పేదవిద్యార్థి విలవిల

కారుణ్యం కనుమరుగైంది. మానవత్వం మృగ్యమై పోయింది. లాభనష్టాల బేరీజు వేసే వ్యాపార దృష్టే రాష్ట్రంలో రాజ్యమేలుతోంది. ఖజానా లెక్కలే కరకు ప్రభుత్వానికి ప్రధానమైపోయాయి. ఫలితం.. ఉన్నత విద్యకు పేదరికం ఆటంకం కాకూడదనే మహానేత మహదాశయానికి ప్రస్తుత ప్రభువులు తిలోదకాలిచ్చారు. మానవతా దృష్టితో వైయస్ ప్రవేశపెట్టిన సంతృప్తస్థాయి ఫీజు రీయింబర్స్‌మెంట్‌పథకాన్ని పీఛేముడ్ చేయించే వ్యూహాలకు పదును పెడుతున్నారు. పేద విద్యార్థికి దివంగత ముఖ్యమంత్రి, జనహృదయనేత వైయస్‌ రాజశేఖరరెడ్డి అందించిన భరోసాను నీరుగారుస్తున్నారు. ఆయన అందించిన అభయహస్తం నీడ కూడా.. పేద విద్యార్థి దరిచేరకుండా సర్వ ఆటంకాలూ కల్పిస్తున్నారు.

సరస్వతీ కటాక్షం కలగడానికి పేదతనం ఆటంకం కాకూడదనే సదాశయంతో దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్నినీరుగార్చే చర్యలను ఇప్పటికే మొదలెట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. ఈ పథకాన్నెలాగైనా కంచికి పంపించేయాలనే దృష్టితో ఉందని అర్థమైపోతోంది.

వైయస్ ఆకస్మిక మరణం సంభవించి గడిచిపోయిన ఈ మూడేళ్ల కాలంలో ఈ పథకాన్నిఅనంతర ప్రభుత్వాలు అమలు జరిపిన, జరుపుతున్న తీరు గమనిస్తే ఎవరికైనా పేదల సంక్షేమం పట్ల ఈ సర్కారుకు ఎంత ప్రేమ ఉందో ఇట్టే అర్థమైపోతుంది.

సంతృప్త స్థాయిలో ఫీజులను భర్తీ చేయాలనే మానవతా దృక్ఫథంతో వైయస్‌ అమలు చేసి చూపించిన ఈ పథకం అసంతృప్త స్థాయి అమలుదారిన నడుస్తోంది. ఇంతకుముందు సంవత్సరాల్లో ఫీజుల రీయింబర్స్‌ నిధులను అరకొరగా విడుదల చేస్తూ వచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు ఏకంగా భర్తీ చేసే మొత్తాన్నే పరిమితం చేసి, దాన్ని అందుకొనే విద్యార్థుల ర్యాంకులపైనా ఆంక్షలు విధించి.. హమ్మయ్య! బరువు దించేసుకొన్నాం కదా అని చేతులు దులిపేసుకొని సంబరపడుతోంది.

ఫలితం.. వేలాదిమంది బీసీ, ఓబీసీ, మైనారిటీ, వికలాంగ పేదలు.. ప్రతిభ ఉండీ ఫీజులు చెల్లించలేక హతాశులవుతున్నారు. సర్కారు నిర్ణయం కేవలం ధనవంతుల బిడ్డలకే అనుకూలంగా మారింది.. ఉన్నత చదువులు కేవలం సంపన్నులకే పరిమితమైపోయాయి.ద్వారా పేదల సంక్షేమంపై నిప్పులు ప్రభుత్వం పోసింది.

దీనికి తోడు, ఇంజనీరింగ్‌ కోర్సుల షెడ్యూలు విడుదల చేసిన తరువాత కూడా ఫీజులెంతెంతో తేల్చకుండా, వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ సమీపిస్తున్నా ఎంత ఫీజు చెల్లించేదీ చెప్పకుండా లక్షలాది మంది విద్యార్థులను మానసిక క్షోభకు గురిచేస్తోంది ప్రస్తుత ప్రభుత్వం.

ఇకముందు కూడా రీయింబర్స్‌మెంట్‌ తమకు భారం కాకుండా ఉండడానికి మరెన్నో ఎత్తులు వేస్తోంది. భవిష్యత్తులో ఏ కోర్సు ఫీజు పెరిగినా.. ముందుగానే సీలింగ్‌ విధించి, దానికి కూడా 'మెరిట్‌' సాకును తగిలించి భారం బాగా దించుకోవాలని ముందస్తు ప్రణాళికలు రచిస్తోంది.

అంతటితో ఆగితే కొంతైనా ఫర్వాలేదు. రీయింబర్స్‌మెంట్‌కు మంగళం పాడడమెలా అని ఆలోచిస్తున్న ప్రభుత్వానికి అనుకోని వరంగా 'తమిళనాడు పథకం' కంటపడింది. ఇంటిలో ఒక విద్యార్థికి రీయింబర్స్‌మెంట్‌ ప్రయోజనం లభిస్తే.. మరింకెవరికీ ఆ ప్రయోజనం పొందే అర్హత ఉండదు. అంటే ఆ ఇంటిలోని మిగతా విద్యార్థులంతా పూర్తి ఫీజు చెల్లించాల్సిందే.. ఇది తమిళనాటి పథకం విశేషం.

ఈ పథకం గురించి తెలియడంతో నెత్తిన పాలుపోసినట్టు సర్కారు సంబరపడిపోతోంది.

పోనీ, ఫీజులు పెరిగిన కాలేజీల్లోనైనా ఇటీవల సీఎం హామీ ఇచ్చినట్టుగా.. మెరిట్‌ విద్యార్థులకైనా ఫీజు పూర్తిగా చెల్లిస్తారా?.. అనేది కూడా అనుమానమే. కేవలం ట్యూషన్‌ ఫీజు చెల్లించి ఉపకారవేతనాన్ని ఊడబెరకాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ' చాలామందికి 35వేలు వంతున చెల్లించాల్సి ఉంది. మెరిట్ వాళ్లకైతే మొత్తం ఫీజు చెల్లించదలిచాం. అటువంటప్పుడు మళ్లీ వాళ్లకు స్కాలర్‌షిప్పులు ఎందుకు..?' అనేది సర్కారు యోచనగా కనిపిస్తోంది.

వైయస్‌ హయాంలో ఒక్క ఏడాదిలో తప్ప.. ఏటేటా బడ్జెట్­ కేటాయింపుల కన్న నిధులకన్న ఎక్కువగానే విడుదల చేయడగా.. తరువాత వచ్చిన రోశయ్య, ఇప్పటి కిరణ్‌ ప్రభుత్వాలు.. సంతృప్తస్థాయి మాట దేవుడెరుగు.. కనీసం చాలినంతగానైనా కేటాయింపులు చేయలేదు. దానితో ఈ మూడేళ్లలో ప్రతిఏటా కొంతమందికే రీయింబర్స్‌మెంట్‌ ప్రయోజనం లభించింది. ఫలితంగా.. తదుపరి సంవత్సరానికి బకాయిలు పెరిగిపోతూ చివరికి ప్రభుత్వ కేటాయింపులు కేవలం బకాయిలకైనా చాలతాయా.. అనే సందేహం తలెత్తుతోంది.

స్కాలర్‌పిప్పులదీ ఇదే తంతు..

అయినా.. విద్యార్థుల సంక్షేమం కోసం తామెంతో చే్స్తున్నామంటూ డప్పుకొట్టుకొంటోంది!

అప్పటికీ.. ఇప్పటికీ ఎంతో తేడా... !!!

Back to Top