నాటి వైయస్ ధీమా నేడు అదృశ్యం

'రాజన్న ఉన్నప్పుడు విత్తనాలకు 50% ఉన్న రాయితీని ఇప్పుడు తగ్గించేశారు. సకాలంలో రాయితీ విత్తనాలూ అందక.. పంట ఖాళీగా వదిలేశాం. కరెంటు, నీళ్లు లేవు.. మమ్మల్ని పట్టించుకునే నాథుడే లేడు.' ఇదీ వేరుశెనగ రైతు  ఆవేదన.
'ఈ ప్రభుత్వానికి ప్రజా సమస్యలే పట్టడం లేదు. ఇలాంటి అసమర్థ సర్కారుపై తెలుగుదేశం అవిశ్వాసం పెట్టదేం. జగనన్నను దీవిస్తే.. రాజన్న రాజ్యం మళ్లీ వస్తుంది.' ఇదీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల సమాధానం.

షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ శుక్రవారం యాత్ర ముగిసేనాటికి.. 16 రోజులూ.. 213.60 కిలోమీటర్లు పూర్తిచేసుకుంది.   ఉరవకొండ నియోజకవర్గంలో సాగిన యాత్రలో ఆమెకు వేరుశెనగ రైతులు తమ కష్టాలను చెప్పుకున్నారు. వారికి షర్మిల భరోసా కల్పించారు.
‘‘అప్పోసొప్పో చేసి పెట్టుబడి పెడుతున్నాం.. రాత్రనక, పగలనక కష్టపడుతున్నాం.. కానీ ఏం లాభం? సబ్సిడీ విత్తనాలు అందవు.. నీరుండదు.. కరెంటు ఉండదు.. వాన వచ్చో, వరదొచ్చో.. పంట నష్టపోతే వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలోలాగా బీమా అందదు.. మమ్మల్ని పట్టించుకునే నాథుడే లేడు’’.... ఇదీ వారి గోడు. పాదయాత్రలో  ఏ  రైతును కదిలించినా ఇదే ఆవేదన. మహానేత మరణించాక తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు.  మార్గమధ్యంలో ఆమె పలుచోట్ల ప్రజల సమస్యలు తెలుసుకుని వారితో మాట్లాడారు. కోనాపురం సమీపంలో వేరుశనగ సాగు చేస్తున్న రైతు ల క్ష్మిని షర్మిల కలిసినప్పుడు ఆమె తన బాధను చెప్పుకుంది.

వేరుశనగ, అంతర పంటగా కంది వేయాలనుకున్నామని లక్ష్మి చెప్పారు. కంది వేసినా రాయితీ కింద ఇచ్చే వేరుశనగ విత్తనాలు సరైన సమయానికి అందలేదన్నారు. ఈ కారణంగా కొంత ఖాళీగా వదిలేశామని ఆమె తెలిపారు. కంది మాత్రమే పెరుగుతోందని చెప్పారు.  4 ఎకరాల్లో వేశామనీ, 40 వేలు ఖర్చయిందనీ,  చెట్టుకు కాయలే లేవనీ చెప్పారు.  దేవాలయ భూముల్ని గుత్తకు తీసుకుని సాగుచేశాం. దిగుబడి రాకున్నా  గుత్త కట్టాల్సిందేనని లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు.

గతంలో  వేరుశనగ విత్తనాలకు 50 శాతం రాయితీ ఉండేదని లక్ష్మి కుమారుడు కృష్ణమూర్తి చెప్పారు.  ఇప్పుడు  దానిని తగ్గించారని ఆవేదన వ్యక్తం చేశారు. రూ. 300 పెడితే ఎకరానికి సరిపడా కంది విత్తనాలు లభించేవనీ,   ఇప్పుడు రూ. 1,200 ఖర్చయ్యిందని తెలిపారు. వేరుశనగ 30 కిలోల దర రూ.1,400కు పెరిగిపోయిందన్నారు. మహానేత రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు రూ. 25 వేల పంటకు రూ. 12 వేలు బీము వచ్చిందనీ,  రెండేళ్లుగా అది కూడా  రావడం లేదనీ లక్ష్మి ఆవేదన చెందారు. వైఎస్ ఉన్నప్పుడు వానలు కూడా బాగా పడ్డాయనీ,  ఇప్పుడు సహాయం చేసేవారే లేరనీ తెలిపారు. రాజు మంచి వాడైతే దేవుడు కూడా దీవిస్తాడని షర్మిల ఆమెతో అన్నారు. రుణాలు ఇస్తున్నారా అని ప్రశ్నించారు. వడ్డీ లేని రుణమని చెబుతున్నారు కానీ లెక్క కడితే మూడు రూపాయల వడ్డీ తేలుతోందని లక్షి చెప్పారు. 

