మీ ఇంటికి మీ భూమి.. ప్రచారం డొల్ల

ప్రజల ద్రష్టిని మళ్లించటానికి చంద్రబాబు ప్రభుత్వానికి బోలెడన్ని చిట్కాలు అందుబాటులోకి వస్తుంటాయి. రుణమాఫీ, విత్తన కొరత, పెట్టుబడుల అలభ్యత, తక్కువ మద్దతు ధరలు వంటి సమస్యలతో బాధపడుతున్న రైతుల్ని మభ్య పెట్టి, మళ్లించేందుకు మీ ఇంటికి మీ భూమి అంటూ పథకాన్ని బ్రహ్మాండంగా ప్రకటించారు. కానీ, దీని అమలు లో జరగుతున్న జాప్యం అంతా ఇంతా కాదు.

మీ ఇంటికి మీ భూమి కార్యక్రమం మొదటి విడతలో భాగంగా రెవిన్యూ రికార్డుల ప్రకారం 1బి ఖాతాల్లోని వివరాల్ని కాపీ తీసి రైతులకు అందచేశారు. వీటిలో అభ్యంతరాలు ఉంటే తెలియ చెప్పాలని, వాటిని పరిష్కరిస్తామని తెలియచేశారు. దీని మీద రైతులు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకొన్నారు. వీటిలో అక్షర దోషాలు, చిరునామాల మార్పిడి దాకా సరి చేయగలిగారు. వాస్తవ పొజిషన్ కు సంబంధించిన అభ్యంతరాల విషయంలో పెండింగ్ పడుతోంది.

ప్రతీ జిల్లాలోనూ పొజిషన్ ను నిర్ధారించాల్సింది సర్వేయర్ మరియు రెవిన్యూ ఇన్ స్పెక్టర్. అన్ని జిలాల్లోనూ సర్వేయర్ల పోస్టులు చాలా వరకు ఖాళీలు ఉన్నాయి. ఒక్కో జిల్లాకు సగటున 3 నుంచి 4 వందల మంది దాకా సర్వేయర్లు అవసరం అవుతారు.  కానీ, ఏ జిల్లాలోనూ వందకు మించి సర్వేయర్లు కనిపించారు. చాలాచో ట్ల 50, 60 మందితోనే నెట్టుకొస్తున్నారు. రెవిన్యూ ఇన్ స్పెక్టర్ లను ఇంచార్జ్ ల ద్వారా నియోగిస్తుండటంతో కొంత వరకు పని జరుగుతోంది. సాంకేతిక పరిజ్నానం ఉన్న సర్వేయర్ పోస్టులను భర్తీ చేయకపోవటంతో ఇబ్బందులు తప్పటం లేదు.

దీంతో రెవిన్యూ రికార్డులు నిర్ధారణ చేస్తామని అధికారులు చెబుతుంటే తమ భూమి సరిహద్దుల సంగతి ఏమిటని రైతులు లబోదిబోమంటున్నారు. ఈ అధికారిని, ఆ అధికారిని కలిసి మొర పెట్టుకొంటున్నారు. ఈ లోగా పుణ్యకాలం కాస్తా గడిచిపోతుంది. మొత్తం మీద రైతుల ద్రష్టి మళ్లించేందుకు ఉద్దేశించిన ఈ చిట్కా ఎంత వరకు ప్రయోజనం దక్కిస్తుంది అన్నది చూడాల్సి ఉంది.


Back to Top