'రాజన్నకూతురు షర్మిలక్కా వచ్చెరా మన పల్లెకు...'


మహబూబ్‌నగర్ 3 డిసెంబర్ 2012 :రాజన్నకూతురు షర్మిలక్కా..వచ్చెరా మన పల్లెకు...అంటూ ఆమె తనదైన బాణీలో గొంతెత్తి పాడగా చెట్టూపుట్టా, పిల్లా మేకా కూడా చెవులు రిక్కించి విన్నాయి. పాలమూరు జిల్లాలో ఆదివారం షర్మిల పాద యాత్రకు ఎదురేగి ప్రజాగాయకురాలు రమాదేవి తన ఆటపాటలతో మరో ప్రజాప్రస్థానాన్ని ఆహ్వానించారు. అనేక ప్రజా ఉద్య మాలలో మమైక్యమవుతూ పాటే ప్రాణంగా బ్రతికే రమాదేవి రాజన్న కూతుర్ని చూడగానే దివంగత మహానేతను తలచుకుని కన్నీరు పెట్టారు.
'రాజన్న మళ్లీ నాకు కనిపించలేదక్కా' అంటూ రమాదేవి బిగ్గరగా ఏడ్వడంతో అక్కడున్నవారంతా కూడా కన్నీరు పెట్టారు. షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్రకు సంబంధించి పల్లెలలో ప్రచారం కోసం రమాదేవి పాటలు కట్టి పాడుతున్నారు. ఆదివారం లాల్‌కోట గ్రామం వద్ద రమాదేవి షర్మిలను కలిశారు. షర్మిలను చూడగానే ఆమె దుఃఖం కట్టలు తెంచుకుంది. గాద్గదిక స్వరంతోనే 'పేదల పెన్నిధి జగనన్నచెల్లెలు వచ్చెరా మన పల్లెకు...' అంటూ ఆమె పాట పల్లవి పాడగా జనం గొంతు కలిపారు. ఆమె పాటకు పక్కనే ఉన్న శ్రీ వై.వి.సుబ్బారెడ్డి కళ్లలో నీళ్లు తిరిగాయి. స్పందించిన షర్మిల 'పాలమూరు జిల్లా కళలు, కళాకారులకు పుట్టిల్లు. నాన్న మీద మీరు చూపిస్తున్న అభిమానానికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం' అంటూ రమాదేవిని ఆప్యాయంగా అక్కున చేర్చుకున్నారు.

.

Back to Top