చంద్రబాబు పాలన నాటి పరిస్థితే..
చంద్రబాబు ఉన్నప్పటి పరిస్థితే ఇప్పుడూ దాపురించిందని షర్మిల ఆమెతో అన్నారు. అప్పుడు 4 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారనీ, ఇప్పుడు కూడా రైతుకు దిక్కులేకుండా పోయిందనీ ఆవేదన వ్యక్తం చేశారు. జగనన్నను మీరు దీవిస్తే.. మళ్లీ రాజన్న రాజ్యం వస్తుందని భరోసా ఇచ్చారు.
అంతకు ముందు ఆమె పెన్న అహోబిలం వద్ద స్థానికులతో మాట్లాడారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. ఇక్కడ తాగు నీరే లేదనీ, కరెంటు రెండు గంటలు కూడా ఉండటం లేదనీ తెలిపారు. పంటలు లేవనీ, బిల్లు కడితే కరెంటు ఇస్తామంటున్నారనీ చెప్పారు. రాజన్న ఉన్నప్పుడు 7 గంటల పాటు కరెంటు ఉండేదనీ, అది కూడా ఉచితంగానే ఇచ్చేవారనీ తెలిపారు. గ్యాస్ ధర రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు రూ. 320 ఉండేది. ఇప్పుడు రూ. 480 అంటున్నారన్నారు. కొద్దిగానే వాడుకోవాలట అని కూడా  చెప్పారు. వైయస్ ఉన్నప్పుడు ఇచ్చిన పింఛన్లను కూడా తొలగిస్తున్నారనీ, ఎలా బతకాలో అర్థం కావడం లేదనీ ఆందోళన వ్యక్తం చేశారు.  బ్యాంకుల చుట్టూ తిప్పించుకోవడం తప్ప పావలా వడ్డీ పథకం కింద రుణాలే ఇవ్వడం లేదని చెప్పారు. వ్యవసాయం పనులూ లేవన్నారు. వంద రోజులు కాకుండా ముపై నుంచి నలబై దినాలే పని కల్పిస్తున్నారని ఫిర్యాదు చేశారు.  ఒకవేళ ఇచ్చినా యాబై నుంచి డెబ్బై రూపాయలు మాత్రమే కూలీ ఇస్తున్నారన్నారు. రాజన్న ఉన్నప్పుడు చేతి నిండా పని దొరికేదనీ, వంద నుంచి నూట ఇరవై రూపాయలు కూలీ ఇచ్చేవారనీ చెప్పారు.

తేడా గమనించారా: షర్మిల
ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి, రాజశేఖరరెడ్డి ప్రభుత్వానికి మధ్య ఎంత తేడా ఉందో? దీన్ని బట్టి అర్థమవుతోందని చెప్పారు. రాజన్న ఐదేళ్లు బాగా పనిచేశాడని మీరు మళ్లీ గెలిపించారనీ,  కనీసం ఆయనను గౌరవిద్దామన్న ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి లేదనీ ఆవేదన వ్యక్తంచేశారు. రాజన్న రెండోసారి గెలవకముందు 9 గంటలు కరెంటు ఉచితంగా ఇస్తానన్న విషయాన్ని ఆమె గుర్తుచేశారు. ఈ ప్రభుత్వం రెండు, మూడు గంటలే ఇస్తోందనీ, సర్‌చార్జీల పేరుతో బిల్లులు కట్టమంటోందనీ చెప్పారు. ఇలాంటి ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టి నిలదీసే అవకాశమున్నప్పటికీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అలా చేయట్లేదని ఆరోపించారు. సర్కారుతో కుమ్మక్కవ్వడమే దీనికి కారణం. ఈ ప్రభుత్వానికి, ప్రతిపక్ష టీడీపీకి సమయం వచ్చినప్పుడు గట్టిగా బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. జగనన్న ముఖ్యమంత్రి అయితే రాజన్న రాజ్యం మళ్లీ వస్తుందనీ, అప్పుడు 9 గంటల కరెంటు  అందుతుందనీ, నీళ్లొస్తాయి.. వడ్డీ లేని రుణాలూ వస్తాయనీ షర్మిల వారికి భరోసా ఇచ్చి ముందుకు కదిలారు.
Back to Top