షర్మిల అడుగులో అనంత వాసుల అడుగులు

అనంతపురం, 26 అక్టోబర్‌ 2012: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి ఎక్కుపెట్టి వదిలిన బాణం అనంత పల్లెల నుంచి వడివడిగా ముందుకు దూసుకుపోతోంది. తనను తాను మహానేత రాజన్న పాదంగా అభివర్ణించుకున్న షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రత్యర్థుల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. ఇచ్చిన మాట కోసం, ప్రజల బాగు కోసం నిలబడే కుటుంబంలోని వ్యక్తిగా షర్మిల ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, వారికి మేమున్నామంటూ భరోసా ఇస్తూ ముందుకు సాగిపోతున్నారు. షర్మిల పాదయాత్రను పురస్కరించుకుని అనంత వీధులు, దారులు జనసంద్రంగా మారిపోతున్నాయి.‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి తమ గుండెల్లో బతికే ఉన్నారని, ఎప్పటికీ సజీవంగా ఉంటారంటున్నారు అనంతపురం జిల్లా వాసులు. అధికార పక్షం తమను ఎన్ని ఇబ్బందులు పెట్టినా మహానేత కుమార్తె షర్మిల అడుగులో అడుగై మద్దతుగా నిలుస్తామంటున్నారు. తాగడానికి నీళ్ళు ఇవ్వకపోయినా, పంటలు ఎండిపోయినా, సంక్షేమ పథకాలు తమ దరి చేరనివ్వకపోయినా... చివరకు తమను జైలుకు పంపించినా మహానేత వైయస్‌ కుటుంబాన్ని వీడబోమని ప్రతిన పూనుతున్నారు.

రైతులు తమ జీవితాలు గడవక స్వస్థలాల నుంచి వలసలు వెళ్ళిపోతుంటే ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని మోహన్‌రెడ్డి అనే రైతు షర్మిల పాదయాత్రలో వాపోవడం గమనార్హం. నోటితో వైయస్‌ఆర్ పేరు ఉచ్ఛరించినా తమకు రావాల్సిన పథకాలేవీ రాకుండా చేస్తున్నారని చెప్పడాన్ని బట్టి అధికార, ప్రతిపక్షాలు ఎంత ప్రజా వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయో చెప్పకనే చెబుతోంది. జై జగన్‌ అంటే నీళ్ళు కూడా రానివ్వకుండా ఆ పార్టీల నేతలు చేస్తున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. చివరికి తాగడానికి నీళ్ళు కూడా లేకుండా చేస్తుండడం వారి వికృత చేష్టలకు పరాకాష్టగా మారిందని చెప్పవచ్చు. ఫ్లెక్సీలు పెడితే జైలులో పెట్టిస్తామని బెదిరించారని మోహన్‌రెడ్డి అనే రైతు షర్మిలకు చెప్పుకున్నప్పుడు అందరినీ కలచివేసింది. తాము జైలుకైనా పోతాం కాని వైయస్‌ కుటుంబాన్ని విడిచిపెట్టే ప్రశ్నే లేదని ఆయన కరాఖండిగా చెప్పడం వైయస్‌ కుటుంబం పట్ల అన్నదాతలకు ఉన్న ప్రేమాభిమానాలను తెలియజేస్తున్నాయి.

ఏ నాయకుడికీ రానంత భారీ స్థాయిలో షర్మిల పాదయాత్రకు జనం స్పందన లభిస్తోంది. అనంత దారులన్నీ జనదారులుగా మారిపోయాయి. అనంత జిల్లా పల్లెలు రాజన్న కుమార్తెకు ఘన స్వాగతం పలుకుతున్నాయి. అనంతపురం జిల్లావాసుల మనస్సులు అంతులేని ఆనందంతో కేరింతలు కొడుతున్నాయి. జగనన్న చెల్లెలు తమ చెల్లెలే అని అనంతవాసులు అడుగులో అడుగై ఆమె వెంటే నడుస్తున్నారు. కిలో మీటర్ల మేర దారుల వెంట జనం బారులై నడుస్తున్నారు. రహదారి చాలని చోట పొలాలకు అడ్డంపడి మరీ వారు అభిమానంతో షర్మిల పాదయాత్రలో భాగస్వాములవుతున్నారు.

ప్రజా వ్యతిరేకులకు దేవుడే బుద్ధి చెబుతాడు:

కాగా, అసమర్థ ప్రభుత్వంపై ప్రధాన ప్రతిపక్షం టిడిపి ఎందుకు అవిశ్వాసం పెట్టడంలేదని షర్మిల తన మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో నిలదీస్తున్నారు. పాదయాత్ర పేరుతో ఆ పార్టీ అధ్యక్షుడు నాటకాలు ఆడుతున్నారని విమర్శిస్తున్నారు. వీధి నాటకాలు ఆపి, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్‌ పార్టీపై తక్షణమే అవిశ్వాసం పెట్టాలని షర్మిల డిమాండ్‌ చేస్తున్నారు. అనంతపురం జిల్లాకు సాగు, తాగునీరు ఇవ్వాలన్నది దివంగత వైయస్‌ రాజశేఖరరెడ్డి సంకల్పమని చెబుతున్న షర్మిల తొమ్మిదేళ్ళ పాలనలో సాగునీటి కోసం పది వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదని ఆరోపించారు. కేవలం ఐదేళ్ళ పరిపాలనా కాలంలో వైయస్‌ వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం 50 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ఎన్నో కరవులను ఎదుర్కొన్న అత్యంత వెనుకబడిన అనంతపురం జిల్లాకు జలయజ్ఞంలో  ప్రత్యేకంగా మేలు చేయాలనుకున్నారని చెబుతున్నారు. ప్రత్యేక శ్రద్ధతో సాగు, తాగునీటి సౌకర్యం కల్పించకపోతే అనంతపురం జిల్లాలో అసలు మనిషన్నవాడు బతికే వీలే ఉండదని ఆయన భావించారన్నారు. ప్రజలను ఇంతగా ఇబ్బందుల పాలు చేస్తున్న అధికార, ప్రతిపక్ష నాయకులకు ఆ దేవుడే తగిన బుద్ధి చెబుతారని సాంత్వన కలిగిస్తున్నారు.

పందాలు కట్టొద్దు: వృద్ధ రైతుకు షర్మిల హితవు:

వైయస్‌ఆర్ కాంగ్రెస్‌పై ఎవ్వరూ పందాలు కట్టొద్దని షర్మిల పిలుపునిచ్చారు. వైయస్‌పై అభిమానం ఉన్నవారు ఆయన ఆశయాలు, జగన్మోహన్‌రెడ్డి లక్ష్యాలను విస్తృతంగా ప్రచారం చేయాలని విజ్ఞప్తి చేశారు. వచ్చే ఎన్నికల్లో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధిస్తుందని, అధికారంలోకి వస్తుందని పి. రామాంజనేయులు అనే వృద్ధ రైతు ఐదెకరాల పొలాన్ని పందెం కాయడానికి సిద్ధమైన విషయం తెలుసుకున్న షర్మిల అతనిని పిలిచి మాట్లాడారు. పందాలు కట్టొద్దని, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని సూచించడం అందరినీ ఆకట్టుకున్నది.

తాజా వీడియోలు

Back to Top