ బూట్లు లేకుండా పాల్గొనలేదు. ఇక గోదావరి పుష్కరాల సమయంలో జరిగిన తొక్కిసలాటకు బాబు ఏవిధంగా కారకుడై 30 మంది ప్రాణాలు పోవడానికి కారకుడయ్యాడో అందరికీ తెలిసిందే. 
ఆలయ ఆస్తులకు రక్షణేది..?
వందల కోట్ల విలువైన వజ్రాన్ని హారం నుంచి తొలగించారనీ, దాన్ని అంతర్జాతీయ మార్కెట్‌లో విక్రయించార ని రమణదీక్షితులు ఆరోపిస్తున్నారు. గతంలో కనకదుర్గ ఆలయంలో అమ్మవారి ఆభరణాలు పోయాయి. ఆ దర్యాప్తు ఏమైంది. తిరుమల పోటులో రహస్య తవ్వకాలు.. కర్నూలు జిల్లా చెన్నపల్లికోట రహస్య తవ్వకాలు, దుర్గమ్మ గుడిలో క్షుద్ర పూజల వ్యవహారం.. 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక అప్పట్నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల కూల్చివేతల ప్రహసనం కొనసాగుతూనే ఉంది. గతంతో బాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వెయ్యి కాళ్ల మండపం కూల్చివేత అప్పట్లో పెద్ద సంచలనమైంది. ఇటీవల కలెక్టర్లతో జరిగిన ఓ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ ఆలయాలకున్న ఆస్తులన్నీ అమ్మేయాలని చెప్పడం వివాదానికి తెరలేపింది. 
 
Back to Top