రాజీలేదు.. అలుపూ లేదు

– ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్లు అలుపెరుగని పోరాటం
– యువభేరిల నుంచి ఎంపీల రాజీనామాల దాకా...
– అవగాహన పెంచుతూ.. స్ఫూర్తి నింపుతూ
– ఎంపీల రాజీనామా ఆమోదంతో పార్టీ శ్రేణుల్లో ఆనందం
– హోదా సాధించడమే తరువాయి...  



అడుగడుగునా పోరాటం.. ప్రతి పోరాటం ఒక ప్రభంజనం.. ప్రత్యేక హోదా అనే ఐదక్షరాలనే పంచాక్షరిగా వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులు చేసిన పోరాటంలో కీలక మలుపు. నమ్ముకున్న సిద్ధాంతం కోసం ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన మోసానికి వ్యతిరేకంగా వైయస్‌ జగన్‌ చేస్తున్న పోరాటం అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. ఎన్నికలు పూర్తయిన క్షణం నుంచి ఒకే స్టాండ్‌తో ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలని నినదించిన నాయకుడు వైయస్‌ జగన్‌.. ఆయన నేతృత్వంలోని వైయస్‌ఆర్‌సీపీ. ఈ నాలుగేళ్లలో ఆయన చేసిన పోరాటానికి అన్ని పార్టీలు దిగిరాక తప్పలేదు. టీడీపీ, బీజేపీలు తెగదెంపులు చేసుకున్నా.. జనసేనాని చంద్రబాబును వ్యతిరేకించినా.. అది ముమ్మాటికీ వైయస్‌ జగన్‌ పోరాట ఫలితమే. ప్రత్యేక హోదాతో ఏమొస్తుంది అన్న చంద్రబాబుతోనే ఏపీకి ప్రత్యేక హోదా కావాలి అని అనిపించిన ధీశాలి వైయస్‌ జగన్‌. ఆయన పోరాటంలో నిజాయతీ ఉంది.. అందుకే ఆయన  సంకల్ప బలానికి అందరూ దిగిరాక తప్పలేదు. 

పద్ధతి ప్రకారం పోరాటం... 

పోరాటం చేయడమంటే జనాన్ని వెంటేసుకుని రోడ్లెక్కడం మాత్రమే కాదు. చేస్తున్న పోరాటంతో జనానికి లబ్ధి చేకూరాలి.  పిలుపులో నిజాయతీ లేదంటే జనం పట్టించుకోరు. కానీ జగన్‌ పోరాటంలో ప్రతిసారీ ఆయన్ను ముందుండి నడిపించింది జనం, అభిమానులు, పార్టీ కార్యకర్తలే. ఆయన తీసుకున్న నిర్ణయాలకు జై కొట్టి సమర్థించింది వారే. ఆయన పోరాటాన్ని, నిర్ణయాలను జనం అంతగా గౌరవించి ఆయన్ను అక్కున చేర్చుకున్నారు. ప్రత్యేక హోదాపై పోరాటాన్ని దశలవారీగా నిర్మించుకుంటూ ప్రజా ఉద్యమాన్ని నడిపారు జననేత. ప్రత్యేక హోదా అంటే ఏమిటో చాలా మందికి అర్థం కాని స్థితిలో యువభేరిలు నిర్వహించి విద్యార్థులు, యువతలో మార్పు తెచ్చారు. ప్రత్యేక సందర్భాల్లో నిరసన దీక్షలు, స్టేట్‌ బంద్‌లు, రాస్తారోకోలు నిర్వహిస్తూ సామాన్య ప్రజలకు హోదా అవసరాన్ని తెలియజెప్పారు. ఓ వైపు హోదాపై అవగాహన కల్పిస్తూనే టీడీపీ, బీజేపీలు చేసిన మోసాన్ని ప్రజలకు వివరించడంలోనూ అంతే సక్సెస్‌ అయ్యారు. 

రాజీనామాలతో పతాకస్థాయికి...

ప్రత్యేక హోదా కోసం వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు రాజీనామా చేయడంతో ఉద్యమం పతాక స్థాయికి చేరుకుంది. హోదా కోసం అవసరమైతే మా ఎంపీలు రాజీనామా చేస్తారని మొదట్నుంచీ వైయస్‌ జగన్‌ చెబుతూనే వస్తున్నారు. దానికోసం కేంద్రంపై ఉమ్మడి పోరాటానికి టీడీపీని కూడా ఆహ్వానించిన జగన్‌.. వారు కలిసి రాకపోయినా కేంద్రంపై అవిశ్వాస తీర్మాణం ప్రవేశపెట్టారు. పార్లమెంట్‌ సమావేశాల్లో 13 సార్లు అవిశ్వాసం పెట్టినా చర్చకు రాకపోవడంతో ఎంపీలు ఆమరణ నిరాహార దీక్షకు సైతం వెనుకాడలేదు. చివరికి ఏప్రిల్‌ 6న రాజీనామా లేఖను ఐదుగురు వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌కు సమర్పించారు. అప్పట్నుంచి రెండు నెలలపాటు జరిగిన నాటకీయ పరిణామాల అనంతరం రాజీనామాలను స్పీకర్‌ ఆమోదించారు. ఎంపీలతో రెండుసార్లు మాట్లాడిన స్పీకర్‌ చివరకు రాజీనామాలను ఆమోదించక తప్పలేదు. కర్నాటక ఎంపీల రాజీనామాలు ఆమోదించినప్పుడు మా రాజీనామాలను ఆమోదించకపోవడం దారుణమని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు స్పీకర్‌తో వాగ్వాదానికి దిగడంతో ఒప్పుకోకతప్పని పరిస్థితి ఎదురైంది. ఎంపీలు రాజీనామాలను ఆమోదించుకోవడం ద్వారా రాబోయే ఎన్నికల్లో విజయం సాధించి ప్రత్యేక హోదా ఆకాంక్షను ఢిల్లీకి చాటిచెప్పబోతున్నారు. 
Back to Top