ప్రజాభిమానం @ 1000కి.మీటర్లు

ప్రజా సంకల్ప యాత్ర. 3000కి.మీలు, 180 రోజులు, 125 నియోజక వర్గాలు, 10వేల గ్రామాలు 125 బహిరంగ సభలు, 2కోట్లమంది ప్రజలకు చేరువ కావడం లక్ష్యంగా ఇడుపుల పాయనుంచి ఆరంభం అయ్యింది ప్రజా సంకల్ప యాత్ర.  అవినీతిపాలనపై సమర శంఖం ప్రజా సంకల్పం. ప్రజామనోబలానికి నిలువుటద్దం ప్రజా సంకల్పం. కష్టాలు, కన్నీళ్లు చరమగీతం ప్రజా సంకల్పం. ప్రజల కోసం, ప్రజల వద్దకు ఓ ప్రజా నేత జరిపే పాదయాత్రే ఈ ప్రజా సంక్పలం.

వైఎస్ఆర్ కుటుంబం అంటేనే ప్రజలు. ప్రజలు అంటేనే వైఎస్ఆర్ కుటుంబం అన్నట్టు పెనవేసుకున్న బంధం ఇది. అందుకే అప్పుడు ఆ మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆ తర్వాత ఆయన తనయి షర్మిళ, ఇప్పుడు ఆయన కొడుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల చెంతకు నడిచి వెళ్తున్నారు. రాయలసీమలో నాలుగు జిల్లాల్లోనూ 68 రోజులుసాగి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోకి అడుగు పెట్టిందిప్రజా సంకల్ప పాదయాత్ర. ప్రజా సంకల్పం 74వ రోజు వెంకటగిరి నియోజక వర్గంలో సైదాపురం వద్ద వెయ్యి కిలోమీటర్ల మైలు రాయిని దాటింది. ఈ వెయ్యి కిలోమీటర్ల దారిలో ఎన్ని నియోజకవర్గాలు, ఎన్ని ఊళ్లు, ఎందరు ప్రజలు, ఎన్ని సమస్యలు...సహనంతో వాటిని వింటూ, ప్రజలకి భరోసాని పంచుతూ ముందుకు సాగుతున్నారు ప్రతపక్ష నేత వైఎస్ జగన్. 

ఉద్వేగ క్షణాలు

ఓ నాయకుడిని చూడాలని ప్రజలు ఎందుకంత తపన పడుతున్నారు. తమ పక్క ఊరి నుంచి వెళ్తున్నాడని తెలిసినా తండోపతండాలుగా, బళ్లు కట్టకు వచ్చి చూడాలన్న ఆతృత దేనికి. అది ప్రజల్లో వైఎస్ జగన్ పట్ల ప్రజల మనసుల్లో ఉన్నఆదరం. అభిమానం. వైఎస్ జగన్ రాకకోసం ప్రతి ఊరూ ఓ పచ్చని తోరణమయ్యింది. ప్రతి బాటా పూల రాదారి అయ్యింది. ప్రతి గుండె ఓ స్వాగత గీతమై జగన్నినాదాలు చేసింది. కళాకారుల ఆటపాటలు, మహిళల హారతులు, పెద్దవాళ్ల దీవెనలు, యువత కోలాహలం ప్రతి అడుగూ ఓ అపురూప ఘట్టాన్నే తలపించింది. అందుకే వేయి కిలోమీటర్ల దారికూడా ఆ యువనేతకు దాసోహం అంది. అంతటి ఆత్మీయతకు, అంతులేని ఆ ప్రేమకు కారణం ఆ నాయకుడి వ్యక్తిత్వం. ఓ చిన్నారి కోసం నేలపై కూర్చుని సెల్ఫీ దిగాడు. ఓ మహిళకు ఆమె జారిపోయిన కాలిచెప్పు వంగితీసి అందించాడు. ఎవ్వరు ఏం చెప్పినా సావధానంగా విన్నాడు. అవ్వతాతలకు ధైర్యాన్ని ఇచ్చాడు. నష్టపోయి కన్నీళ్లు పెట్టుకున్నవారికి అండగా ఉంటానని మాటిచ్చాడు. జనం కోసం జనంలో ఒకడై జననేత అనిపించుకున్నాడు. 

అభిమానానికి ఆకాశమే హద్దు

పంట పొలాలనుంచి పరుగులు పెడుతూ వచ్చే శ్రామికులు, పింఛన్ల గురించి అడగడానికి కాదు మా రాజన్న బిడ్డను చూడటానికి అని గద్దించి చెప్పే అక్కచెల్లెళ్లు, ఎంత సేపైనా కానీ యువనేతను చూడాల్సిందే అని నిరీక్షించే అవ్వాతాతలు, ఊళ్లనుంచి ఎడ్లబండులను కట్టుకుని, వాటిపై నవరత్నాలను ఫ్లెక్సీలుగా పెట్టి తెచ్చిన అభిమానులు, పట్టువస్త్రాలపై యువనేత నవరత్నాలు ముద్రించి తెచ్చిన చేనేతలు, వేరుశెనగలతో దండ గుచ్చి తమ ప్రియమైన నేత మెడలో వేసి మురిసిపోయే యువకులు, భారీ కౌటౌట్లు బానర్లతో స్వాగతాలు పలికే గ్రామస్తులు, పాఠశాలలోంచి బయటకు వచ్చిమరీ కలిసి వెళ్లే విద్యార్థులు, చిరుకానుకలతో తమ ప్రేమను చాటుకునే కళాకారులు...ప్రజాసంకల్ప యాత్రలో ప్రజల కష్టాలనే చూడటమే కాదు అనంతమైన ప్రేమనూ రుచి చూస్తున్నా అన్నారు వైఎస్ జగన్. 

