ఓటు వెయ్యడం రాని పాలకులెందుకు?

ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్ర మంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత -ఒక దశలో ప్రధానమంత్రి పదవికి అభ్యర్థిగా జాతీయ, అంతర్జాతీయ మీడియా చేత గుర్తింపు పొందిన ప్రముఖుడు- ములాయం సింగ్ యాదవ్ నిన్నటి రాష్ట్రపతి ఎన్నికల్లో తన ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోలేకపోవడం కలకలం సృష్టించింది. ప్రణబ్ కుమార్ ముఖర్జీ అభ్యర్థిత్వాన్ని ప్రముఖంగా బలపరిచిన ములాయం -పొరపాటునే అనుకోండి- ఆయన ప్రత్యర్థి పీఏ సంగ్మాకు ఓటు వేయడం పెద్ద వార్తయిపోయింది. మొదటి బ్యాలట్ పత్రాన్ని చించిపారేసి, మరో బ్యాలట్ తీసుకుని ప్రణబ్‌కు ఓటు వెయ్యడానికి ములాయం చేసిన ప్రయత్నం విఫలమయింది. మొత్తమ్మీద ఆయన ఓటు తిరస్కరణకు గురయింది. ఆదివారం జరిగే ఓట్ల లెక్కింపులో ఎవరు గెలిచినా, ఒక జాతీయ స్థాయి నాయకుడు ఓడినట్లయింది. ఈ ఎన్నికల్లో ఎలా ఓటేయాలో పకడ్బందీగా ‘శిక్షణ’ పొందిన మన రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా పోలింగ్ వేళ చిడుముడిపడి, తడబడిపోయిన వైనం పత్రికలకెక్కింది. అక్షరమ్ముక్క రాయడం రాని నిశానీదారులతో వేలూ లక్షల ఓట్లు ‘వేయించుకోడం’ చేతనయిన మననేతలకు సొంత ఓటు వెయ్యడం చేతకాకపోతే ఎలా? మన ప్రజాస్వామ్యం ఎంత గొప్పగా శోభిల్లుతోందో ఈ సంఘటనలు రుజువు చెయ్యడం లేదా? మన పాలకుల అర్హతల విషయంలో ఇటీవల వ్యక్తమవుతున్న విమర్శలను ఈ పరిణామాలు బలపరచడం లేదా? మన రాజ్యాంగ నిపుణులూ, పరిశీలకులూ ఈ విషయాలను విశ్లేషించుకోవలసి ఉంది.సార్వజనీనమయిన ఓటు హక్కు -యూనివర్సల్ సఫ్రేజ్- సామాజిక న్యాయకల్పనలో తొలి అడుగులాంటిదనే భావన ప్రపంచ వ్యాప్తంగా ఆమోదం పొందినదే. ‘స్వేచ్ఛా-సమానత్వం-సౌభ్రాతృత్వం’ అనే నినాదాలతో పెల్లుబికిన ఫ్రెంచ్ విప్లవ చైతన్యంలో భాగంగా -1792లో- పుట్టుకొచ్చినదే ఈ భావన. అయితే, అందరికీ ఓటుహక్కు అంటే మగవాళ్లందరికీ ఓటు హక్కు అనిమాత్రమే ఫ్రెంచ్ విప్లవకారులు భావించినట్లుంది. తర్వాతి రోజుల్లో ఈ పరిమితి కూడా తొలగిపోయింది. అయితే, ఈ పరిణామాలన్నీ ప్రశాంతంగానూ, అహింసాత్మకంగానూ సాగిపోలేదు. రక్తపుటేరులు పారిన తర్వాతే, అందరికీ ఓటు హక్కు అనే స్వప్నం నిజమయింది. కులీనత, ఆస్తి, చదువు, జెండర్, కులం, మతంలాంటి ప్రాతిపదికలను తోసిరాజని, వయోజనులందరికీ ఓటుహక్కు సాధించుకోవడం విప్లవాత్మక సాఫల్యమని చరిత్ర పుస్తకాలు చాటిచెప్తున్నాయి. సామాన్యుల నుండి మేధావుల వరకూ అందరూ ఈ సూక్తులను ఔదలదాలుస్తున్నారు కూడా. నేల నాలుగు చెరగులా ఉన్న జనానీకం, గుండెనెత్తురులు తర్పణ చేసి సాధించుకున్న ప్రజాస్వామ్యంలో ప్రజలందరికీ ఓటుహక్కు ఉండితీరాల్సిందే. అర్హతానర్హతల పేరుచెప్పి ఎవరికీ వారి జన్మహక్కును కాదనడానికి వీల్లేదు. ఇంత వరకూ బాగానే ఉంది. ప్రజల తలరాతలను నిర్ణయించే అధికారం చేజిక్కించుకునేందుకు ఎగబడుతున్ననేతలకు మాత్రం కచ్చితంగా కొన్ని అర్హతలు ఉండితీరాల్సిందే. నీతీ, నిజాయితీ, సేవాభావం, సచ్ఛీలం, సత్ప్రవర్తన, యుక్తాయుక్త విచక్షణలాంటి గొప్ప గొప్ప ఆదర్శాలను మన నేతల నుంచి ఆశించడం అవాస్తవికమే అవుతుంది. కానీ, కనీసం తమ ఓటుహక్కు వినియోగించుకునేపాటి ‘చైతన్యం’ ఈ నాయకమ్మన్యులకు ఉండాలని కోరుకోడం అత్యాశ అనిపించుకుంటుందా?

మేధావులూ, ఆలోచించండి!

Back to Top