తండ్రి అడుగు జాడల్లో తనయ

ప్రజాసమస్యలపై సమరం ప్రకటించి మరో ప్రజాప్రస్థానానికి శ్రీకారం చుడుతూ వార్తల్లో వ్యక్తిగా నిలచిన షర్మిల దివంగత మహానేత వైయస్.రాజశేఖర్ రెడ్డి సంక్షేమ సైద్ధాంతికతకు సిసలైన వారసురాలు. ప్రజలకు మేలు చేకూర్చే అనేక పథకాల రూపకల్పనలో వైయస్‌ ఆమెతో తన ఆలోచనలను పంచుకునేవారు. మొదట కడప ఉప ఎన్నికలలో గడప గడపకూ జగన్ గెలుపు కోసం ప్రచారం చేసిన షర్మిల కీలకమైన, చురుకైన పాత్రను నిర్వహించారు. పిన్నలనూ పెద్దలనూ ఆదరంగా పలకరిస్తూ అభివాదం చేస్తూ ఆమె ప్రచారపర్వం సాగిపోయింది. ఆ తర్వాత ఉప ఎన్నికలలో కూడా ఆమె తన తల్లి, వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మతో కలిసి విస్తృతంగా ప్రచారం చేశారు. నిజానికి ఆ ఎన్నికలలో ఆమే పార్టీ స్టార్‌ క్యాంపైనర్‌.
''నేను రాజన్న కూతుర్ని. జగనన్న చెల్లెల్ని. నా పేరు షర్మిల'' అంటూ తనను తాను వినమ్రంగా పరిచయం చేసుకునే తీరు అందరినీ ఆకట్టుకుంది. తండ్రి వైయస్‌లా ప్రచారరథంపై నుండి చేతులూపుతూ ఆమె తననిలా పరిచయం చేసుకోవడంతోటే జనం ఉత్సాహంగా హర్షధ్వానాలు చేయడం ఆమె పాపులారిటీకి నిదర్శనం. ప్రతిచోటా ఇదే దృశ్యం.
ఆమె చెప్పింది జనం శ్రద్ధగా ఆలకించారు. ఆమె మాటలతో ఏకీభవించారు. ఎన్నికలలో వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీకి ఓట్ల వర్షం కురిపించడంలో షర్మిల కరిష్మా ఎంతో తోడ్పడింది. జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాలనీ, మళ్లీ 'రాజన్న రాజ్యం' తెచ్చుకోవాలని పిలుపునిస్తూ, పార్టీ ఎన్నికల గుర్తు ఫ్యాన్‌ను చూపుతూ ఓట్లు కోరారు. జగన్ జైలు నుండి బయటకు వస్తారనీ, తండ్రి రాజశేఖర రెడ్డి అందించిన సంక్షేమరాజ్యాన్నితిరిగి తెస్తారనీ ఆమె భరోసా ఇచ్చారు. ఆమె ప్రచారం సాగినచోట్లల్లా ట్రాఫిక్ స్తంభించిపోయేది. ఉప ఎన్నికలలో వైయస్ఆర్‌ కాంగ్రెస్ ప్రభంజనంలో షర్మిల నిర్వహించిన భూమిక పార్టీకి కొత్త సత్తువను, నైతికస్థైర్యాన్నీ అందించింది. జనసామాన్యానికి అర్థమయే తేలికైన మాటలలో ఆమె ప్రచారం సాగిపోయింది.
ప్రజల నాడిని గమనించి మసలుకోవడం ఆమె ప్రత్యేకత. షర్మిల ఏ హోదాలో మరో ప్రజాప్రస్థానం నిర్వహిస్తారో చెప్పాలని మీడియా సమావేశంలో ఒకరు విజయమ్మను అడిగారు. అందుకు ఆమె ఇచ్చిన సమాధానం ఆసక్తికరం. "రాజశేఖర్ రెడ్డి కూతురిగా, జగన్‌ చెల్లెలుగా షర్మిల పాదయాత్ర చేస్తారు. వైయస్‌ రక్తాన్ని ఎవరైనా నమ్ముతారు. మాకు విశ్వసనీయత ఉంది." అని విజయమ్మ ధీమాగా బదులిచ్చారు.
ఇడుపుల పాయ నుండి ఇచ్ఛాపురం వరకు సుమారు మూడు వేల కిలోమీటర్ల దూరం సాగే మరో ప్రజాప్రస్థానం పాదయాత్రకు పూనుకున్న షర్మిల ప్రజాకర్షణ తిరుగులేనిది. అన్ని చోట్లా-చివరకు తెలంగాణవాదం బలంగా ఉన్న పరకాలలో సైతం-షర్మిల రోడ్‌ షోలు విజయవంతం అయ్యాయి. లక్షలాదిగా జనం ఆమె సభలలో పాల్గొన్నారు.  ప్రజాసమస్యలపై స్పష్టత, నిబద్ధత ఆమె ప్రత్యేకత. పులివెందులలో అనాథ బాలల ఆశ్రమాన్ని నిర్వహిస్తున్న షర్మిల, తండ్రి అడుగుజాడలలో సుమారు మూడువేల కిలోమీటర్ల 'మరో ప్రజాప్రస్థానా'నికి పూనుకోవడంతో మరోసారి ఆమె సాహసం వెల్లడైంది. ప్రజాసమస్యలపై పోరాటం చేయడంతో పాటు బాబు పాదయాత్రలోని డొల్లతనాన్ని వెల్లడి చేస్తూ, తరవెనుక కాంగ్రెస్, టిడిపిల లోపాయికారీ లాలూచీని ఎండగడుతూ, కడగండ్లపాలవుతున్న జనసామాన్యానికి రాజన్నరాజ్యం పట్ల భరోసా కల్పిస్తూ షర్మిల తలపెట్టిన ప్రజాప్రస్థానం కొనసాగుతుంది.

Back to Top