నవరత్నాలకు మెరుగులు

అన్ని వర్గాలకూ మేలు చేకూరే నవరత్నాలను ఎప్పుడో ప్రకటించారు ప్రతిపక్షనేత. అయితే పాదయాత్రలో ప్రజలు కోరుకున్నవి కూడా చేర్చుతూ, నవరత్నాలు మరింత మెరుగు పరుస్తామన్నారాయన. ఆ మాటనే ఆచరణలో చేసి చూపుతున్నారు కూడా. ప్రజా సంకల్ప యాత్రలో కొత్త హామీలను ఇవ్వడమే కాదు, కొన్నిచోట్ల ప్రజల కోరికపై అభ్యర్థులను సైతం ప్రకటిస్తున్నారు. ప్రతి మండలానికీ కోల్డు స్టోరేజీ, ఎస్సీ,ఎస్టీకాలనీలకు 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్, 1000 రూపాయిలు దాటిన ప్రతి చికిత్సా ఆరోగ్యశ్రీ పరిధిలోకి, బిసి డిక్లరేషన్ మరియు సబ్ ప్లాన్, మైనారిటీలకు సబ్ ప్లాన్, అనంతపూర్, కర్నూలు జిల్లాల నుంచి బోయ, వాల్మీకి కులాల నుంచి ఒకరికి ఎంపీ సీటు, ఇమామ్, మోజన్ ల జీతాల పెంపు, ఆలయాలు, చర్చిలు, మసీదులకు ప్రతినెలా నిర్వాహణ ఖర్చులు, పాడిపరిశ్రమ ప్రోత్సాహానికి రైతులకు 4రూ.మద్దతుధర, ఫించను వయసు 45ఏళ్లకు కుదింపు, ఫించను రెండువేలకు పెంపు, లక్షా 50వేల ఉద్యోగాలతో ఉద్యోగ విప్లవం, ప్రతి గ్రామంలో గ్రామసచివాలయం, బిసి, ఎస్సీ,ఎస్టీలకు భూపంపిణీ, ఉచిత బోర్ల ఏర్పాటు, మూతబడ్డ చక్కెర, సహకరా ఫ్యాక్టరీల పునః ప్రారంభం, చేనేతలకు ఆర్థిక చేయూత వంటి ఎన్నో హామీలను అందిస్తున్నారు యువనేత. 

ప్రజా సంకల్పానికి మద్దతు వెల్లువ

ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ప్రతి సభా ఓ జన సునామీని తలపించిది. పాదయాత్ర సమయంలో యువనేతతో అడుగు కలిపడమే కాదు, ప్రతి బహిరంగ సభలోనూ ప్రజా ప్రభంజనం కనిపించింది. బిసిల ఆత్మీయ సమ్మేళనంలో, మైనారిటీలతో ముఖాముఖీలో, జర్నలిస్టుల ఛిట్ చాట్ లో, మహిళల సభలో ఇలా ప్రతి చోటా యువనేతకు మద్దతిస్తూ లక్షలాది మంది ప్రజలు పాల్గొన్నారు. వారి అభిప్రాయాలను ప్రతిపక్షనేతకు తెలియజేసారు. అవినీతి మయంగా మారిన చంద్రబాబు పాలనలో ఎలాంటి అగచాట్లు పడుతున్నారో తెలియజేసారు. ఈసారి మన ప్రభుత్వం రావాలి అన్నా, జగనాన్నా నీవు సిఎమ్ కావాలన్నా అంటూ తమ సంకల్పాన్ని తెలియజేసారు. 

వెయ్యికిలోమీటర్లలో వేల అడ్డంకులు

అధికార పార్టీ అడుగడుగునా ఎన్నో అవాంతరాలు సృష్టించింది. అపూర్వ స్పందన కనిపిస్తున్న ప్రజాసంకల్పాన్ని ఏమీ చేయలేక బురదజల్లే ప్రయత్నాలు మొదలు పెట్టింది. మాటలతో, నిందలతో, విమర్శలతో ప్రతిపక్షనేత మనోధైర్యాన్ని తగ్గించేందుకు దిగజారుడు రాజకీయాలెన్నో చేసింది. పచ్చరాతలెన్నోరాసింది. కానీ ప్రజలు వాటిని తమ మద్దతుతో తిప్పికొట్టారు. యువనేత అడుగులో అడుగేస్తూ ఎర్రబడ్డ అధికార పార్టీ నేతల కళ్లలో దుమ్ముకొట్టారు. చంద్రబాబు మాటలు నమ్మి మోసపోయామని, ఈ దగాకోరు ప్రభుత్వానికి, వంచన చేస్తున్న పాలకులకు బుద్ధి చెప్పేందుకే ప్రతిపక్షనేత పోరాటమని తెలుసుకుని ఆయన వెన్నంటి ముందుకు సాగుతున్నారు. మన స్రభుత్వం, మనకోసం నడిచే పాలన వస్తుందని ధీమా వ్యక్తం  చేస్తున్నారు. వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర వెయ్యి కిలోమీటర్లు అవలీలగా సాగింది. ఇక ముందుకూడా రెట్టించిన ఉత్సాహంతో కొనసాగుతుంది, అందుకు ప్రజాభిమానమే అండగా నిలుస్తుంది. 





 
Back to Top