తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే నాలుగు సీట్లు వస్తాయని కాంగ్రెస్ సీనియర్ నేతలు భావిస్తున్నార్ట. కిరాణ్ కుమార్ రెడ్డి, పళ్లం రాజు వంటి నాయకులు చెబుతున్న మాటలివి. ఇవి వింటే ఎవరికైనా ఓ అనుమానం కలుగుతుంది. తెలంగాణాలో చంద్రబాబును వెంట తెచ్చుకోవడం వల్ల జరిగిన నష్టానికి ప్రతీకారం తీర్చుకునేందుకే కాంగ్రెస్ ఈ పొత్తు ఆశిస్తోందేమో అని. అక్కడ టిడిపి పేరు చెబితే మండిపడ్డట్టుగా, ఎపిలో కాంగ్రెస్ పేరు చెబితే ఛీ కొడతారని తెలుసు కనుక టిడిపిని దెబ్బ కొట్టాలంటే ఎపిలోనూ పొత్తు కంటిన్యూ చేయడమే సరైన పని అనుకుంటోందిట కాంగ్రెస్. దొరకని దిక్కుకాంగ్రెస్ టిడిపితో చేతులు కలపడానికి ప్రతీకారం అనే ఓ కారణం అయినా ఉంది. మరి చంద్రబాబుకు ఏ కారణం ఉంది? తెలంగాణాలో కేసుల విషయంలో ఏదో ఉపయోగం ఉంటుందని కాంగ్రెస్ గూటికి చేరాడు. కానీ పాపం ఆ ఆశలు అడియాశలు అయ్యాయి. మరి ఎపిలో కాంగ్రెస్ తోనే దోస్తీ వెనుక మతలబు ఏమిటో? దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన పనే లేదు. ఇక బాబుకు మిగిలిన ఏకైక ఆప్షన్ కాంగ్రెస్సే. బీజేపీతో నాటకం అనే అంకానికి ఎలాగూ తెరపడింది. మరి మరో నేషనల్ పార్టీ పంచన చేరకుంటే దేశ ప్రగతి అదే తెలుగుదేశ ప్రగతి ఎలా? అవినీతి కేసులపై స్టేలు ఎలా? ఎటూ ప్రియ శిష్యుడు కాంగ్రెస్ కోటలో పాగా వేసుకుని ఉన్నాడు. అవసరానికి అక్కరకు రానే వస్తాడు. అసలీ సయోధ్యకు ముఖ్య కారకుడు, మధ్యవర్తీకుడే అతడయ్యె. ఇన్నేళ్ల చరిత్రలో పొత్తు లేకుండా పోయిన ఎన్నిక ఒక్కటైనా ఉందా? లేదే? ఉండదు...ఉండబోదూ!! సింహం సింగిల్ గా2004 ఎన్నికల్లో వైయస్ రాజశేఖర రెడ్డి పొత్తు లేకుండా ఎన్నికలకు ఒంటరిగా వెళ్లాలని సూచించారు. గెలుస్తామనే ధీమా ప్రకటించారు. కానీ నాటి కాంగ్రెస్ నాయకులు సోనియా చెవిలో రొదపెట్టి టిఆర్ఎస్ తో పొత్తుకు ఒప్పించారు. కానీ 2009లో మరే పొత్తుకూ వైయస్సార్ అంగీకరించలేదు. గెలుపు బాధ్యత నాది అన్నారు. సోనియాకు కాదనేందుకు అవకాశమే లేకుండా పోయింది. అన్నట్టుగానే ఆ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి చిరస్మరణీయుడయ్యారు. నేడు వైయ్యస్ బాటలోనే తనయుడు వైయ్యస్ జగన్ అడుగులు వేస్తున్నారు. పొత్తులు కాదు, నాయకుడిపై ఉన్న నమ్మకమే గెలిపిస్తుందని నమ్ముతున్నారు. ఏ జాతీయ పార్టీ, ఏ ప్రాంతీయ పార్టీతో పొత్తు కోసం వెంపర్లాడలేదు. తన కోసం ప్రచారం చేయమని ఎవ్వరినీ బతిమిలాడలేదు. తనకు మద్దతివ్వమని ఏ పార్టీ గడపా తొక్కలేదు. అండగా ఉండమని ఏ ప్రభుత్వాన్నీ అర్థించలేదు. అతడి విశ్వాసం ప్రజలు. అతడి పొత్తు ప్రజలతో. అతడి ధైర్యం ప్రజల్లో. నాడు ఎన్టీరామారావు గారు అన్నట్టు కాంగ్రెస్ లాంటి కుక్కమూతి పిందెలకు, చంద్రబాబు లాంటి గోముఖ వ్యాఘ్రాలకూ ఎప్పుడూ ఎవరో ఒకరి సపోర్టు కావాలి. పరాన్న జీవుల్లా వేరొకరిపై ఆధారపడి గెలవాలి. జగన్ లాంటి జననేతకు జనులే కూటమి. వారి నమ్మకమే అసలైన పొత్తు.