షర్మిల యాత్రలో ఉరకలెత్తిన ఉత్సాహం

ఉరిమే ఉత్సాహంతో యువత బైక్‌లపై ముందు సాగితే.. మోటార్ కార్మికులు ఆటోలపైన.. వారి వెనుక రైతులు బండెనక బండి కట్టగా.. నడుమ మహిళలు, వృద్ధులతో కలిసి షర్మిల పాదయాత్ర జోరుగా సాగింది. చరిత్రలో మహాసంగ్రామానికి ఊపిరులూదిన పోతుగడ్డ నూజివీడు రానున్న ఎన్నికల యుద్ధంలో శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డికి బాసటగా ఉంటానంటూ జనంతో పోటెత్తింది. డప్పుదళాల కోలాహలం మధ్య అభిమానులు పూలజల్లు కురిపిస్తూ.. తమ కష్టాలు చూసేందుకు వచ్చిన శ్రీమతి వైయస్ షర్మిలకు బ్రహ్మరథం పట్టారు. ఆమె చేపట్టిన మరోప్రజాప్రస్థానం పాదయాత్ర శుక్రవారం 118వ రోజు నూజివీడులో సాగింది.
నూజివీడు, 13 ఏప్రిల్ 2013:

కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని మొర్సపూడి నుంచి తుక్కులూరు, నూజివీడు వరకు శుక్రవారం శ్రీమతి వైయస్ షర్మిల పాదయాత్ర సాగింది. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ కుమార్తె, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి షర్మిల వెంట జన తరంగం ఉవ్వెత్తున ఎగిసిపడింది. అడుగడుగునా మహిళలు ఎదురేగి ఆమెకు స్వాగతం పలికారు. తుక్కులూరులో జేబీఎల్ వృద్ధాశ్రమంలోని వృద్ధులు ఎంతో ఓపికగా రోడ్డుపైకి వచ్చి ఆమెను చూసి ఆనందం వ్యక్తం చేశారు. రాజన్న తనయను నిండుమనస్సుతో దీవించారు. ఎలా ఉన్నారు..? అంటూ వారిని ఆప్యాయంగా పలకరించిన ఆమె ముందుకు సాగారు. తుక్కులూరులో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు. పాదయాత్రకు వచ్చిన వికలాంగురాలు ప్రత్తిపాటి రాజ్యలక్ష్మి మాట్లాడుతూ..దివంగత మహానేత  డాక్టర్ వైయస్ వికలాంగులకు పింఛన్లు ఇచ్చి ఆదుకున్నారనీ, ఇప్పుడు ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదనీ  వాపోయారు. మరికొన్ని నెలలు ఓపికపట్టాలని, జగనన్న వస్తాడని, మనందరినీ రాజన్న రాజ్యం స్థాపించే దిశగా నడిపిస్తాడని శ్రీమతి షర్మిల ఆమెకు భరోసా ఇచ్చారు.

వైయస్ ఉంటే నీరిచ్చేవారు..

నూజివీడు నియోజకవర్గం నాలుగేళ్లుగా నిర్లక్ష్యానికి గురైందని, అదే మహానేత ఉండి ఉంటే ఇక్కడి సమస్యలు యుద్ధప్రాతిపదికన పరిష్కారమయ్యేవని శ్రీమతి షర్మిల చెప్పారు. నూజివీడు ప్రధాన సెంటర్‌లో శుక్రవారం నిర్వహించిన బహిరంగసభలో ఆమె స్థానిక సమస్యలను ప్రస్తావించడంతో ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. నూజివీడు పట్టణంలో మంచినీటి సమస్య పరిష్కారానికి వైయస్ఆర్ 2008లో రూ. 66 కోట్లు కేటాయించారని  గుర్తుచేశారు. వైయస్ ఉంటే ఆ పనులు పూర్తిచేయించి నీరిచ్చేవారన్నారు. వైయస్ సీఎంగా ఉన్నప్పుడు ఎమ్మార్ అప్పారావు కాలనీలో నాలుగు వేల మందికి ఇళ్ల పట్టాలిచ్చి పక్కా ఇళ్లు నిర్మించారని, ఆ కాలనీ ఇప్పుడు సరైన రోడ్లు, పక్కాడ్రెయిన్లు లేక, మంచినీరు రాక తీవ్ర అసౌకర్యాలతో సతమతమవుతోందని వివరించారు.

మామిడి రైతును ఆదుకోవాలి..

నూజివీడు మామిడికి రాష్ట్రవ్యాప్తంగా ప్రాముఖ్యత ఉన్నా.. మామిడి సాగును నమ్ముకున్న రైతు మాత్రం తీవ్రంగా నష్టపోతున్నాడని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రస్తుతం మంగు తెగులు సోకి మామిడి దిగుబడి తీవ్రంగా దెబ్బతింటుందని, దీంతో రైతులు తీవ్రంగా కుదేలవుతున్నారని చెప్పారు. గతంలో మంగుతెగులు సోకితే మామిడి రైతును ఆదుకునేందుకు హెక్టారుకు రూ.4,500 ఇన్‌పుట్ సబ్సిడీగా అందించి మహానేత ఆదుకున్నారని గుర్తుచేశారు. ప్రస్తుతం మంగు తెగులు సోకి మామిడి రైతు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నా కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. బంగినపల్లి మామిడి ధర టన్ను రూ. 35 వేల నుంచి రూ. 15 వేలకు పడిపోయిందని, మామిడి పరిశోధన స్థానం ఏర్పాటు చేసి ఏళ్లు గడుస్తున్నా శాస్త్రవేత్తలు కూడా అందుబాటులో లేరని ధ్వజమెత్తారు.

షర్మిలను కలిసిన విజయమ్మ:
మొక్కవోని దీక్షతో పాదయాత్ర చేస్తున్నశ్రీమతి షర్మిలను శ్రీమతి వైయస్  విజయమ్మ శుక్రవారం కలిశారు. తుక్కులూరులో బసచేసిన కుమార్తె వద్ద విజయమ్మ కొద్దిసేపు ఉండి అనంతరం తెనాలి వెళ్లారు. అక్కడి నుంచి మళ్లీ నూజివీడులో బస చేసిన శ్రీమతి షర్మిల వద్దకు చేరుకున్నారు.

Back to Top