బీఎన్ రెడ్డి 1951లో తీసిన క్లాసిక్ ‘మల్లీశ్వరి’ సినిమా చూశారా? అయితే, మీరు టీజీకే అనే టీజీ కమలాదేవినీ చూసే ఉంటారు. బీఎన్ రెడ్డి 1951లో తీసిన క్లాసిక్ ‘మల్లీశ్వరి’ సినిమా చూశారా? అయితే, మీరు టీజీకే అనే టీజీ కమలాదేవినీ చూసే ఉంటారు. (ఈమెకి పెద్దలు పెట్టిన పేరు గోవిందమ్మ). ఆ సినిమాలో మల్లీశ్వరి (భానుమతి) రాణివాసానికి వెళ్లిన తర్వాత అక్కడ ఆమెకో ఇష్టసఖి -జలజ- తగుల్తుంది. ఆ జలజ ఎవరో కాదు- టీజీ కమలాదేవే! గురువారం నాడు -అగస్ట్ 16న- టీజీకే చెన్నైలో కన్నుమూశారు. ఆమె వయసు 84. నిజానికి మల్లీశ్వరి కన్నా పదేళ్లకు ముందే టీజీకే సినీ రంగప్రవేశం జరిగిపోయింది. 1941లోనే హెచ్‌ఎమ్ రెడ్డి తీసిన ‘తెనాలి రామకృష్ణ’ సినిమాతో టీజీకే శ్రీకారం చుట్టింది. అదే సంవత్సరం ఆమె ‘చూడామణి’, ‘దక్షయజ్ఞం’ చిత్రాల్లో కూడా నటించారు. అటు తర్వాత వరస పెట్టి ‘బాల నాగమ్మ’, ‘ముగ్గురు మరాఠీలు’, ‘గుణ సుందరి కథ’, ‘మాయలోకం’ లాంటి సినిమాలు -70 వరకూ- చేస్తూ పోయారు.సినిమాల్లోకి రాకముందే టీజీకే నటిగానూ, గాయనిగానూ మంచి పేరు తెచ్చుకుంది. ఆమె రంగస్థలంమీద ఎన్నో పురుష పాత్రలను ధరించి మెప్పించింది. వాటిల్లో ‘అలెగ్జాండర్’ సుప్రసిద్ధం. ఈ ఒక్క పాత్రనే ఆమె పాతిక సార్లు ప్రదర్శించి మెప్పించారు. రంగస్థలంపై నటనకు ఒకసారి బంగారు పతకాన్ని 80 సార్లు రజత పతకాలనూ గెల్చుకున్నారు టీజీకే. నాటక రంగానికి కమలాదేవి సేవలకు గుర్తింపుగా ఆమెకి ఆంధ్రప్రదేశ్ నాటక ఎకాడెమీ ‘నాటక కళా ప్రపూర్ణ’ బిరుదునిచ్చింది. సినిమాల్లో నటించడం కన్నా తనకు రంగస్థలంపై అభినయించడమంటేనే అభిమానమని టీజీకే అనేవారు.ఇక డబ్బింగ్ కళలో కూడా టీజీకే ఆరితేరారు. పద్మిని, లలిత, బి.సరోజాదేవి తదితర హీరోయిన్లకు టీజీకే గొంతు ఎరువిచ్చారు. ఎన్‌ఏటీ వారి సీతారామ కళ్యాణం చిత్రంలో సీతగా నటించిన గీతాంజలికి టీజీకే చెప్పిన డబ్బింగ్ సుప్రసిద్ధం. అలాగే, పాండురంగ మహాత్మ్యం చిత్రంలో బి. సరోజాదేవికి ఆమె డబ్బింగ్ చెప్పారు. తర్వాతి రోజుల్లో ‘కంచుకోట’, ‘అసాధ్యుడు’, ‘బంగారు సంకెళ్లు’, ‘కథానాయకుడు’, ‘బంగారు పంజరం’, ‘పెత్తందార్లు’ తదితర చిత్రాల్లో టీజీకే చిన్నచిన్న వేషాలు వేశారు. వీటన్నిటినీ మించి, ఆమె గొప్ప బిలియర్డ్స్ క్రీడాకారిణి. జెంషెడ్‌పూర్‌లోని టాటా ఇన్‌స్టిట్యూట్ నిర్వహించిన పోటీల్లో రెండు సార్లు జాతీయ స్థాయి చాంపియన్‌షిప్‌ను గెల్చుకున్నారామె. బిలియర్డ్స్‌లో రాణించిన తొలితరం మహిళల్లో ముందుగా చెప్పుకోవలసిన పేరు ఆమెదే! చెన్నపురి ఆంధ్ర మహాసభ కార్యదర్శిగా పనిచేసి పదిమంది ప్రశంసలు అందుకున్నారు టీజీకే. ఒక్కవ్యక్తిలో ఇంత ప్రతిభ -ఇన్ని ముఖాలుగా- తేజరిల్లడం అరుదేమరి! పద్మశ్రీ (చిత్తూరు) వుప్పలదడియం నాగయ్యకు టీజీకే స్వయానా మరదలు. చెన్నై వాటర్ వర్క్స్‌లో పనిచేసే ఆవుల చంద్రబాబు నాయుడును టీజీకే పెళ్లాడారు. తనకు రాదగినంత పేరు, ప్రోత్సాహం దక్కలేదని కమలాదేవి బాధపడేవారు. ఆమె బాధలో ఎంతో న్యాయం ఉంది!