ప్రజలకు నేనున్నానని..!

ప్రజలకు నేనున్నానని మహానేత వైయస్ఆర్ కుటుంబం భరోసా ఇచ్చింది. మరోసారి పాదయాత్ర చేపట్టడం ద్వారి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పాదుగొల్పాలని సంకల్సించింది.

కాకినాడ: మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌ రెడ్డి సోదరి షర్మిల ఈనెల 18 నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారన్న సమాచారం ఆ పార్టీ జిల్లాశ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. జగన్ జైలు నుంచి బయటకు రాకుండా చేస్తున్న కుట్రలను నిరసిస్తూ, వాస్తవాలను ప్రజల ముందుంచడానికి, ప్రజల సమస్యలపై ప్రభుత్వంపై పోరాడడానికి షర్మిల సాగించనున్న పాదయాత్ర పార్టీకి మరింత ఉత్తేజాన్నిస్తుందని నాయకులు, కార్యకర్తలు ఆశిస్తున్నారు. వైఎస్‌ను, ఆయన కుటుంబాన్ని సొంత మనుషుల్లా అభిమానించే జిల్లావాసులు షర్మిల యాత్ర పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 2003 మేలో వైఎస్ ప్రజాప్రస్థానం పాదయాత్ర జిల్లాకు చేరుకున్నప్పుడు, ప్రత్తిపాడు వద్ద వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకున్నప్పుడు జిల్లావాసులు ఆయనకు బ్రహ్మరథం పట్టారు.
 
నేనున్నానంటూ..
ఆయన ఆశయాల అమలుకు అవిశ్రాంతంగా పోరాడుతున్న జగన్‌పై కేసులు బనాయించి, జైలు పాలు చేసినా నాన్న, అన్నల బాటలో పయనించేందుకు, ప్రజల వెన్ను తట్టేందుకు ‘నేనున్నాను’ అంటూ షర్మిల పాదయాత్రకు పూనుకోవడం చారిత్రాత్మక నిర్ణయం అని జిల్లాప్రజలు అంటున్నారు. తన హావభావాలతో అచ్చం తండ్రిని తలపించే షర్మిలకు ప్రజల్లో మంచి ఆదరణ ఉందని, ఆమె పాదయాత్ర మరో ప్రజాప్రస్థానంలా విజయవంతం అవుతుందని పార్టీ శ్రేణులు ఢంకా బజాయిస్తున్నాయి. 
తూర్పుగోదావరంటే వైయస్‌కు ఎంతో ఇష్టం
కడప జిల్లా తరువాత అంతగా వైఎస్ తూర్పుగోదావరిని ఇష్టపడేవారు. దీంతో సహజంగానే జిల్లావాసులు తమ ముందుకు వచ్చిన జగన్‌ను, విజయమ్మ, షర్మిలలను కూడా అదే స్థాయిలో ఆదరించారు. జగన్‌ను జైలు నుంచి బయటకు రాకుండా చేస్తున్న కుట్రలతో కేడర్ నిస్తేజం కాకుండా ఉండేందుకు షర్మిల పర్యటన దోహదపడగలదన్న ఆశాభావం పార్టీ నేతల్లో వ్యక్తం అవుతోంది. ఈ నెల 18న ఇడుపులపాయ నుంచి ప్రారంభమయ్యే షర్మిల పాదయాత్ర రూట్‌మ్యాప్ ఇంకా ఖరారు కాకపోయినా ఆమె జిల్లాకు ఎప్పుడు వస్తారోనన్న ఆసక్తితో అప్పుడే ఆరా తీస్తున్నారు.
మరో ప్రజాప్రస్థానమే...
షర్మిల చేయనున్న పాదయాత్ర మరో ప్రజాప్రస్థానం కాగలదు. వైయస్ రాజశేఖరరెడ్డిని ప్రజలు ఎంతగా ఆదరించారో ఆయన భావాలను, ఆశయాలను ఆచరిస్తున్న షర్మిలకు కూడా ప్రజల్లో ఎంతో అభిమానం ఉంది. ఆమె చేసే పాదయాత్ర వల్ల ప్రజలకు కూడా మేలు కలగగలదన్న విశ్వాసం ఉంది.
- యాసలపు వైదన్న, లారీ ఓనర్, కాకినాడ
ప్రజలకు మేలు కలుగుతుంది
షర్మిలమ్మ చేసే పాదయాత్ర వల్ల ప్రజలకు మేలు కలుగుతుందన్న నమ్మకం ఉంది. ఒకప్పుడు వైఎస్‌ఆర్ చేసిన పాదయాత్ర ఎంతో స్ఫూర్తినిచ్చింది. ఇప్పుడు ఆయన కుమార్తె చేస్తున్న కార్యక్రమం ప్రభుత్వాన్ని కదిలించగలదని అనిపిస్తోంది. ప్రజా సమస్యలు కూడా పరిష్కారం కాగలవని నమ్ముతున్నాం.
- వరలక్ష్మి, గృహిణి, కాకినాడ

ప్రజా సంక్షేమానికే: జ్యోతుల
పిఠాపురం: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడానికి, వారి సంక్షేమానికి షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర చేపట్టనుండడం ఆనందదాయకమని పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు జ్యోతుల నెహ్రు చెప్పారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో అధికార కాంగ్రెస్, వాటిని ఎత్తి చూపడంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా విఫలమయ్యాయన్నారు. 2004లో ప్రతిపక్ష నాయకుడు హోదాలో వైఎస్సార్రపజాప్రస్థానం పేరుతో పాదయాత్ర చేపట్టగా అదే పేరుతో మళ్లీ షర్మిల పూనుకోవడం పార్టీకి శుభపరిణామమన్నారు. దేశంలో మొదటి సారిగా ఒక మహిళ సుమారు 3 వేల కిలో మీటర్ల పాదయాత్ర జరపడం సాహాసోపేత నిర్ణయమన్నారు. 

Back to Top