హైదరాబాద్: ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ గట్టిగా పోరాటం చేస్తోంది. ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తూ ఢిల్లీలో ధర్నా చేయాలని తలపెట్టింది. కానీ అధికారంలో ఉన్న తెలుగుదేశం, పైగా కేంద్రంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ ప్రత్యేక హోదా మీద మాట్లాడటం లేదు. ప్రత్యేక హోదా మీద గట్టిగా డిమాండ్ చేయటానికి కానీ, ప్రధాని రాజ్యసభలో ప్రకటన చేసినప్పటికీ ఎందుకు ఇవ్వటం లేదని కోర్టులో వ్యాజ్యం వేయటానికి కానీ తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వం ఇష్ట పడటం లేదు. ఇందుకు చంద్రబాబు చేస్తున్న పనులే అడ్డంకిగా నిలుస్తున్నాయి.
వాస్తవానికి విభజన తో ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయింది. రెవిన్యూ బాగావచ్చే హైదరాబాద్ ను కోల్పోవటంతో ఆర్థికంగా కుదేలు అయిపోయిన పరిస్థితి. దీనికి తోడు విభజన అడ్డదిడ్డంగా జరగటంతో కష్టాలు మరింత పెరిగాయి. దీంతో పరిస్థితి బాగోలేదని చెప్పి వేడుకొంటే ప్రత్యేక హోదా కోసం ప్రయత్నించవచ్చు. చంద్రబాబు నాయుడు చేస్తున్నపనులు చూస్తుంటే ఈ విషయాల్ని నమ్మలేని పరిస్థితి. ఆర్థికంగా వెలిగిపోతున్న రాష్ట్రాలు కూడా చేయలేని పనులకు ప్రయత్నించటం, అంతకు మించి ప్రచారం చేసుకోవటంతో అసలుకే ముప్పు వస్తోంది.
ప్రపంచం నివ్వెర పోయేలా రాజధానిని కడతామని పదే పదే ప్రకటనలు చేస్తున్నారు. లక్ష ఎకరాలలో రాజధాని వచ్చేస్తోందంటూ మాస్టర్ ప్లాన్ తయారు చేయించి ఊరూ వాడా పంచుకొన్నారు. ఇంతటి శక్తి గల రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎందుకున్న ప్రశ్న రాకుండా ఉంటుందా..!
ఇక, చంద్రబాబు చేస్తున్న విదేశీ పర్యటనలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. 2 నెలలకోసారి బ్యాచ్ ను వెంట పెట్టుకొని ప్రత్యేక విమానం పెట్టుకొని విదేశీ పర్యటనలకు వెళ్లి వస్తున్నారు. ఇందు కోసం వందల కోట్ల రూపాయిలు ప్రభుత్వం ఖజానా నుంచి ఖర్చుపెడుతున్నారు. ఇంతటి దుబారాను ఎవరు సమర్థిస్తారు.
కితం పుష్కరాలకు వంద కోట్ల రూపాయల లోపు ఖర్చు అయితే ఈసారి 16వందల కోట్ల రూపాయిలకు పైగా చేసి, జాతీయ స్థాయిలో ప్రచారం చేయించుకొన్నారు. వేడుకలకు ఈ స్థాయిలో ఖర్చు పెట్టగలిగే డబ్బు ఉన్నప్పుడు ప్రత్యేక హోదా ఎలా అడుగుతారు అనే ప్రశ్న రానేవస్తుంది.
రైతుల రుణ మాఫీ మొత్తంగా లక్ష కోట్ల రూపాయిల్ని దాటేసింది. దీన్ని పూర్తిగా అమలు చేయగలుగుతాం అని పదే పదే చెబుతున్నారు. లక్ష కోట్ల రూపాయిల్ని ఒక పథకం మీద వెచ్చించగలిగే శక్తి ఉందని చెప్పుకొంటున్నప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి వాదన రాకుండా ఉంటుందా..!
ముఖ్యమంత్రి కానుక పేరుతో్ ప్రచారం కోసం తలపెట్టిన పథకానికే రూ. 350 కోట్లు ఖర్చు పెట్టేశారు అంటే ఏ స్థాయిలో ప్రభుత్వ ఖర్చులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
ఇక ముఖ్యమంత్రి గెస్ట్ హౌస్ కు రూ. 100 కోట్లు, కార్యాలయ మరమ్మతులకు రూ. 40 కోట్లు చొప్పున చేస్తున్న ఖర్చులు జాతీయ స్తాయిలో తెలుస్తూనే ఉన్నాయి. కేంద్రానికి నివేదికలు అందుతూనే ఉన్నాయి.
ఈ విధంగా చంద్రబాబు విధానాలు ఉండబట్టే కేంద్ర ప్రభుత్వం కూడా సాంకేతిక కారణాలు చూపించి ప్రత్యేక హోదా కోసం తటపటాయిస్తోంది అన్న మాట వినిపిస్తోంది. షోకుల్ని పక్కన పెట్టి చంద్రబాబు ప్రభుత్వం వాస్తవాలతో పరిపాలన చేస్తుంటే అందరికీ బాగుంటుందని చెబుతున్నారు. అందుకే ప్రత్యేక హోదా మీద చంద్రబాబు అంతటి మౌనాన్ని పాటిస్తున్నారన్న మాట ఉంది.