పాదయాత్రకు కదిలి వచ్చిన గ్రామాలు

మహబూబ్‌నగర్:

మహానేత తనయ వైయస్ షర్మిల పాదయాత్రకు అలంపూర్ జిల్లాలో ఆదివారం గ్రామాలకు గ్రామాలు కదిలొచ్చాయి. విద్యుత్తు, ఫీజు రీయింబర్సుమెంట్, ఉపాధి హామీ, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు తదితర సమస్యలపై పలువురు షర్మిల వద్ద ఏకరువు పెట్టారు. జగనన్న ముఖ్యమంత్రయితే వైయస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన అన్ని పథకాలూ తిరిగి ఊపిరి పోసుకుంటాయనీ, అప్పటివరకు ఓపిక పట్టాలని ఆమె వారికి అభయమిచ్చారు. మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలపై వైయస్ఆర్‌కు ఎనలేని ప్రేమ ఉండేదన్నారు.
గీత కార్మికుల గోడు
     తమ గోడు పట్టించుకునేవారే లేరని గీత కార్మికులు ఆమెకు మొరపెట్టుకున్నారు. వైఎస్ ఉన్నప్పుడు చెట్టు పన్ను తగ్గించారనీ, గీత కార్మిక సంఘాలు తాటి, ఈత చెట్లు పెంచుకోవడానికి 5 ఎకరాల స్థలమివ్వాలని నిర్ణయించానీ షర్మిలకు చెప్పారు. ప్రస్తుత పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. గీత కార్మిక వృత్తిని అబ్కారీ శాఖ నుంచి తీసివేసి కార్పొరేషన్‌కు అప్పగించేలా చూడాలని వారు కోరారు. జగనన్న దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళతానని షర్మిల హామీ ఇచ్చారు.
     పాదయాత్రలో నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, వైయస్ఆర్ కాంగ్రెస్  కేంద్ర పాలక మండలి  సభ్యులు కేకే మహేందర్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్దన్, బాల మణెమ్మ, అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి, మాజీ ఎమ్మెల్యే స్వర్ణ సుధాకర్‌రెడ్డి, కార్యక్రమ సమన్వయకర్త తలశిల రఘురాం, నాయకులు చల్లా రామకృష్ణారెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, తిరుపతిరెడ్డి, ఎం.భగవంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Back to Top