శెభాష్ వైఎస్ జగన్


మూడేళ్ల కిందట వైఎస్ జగన్ ఓ మాటన్నారు. ప్రత్యేక హోదా అంశాన్ని ఎన్నికల అజెండాగా మారుస్తా అని ఛాలెంజ్ చేసారు. మూడేళ్ల క్రితం ఆయన చేసిన ఆ ఛాలెంజ్ నేడు వాస్తవమై మనముందు కనిపిస్తోంది. ప్రత్యేక హోదా వల్ల ఏమొస్తుంది అన్నాడు బాబు. హోదాను మించింది ప్యాకేజీ అని చెప్పాడు. హోదా పేరు ఎత్తితే పిడి యాక్టు నమోదు చేస్తా అన్నాడు. దేశంలో ఎక్కడా ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని 14వ ఆర్థిక సంఘం చెప్పేసిందని, భవిష్యత్ లో ప్రత్యేక హోదా ఉండదు కనుకే అంతకంటే మెరుగైన ప్యాకేజీకి ఒప్పుకున్నామని చెప్పాడు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్యాకేజీకి ఒప్పుకోవాలని తాను తీసుకున్న నిర్ణయం సరైందే అని సమర్థించుకున్నాడు. ప్రత్యేక ప్యాకేజీ ద్వారా రాష్ట్రానికి బోలెడంత మేలు చేసారని కేంద్రానికి ధన్యవాదాలు చెప్పాడు. వెంకయ్యకు సన్మానమూ చేసాడు. కానీ నేడు అదే చంద్రబాబు విభజన హామీలు, ప్రత్యేక హోదా సంజీవని, హోదా ఇవ్వకుండా కేంద్రం మోసం చేసిందంటూ చిందులు తొక్కుతున్నాడు. ప్రత్యేక హోదా పనికిరాదు అన్న చంద్రబాబు నోటితో హోదా కోసం దీక్షలు చేస్తున్నాం, హోదా కోసం కేంద్రంతో పోరాడుతాం అని చెప్పేలా చేసారు వైఎస్ జగన్. ప్రత్యేక హోదా కాంగ్రెస్ ఇస్తానంటోందని, హోదా ఇస్తామన్న వారితో పొత్తు పెట్టుకుంటామని టిడిపి చూచాయీగా ప్రజలకు చెప్పాలనుకుంటోంది. ప్రత్యేక హోదా అనే తెలుగు ప్రజల సెంటిమెంట్ ను మరోసారి ఉపయోగించుకోవాలని అనుకుంటోంది. గతంలో చెప్పిన ప్యాకేజీ మాటలకు పులిస్టాప్ పెట్టి మమ్మల్ని గెలిపించండి, హోదా తెస్తాం అని మరోసారి మాయ చేద్దామని శతవిధాలా ప్రయత్నిస్తోంది. అందుకే అవిశ్వాస తీర్మానం అంటూ వెళ్లి, బుర్ర బొప్పి కట్టించుకుని తిరిగి వచ్చింది. 
హోదాపై బాబు టంగ్ ట్విస్టులు చూస్తున్న ప్రజలు అవిశ్వాస ఫలితం ఎలా ఉండబోతుందో ముందే ఊహించారు. వారు ఊహించినట్టే అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. పేలవమైన టిడిపి ఎంపిల తీరు బట్టయబలైంది. హోదా కోసం మూడేళ్లుగా నిరంతరం పోరాడుతూ, కేంద్రంతో ఢీకొట్టి, ఎంపిల రాజీనామాలతో, ఆమరణ నిరాహాదరీక్షలతో తమ నిజాయితీ నిరూపించుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల మనసులను గెలుచుకుంది. హోదా వద్దన్న ప్రతి ఒక్కరి నోటితో ప్రత్యేక హోదా కావాల్సిందే అని అనిపించింది. దీనికి కారణం వైఎస్ జగన్. ఎన్నిసార్లు చంద్రబాబు ప్రత్యేక హోదా గురించి హీనంగా మాట్లాడినా, ప్రజల దృక్పథాన్ని మార్చాలనుకున్నా, జగన్ తన పోరాటంతో హోదా ఆశలను సజీవంగా నిలిపారు. మూడేళ్ల క్రితం తాను చెప్పిన మాటను చేసి చూపించారు. ప్రత్యేక హోదా గురించి తానొక్కడే కాదు ప్రతి ఒక్కరూ మాట్లాడేలా చేశాడు. పార్లమెంట్ లో అవిశ్వాసం వరకూ వెళ్లేలా చేసాడు. దేశం యావత్తూ దీని గురించి దృష్టి సారించేలా చేశాడు. అధికార టిడిపి నుంచి, నిన్న పుట్టిన జనసే వరకూ, అడ్డగోలు విభజనతో రాష్ట్రానికి ఈ దుస్థితిని పట్టించిన కాంగ్రెస్ నుంచి, తటస్థంగా ఉన్న వామపక్షాల వరకూ ప్రతి ఒక్కరూ నేడు జగన్ బాట పట్టారు. హోదా నినాదం చేస్తున్నారు. దాన్ని తమ ఎన్నికల అజెండాగా మార్చుకుంటున్నారు. అందుకే నేడు ప్రతి తెలుగు వాడూ చెబుతున్నాడు జయహో జగనన్నా...నీవల్లే మా హోదా ఆశలు సజీవంగా నిలిచాయన్నా అంటున్నారు. హోదాను ప్రతి ఒక్కరి ఊపిరి చేసి, హోదా ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేసి, హోదా కోసం రాష్ట్రాన్ని కదిలించి, కేంద్రంతో పంతం పట్టేదాకా తెచ్చిన యువ నాయకుడు వైఎస్ జగన్ కు హేట్సాఫ్.   

 
Back to Top