ప్రత్యేక ప్రార్థనలు.. సేవా కార్యక్రమాలు

హైదరాబాద్:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు వివిధ కార్యక్రమాలు చేపట్టారు. జగన్నినాదాలు మార్మోగిస్తూ తమ నేతకు సంఘీభావంగా సేవాకార్యక్రమాలు చేశారు. అన్నదానాలు చేశారు. వైద్య శిబిరాలు నిర్వహించారు. శ్రీ జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు  పురస్కరించుకొని అభిమానులు, పార్టీ నేతలు, కార్యకర్తలు అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉచిత మెగా వైద్యశిబిరాలు, రక్తదానం, పేదలకు దుస్తులు, వికలాంగులకు చక్రాల కుర్చీలు, వృద్ధులకు చేతికర్రలు అందించారు. ఆసుపత్రులలో పండ్లు, విద్యార్థులకు నోట్‌ పుస్తకాలు, పెన్నులు పంపిణీతో పాటు పెద్ద ఎత్తున అన్నదానం చేశారు. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కై శ్రీ జగన్మోహన్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేయించడానికి నిరసనగా పార్టీ శ్రేణులు నల్లబ్యాడ్జీలతో ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించాయి.

ప్రత్యేక ములాఖత్ ద్వారా కలిసిన కుటుంబ సభ్యులు
     చంచల్‌గూడ జైల్లో ఉన్న శ్రీ జగన్మోహన్‌రెడ్డిని కుటుంబసభ్యులు ప్రత్యేక ములాఖత్ ద్వారా కలిశారు. జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయనను కలిసిన వారిలో తల్లి శ్రీమతి వైయస్ విజయమ్మ, భార్య శ్రీమతి వైయస్ భారతి, కుమార్తెలు చిరంజీవులు హర్ష, వర్ష, శ్రీమతి వైయస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి, కుమార్తె అంజలి ఉన్నారు. వారు తిరిగి వెళ్లే ముందు జైలు బయట పార్టీ నేతల కోరిక మేరకు శ్రీమతి విజయమ్మ కేక్‌ను కట్‌చేశారు. అంతకుముందు వైయస్ఆర్ కాంగ్రెస్ మైనారిటీ విభాగం కన్వీనర్ హెచ్.ఎ. రెహ్మాన్ జైలు వద్ద కేక్ కట్ చేసి, పావురాలను గాల్లోకి ఎగురవేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన జగన్మోహన్ రెడ్డి జన్మదిన కార్యక్రమాల్లో పార్టీ నేతలు డాక్టర్ ఎమ్.వి. మైసూరారెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, నల్లా సూర్యప్రకాశ్, బి. జనక్‌ప్రసాద్, గట్టు రామచంద్రరావు, ఎమ్.వి.ఎస్. నాగిరెడ్డి, పుత్తా ప్రతాప్‌రెడ్డి, పి.ఎన్.వి. ప్రసాద్, చల్లా మధుసూదన్‌రెడ్డిలతో పెద్ద ఎత్తున అభిమానులు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. రాజధానిలోని పలు ప్రాంతాల్లో పార్టీనేతలు నిరసన, సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
     శ్రీ జగన్మోహన్ రెడ్డి అక్రమ అరెస్టును నిరసిస్తూ చిత్తూరు జిల్లాలో 100 మంది మహిళలు మదనపల్లె నుంచి తిరుమలకు పాదయాత్ర ప్రారంభించారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆయన పేరున ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీబీఐ తీరును నిరసిస్తూ కడపలోని వైయస్‌ఆర్ సర్కిల్ నుంచి కలెక్టరేట్ ఏడు రోడ్ల కూడలి మీదుగా కార్యకర్తలు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. అనంతపురంలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. గుంటూరుజిల్లా నరసరావుపేటలో రెండుచోట్ల 40 కేజీల భారీ కేక్‌లను కట్‌చేశారు. రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ప్రకాశంజిల్లా ఒంగోలులోని బధిరుల పాఠశాలలో అన్నదానం నిర్వహించారు. నెల్లూరులో నిర్వహించిన భారీ ర్యాలీలో సుమారు 300 మీటర్ల పొడవైన పార్టీ జెండా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శ్రీ జగన్మోహన్ రెడ్డి నిర్దోషనీ, ఆయనను విడుదల చేయాలంటూ రాష్ట్రపతికి పంపేందుకు బుజబుజనెల్లూరులో రక్తంతో సంతకాల సేకరణ చేశారు.

పొలం పనులు
     కృష్ణాజిల్లా నందివాడ మండలం జనార్ధనపురంలో వైఎస్సార్ గ్రామ సమైక్య సంఘ సభ్యులు వరి పొలంలో కట్టేత పనులు చేసి రూ. ఏడువేలు సంపాదించారు. ఆ మొత్తాన్ని గ్రామంలో మంచినీటి చెరువుల అభివృద్ధికి వినియోగించనున్నట్లు చెప్పారు. విజయవాడలోని సింగ్‌నగర్‌లో అంధుల పాటల కచేరీ నిర్వహించారు. నల్లగొండజిల్లా సూర్యాపేటలో భారీ కేక్‌ను కట్‌చేసి, వికలాంగునికి వీల్‌చైర్‌ను అందించారు. జగన్ విడుదల కాకుండా ప్రభుత్వం కుట్రపన్నడాన్ని నిరసిస్తూ ఖమ్మంలో పార్టీ కార్యకర్తలు రోడ్డు ఊడ్చారు. కరీంనగర్‌జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని అయ్యప్ప ఆలయానికి ఒక గదిని విరాళంగా ప్రకటించారు.

తాజా వీడియోలు

Back to Top