వైయస్‌ఆర్ కుటుంబం వెంటే వరుణుడు‌!

వసంత (విజయనగరం జిల్లా),

11 జూలై 2013: ‘వరుణదేవుడు కూడా మాతోనే ఉన్నాడు’ అని ఆనాడు దివంగత మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి చెప్పిన మాట మరోమారు నిజమని రుజువైంది.‌ మహానేత రాజన్న తనయ, జననేత జగనన్న సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర విజయనగరం జిల్లాలో హుషారుగా కొనసాగుతోంది. మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రను ఆమె గురువారం జిల్లాలోని వసంత నుంచి యాత్రను ప్రారంభించారు. ఓ వైపు వర్షం పడుతున్నా శ్రీమతి షర్మిల తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు. పిల్లలు, పెద్దలను ఆప్యాయంగా పలకరిస్తూ ఆమె ముందుకు కొనసాగుతున్నారు. మహిళలను ప్రభుత్వ పథకాల అమలు గురించి ఆరా తీస్తూ ముందుకు కదులుతున్నారు.

పాదయాత్ర 206వ రోజు గురువారంనాడు పలువురు రైతులు తమ సమస్యలను శ్రీమతి షర్మిలకు వివరించారు. గజపతినగరం నియోజకవర్గంలోని తుమ్మగెడ్డ కారణంగా రెండు వేల ఎకరాల భూమి మునిగిపోతున్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు పని చేయించుకోలేదని శ్రీమతి షర్మిల అడిగిన ప్రశ్నకు.. ఒక రైతు సమాధానం ఇస్తూ... ఆయన హయాంలో 8 కోట్ల 38 లక్షలు విడుదల చేసినా, మంత్రి బొత్స సత్యనారాయణ నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెప్పారు.‌ జగనన్న నేతృత్వంలో వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత సమస్యను పరిష్కరిస్తారని శ్రీమతి షర్మిల వారికి హామీ ఇచ్చారు.

వరుణుడి ఆశీర్వాదం - జనం నీరాజనం:
శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర బుధవారంనాడు గజపతినగరం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో జోరు వానలో కూడా అప్రతిహతంగా కొనసాగింది. లొట్టలపాలెంలో షర్మిల యాత్ర ప్రారంభించి వేటపాలెం, కొత్త భీమసింగి మీదుగా భీమసింగి చేరుకున్నారు. అక్కడ మధ్యాహ్న భోజన విరామం తీసుకున్నారు. అనంతరం పాదయాత్రకు సిద్ధమవుతుండగానే ఆకాశంలో కారుమబ్బులు కమ్ముకున్నాయి. ఏ క్షణమైనా వర్షం వచ్చే సూచనలు కనిపించాయి. పాదయాత్ర ప్రారంభమైంది. శ్రీమతి షర్మిల రోడ్డు మీదకు వచ్చేసరికే కుంభవృష్టి మొదలైంది. దీంతో యాత్ర కాసేపు ఆగుతుందేమో అని గ్రామస్తులు భావించారు. కానీ శ్రీమతి షర్మిల మాత్రం వెనుకడుగు వేయలేదు. పెద్దగాలితో పాటు భారీ వర్షం కురుస్తున్నా.. ఆమె మొక్కవోని దీక్షతో ముందుకే కదిలారు. ‘వాన తగ్గాక వెళ్లొచ్చు కాసేపు ఆగమ్మా...’ అని గ్రామస్తులు వారిస్తున్నా ఆమె అడుగులు ముందుకే సాగాయి.

వైయస్‌ కుటుంబం ఎక్కడుంటే అక్కడ వానలుంటాయ్!:
జోరువానలో కూడా నడుస్తూ ముందుకు సాగుతున్న శ్రీమతి షర్మిలను చూసి ప్రజలు విస్తుపోయారు. రాజన్న బిడ్డకు ఇంత కష్టం వచ్చిందా... అంటూ ఆవేదన వ్యక్తంచేశారు. తెరలు తెరలుగా ఓ వైపు వర్షం పడుతున్నా.. ఆగకుండా ఇళ్లలో నుంచి తనను వాత్సల్యంతో చూస్తున్న గ్రామస్తులకు అభివాదం చేస్తూ చిరునవ్వుతో గమ్యం దిశగా సాగిపోయారు శ్రీమతి షర్మిల. ‘వైయస్ కుటుంబీకులు ఎక్కడుంటే అక్కడ వానలుంటా‌య్‌రా...’ అంటూ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

త్వరలోనే మంచి రోజులు :
‘త్వరలోనే మంచి రోజులు వస్తాయి. జగనన్న ముఖ్యమంత్రి అయ్యూక అందరి సమస్యలను పరిష్కరిస్తారు’  అని శ్రీమతి షర్మిల గొర్రెల పెంపకందారులకు భరోసా ఇచ్చారు. పాదయూత్రలో భాగంగా జామి మండలంలోని గొడికొమ్ముకు చెందిన గొర్రెల పెంపకందారులు కొందరు శ్రీమతి షర్మిలను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. బీమా సౌకర్యం లేకపోవడంతో గొర్రెలు చనిపోతే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. భీమసింగి సహకార చక్కెర కర్మాగారం పరిధిలోని పలువురు చెరకు రైతులు కొత్త భీమసింగి వద్ద స్థానిక వైయస్ఆర్‌ కాంగ్రెస్ నాయకుడు బండారు పెదబాబు ఆధ్వర్యంలో తమ కష్టాలను వివరించారు. మద్దతు ధర లేకపోవడంతో ఆర్థికంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

అన్నం పెట్టే మిల్లును మూ‌సుకోవాల్సి వచ్చిందమ్మా!
విద్యుత్ చార్జీల బాదుడు.. ఆకాశాన్నంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలు.. కడుపు నిండా తిండి లేదు.. చేతినిండా పని దొరకదు.. ప్రజల బాధలు పట్టించుకోని సర్కారు.. ఎప్పటికైనా మంచి రోజులు రాకపోతాయా అని జనం ఎదురుచూపులు.. సరిగ్గా అదే సమయంలో తమ గోడు చెప్పుకునేందుకు ఓ ఆశాకిరణం కనిపించింది. రాజన్న బిడ్డ.. జగనన్న చెల్లెలు తమ ఊ‌ళ్ళకు వస్తోందని తెలిసి ఆయా గ్రామాల వారు సంబరపడ్డారు. జోరున వర్షం కురుస్తున్నా శ్రీమతి షర్మిల ఆగకుండా నడుస్తూ వస్తుండడం చూస్తుంటే రాజన్న పట్టుదలే ఆమెలోనూ కనిపించింది. వెంకటరాజుపాలెం గ్రామానికి చెందిన చొప్పా అప్పారావు రోడ్డుపైనే ఆమె కోసం ఎదురుచూశాడు. ఆమె రాగానే తన బియ్యం మిల్లును చూపించి కన్నీరుమున్నీరయ్యాడు. విద్యుత్ చార్జీలు భారంగా మారిపోవడం, స‌ర్‌చార్జీల బాదుడు తన కష్టాన్ని మింగేస్తోందన్నాడు. సర్కారు తీరు వల్ల రూ. 20 లక్షల విలువైన మిల్లును మూసేయాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు.

పాల సేకరణ ధర పెంచాలి :
విఆర్‌పాలెం శివారులో పాలు విక్రయించుకునే మహిళలు రామవరపు శ్రీమతి షర్మిలను కలిసి తమ గోడు వినిపించారు. ఈ ప్రాంతంలో 50 కుటుంబాలు సమీపంలోని డెయిరీలకు పాలు ఇస్తున్నారు. అయితే డెయిరీల మధ్య పోటీతత్వం వల్ల ఆవు పాలు లీటర్‌కు రూ. 20 ఇస్తుంటే, గేదె పాలకు రూ. 30 ఇస్తున్నారు. పాలలో ఫ్యాట్‌ను బట్టి ధర కడుతున్నారు. దీని వల్ల గడ్డి, తౌడు కొనుగోలు చేసి నిర్వహణ ఖర్చులు కలిపితే తమకు మిగిలేది తక్కువేనని శ్రీమతి షర్మిలకు వారు వివరించారు. చంద్రబాబు హెరిటేజ్ డెయిరీ ని‌ర్వాహకులు తక్కువ ధరకే పాలు సేకరిస్తున్నారని ఆరోపించారు. ధరలు పెంచితే తమ జీవితాలు బాగుపడతాయని తెలిపారు. దీనికి స్పందించిన శ్రీమతి షర్మిల పాడి రైతుల కోసం వైయస్‌ఆర్‌ ఎన్నో చేశారని, జగనన్న కూడా అధికారంలోకి వచ్చాక తప్పకుండా సమస్యలను పరిష్కరిస్తారని భరోసా ఇచ్చారు.

Back to Top