మహానేతతోనే అదృశ్యం

జలగుండెల్లో కొలువైన ఆ మహానేత అందని తీరాలకు చేరి అప్పడే మూడేళ్లయిపోయింది. మీ వెంటే మేమూ అంటూ రాష్ట్రం నుంచి అభివృద్ధి-సంక్షేమం కూడా అదృశ్యమైపోయాయి. గతమెంతో ఘనం. వర్తమానం గందరగోళం. భవిష్యత్‌పై అయోమయం. మన రాష్ట్ర ప్రస్తుత పరిస్థితి ఇది. పాలన గాలికొదిలేయడంతో తుపానులో చిక్కుకున్న నావలా కొట్టుమిట్టాడుతోంది. అభివృద్ధి, సంక్షేమం రెండు చక్రాలుగా వైయస్‌ హయాంలో పరుగుతీసిన రాష్ట్ర ప్రగతి రథం, నేడు.. ఆ చక్రాలే విరిగి నేలన కూలబడింది.

అనాటికీ, వర్తమానానికీ ఒక్కటే తేడా. అదే జన హృదయాధినేత లేని లోటు. ఒకే ఒక్కడి మరణం రాష్ట్ర భవిష్యత్తునే మార్చేసింది.

కుల, మత, ప్రాంతాలకు అతీతంగా చేపట్టిన సంక్షేమ పథకాలు జనం ముఖం చూడటం మానేశాయి. ప్రాంతీయ విద్వేషాలతో రాష్ట్రం రావణ కాష్టంలా తగలబడింది. అభివృద్ధి పట్టని నేతల పాలనలో ప్రతిష్ఠాత్మకమైన పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోయాయి. జననేత ఆకస్మిక అస్తమయం తరువాత, ఒక్కటంటే ఒక్కటి కూడా.. చెప్పుకోదగ్గ పరిశ్రమంటూ ఏదీ మన రాష్ట్రం తలుపు తట్టలేదు. ఫలితం ఆంధ్రప్రదేశ్‌ అధకార బంధురమైంది.

వైయస్ ‌తొలిసారి ముఖ్యమంత్రి అయ్యేనాటికి రాష్ట్రాన్ని ఏలుతుండిన అస్తవ్యస్త గందరగోళ పరిస్థితులు, ఆయన ఈ లోకంనుంచి కనుమరుగు కాగానే.. మళ్లీ రాష్ట్రం మీద విరుచుపడ్డాయి. ఉచిత విద్యుత్‌ ఊసులేక పల్లెలు చీకటిపాలయ్యాయి. అన్నదాతకు బతుకు బరువైంది. నిరుపేద చిరునవ్వే మరచిపోయాడు. వ్యవసాయం దండగన్న రోజులు మళ్లీ దాపురించాయి. రైతన్నలు సేద్యానికి సెలవుచెప్పేశారు. వరి కంటే ఉరి మేలనుకున్నారు. అప్పుల ఊబిలో అన్నదాతల ప్రాణాలు కూరుకుపోతున్నాయి. చేతివృత్తుల వారికి చేయూత కరువైంది. చేనేత కార్మికుల బతుకు భారమైంది. 108 మూగబోయింది.

ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చేశారు. జలయజ్ఞం కనుమరుగై ప్రాజెక్టులు పడకేశాయి. కొత్తగా ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డుల మంజూరు కలలోని మాటగా మిగిలిపోయాయి. పేదోడి ఉన్నత చదువులు చూసి నేటి ప్రభువులకు కన్నుకుట్టింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై బేరసారాలతో పేద విద్యార్థులకు ఉన్నతచదువులు అందని ద్రాక్షే అయ్యాయి. లఘు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు విద్యుత్ కోతలతో అల్లాడిపోతున్నాయి. విధి మహానేతతో పాటు ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలనూ మింగేసింది. ఒక్క ‌ముక్కలో చెప్పాలంటే.. రాజన్న లేని రాష్ట్రానికి ఆమడదూరాన అభివృద్ధి సంక్షేమం పారిపోతున్నాయి.

మరోపక్క, సంక్షేమ రథ సారథి కుటుంబంపై కక్షసాధింపులు మొదలయ్యాయి. ప్రజాభిమాననేత కోసం ప్రాణాలొదిలిన కుటంబాలను పరామర్శిస్తానని, వారి కన్నీళ్లను తుడిచి, ఓదార్చుతానన్నందుకు ఆయన కుమారుడు వైయస్‌ జగన్మోహన్‌రెడ్డిపై నల్లకాలువ సాక్షిగా వేధింపులు పెరిగిపోతున్నాయి. ఏ పార్టీకైతే రాజశేఖరరెడ్డి తన జీవితాంతం సేవలు చేశారో,. ఏ పార్టీనైతే రెండుసార్లు అధికారంలోకి తెచ్చారో.. ఆ పార్టీయే... దివంగత నేత కుటుంబంపై కక్షగట్టింది. ఓదార్పు యాత్రను చూసి ఓర్వలేకపోయింది. జనం మధ్య జగన్‌ను చూడలేక జగమంత కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసింది.

మహానేత కుటుంబంలోనూ చిచ్చుపెట్టింది. వ్యాపారాలు చేయడం, ఆస్తులు సంపాదించడమే నేరమన్నట్టుగా జగన్‌ని దోషిగా చిత్రీకరించే మహాకుట్రకు బీజం వేసింది. ఆర్థికనేరాల ఆరోపణలతో సీబీఐని ఉసిగొల్పింది. జగన్‌ ఆనాడు ఏ పదవిలో లేకపోయినా, ప్రభుత్వ అధికారి కాకపోయినా.. అక్రమాలకు పాల్పడ్డారంటూ వేధించింది. ఆయన సంస్థలపై లెక్కలేనన్ని దాడులు చేయించింది. ఢిల్లీ పెద్దలకు వంగివంగి దండాలు పెట్టడం తన వల్లకాదన్న తెలుగువాడి ఆత్మగౌరవానికి నాలుగ్గోడల మధ్య సంకెళ్లు వేసింది.

వైయస్‌ సతీమణి విజయమ్మ, వారి కుమార్తె షర్మిళ, వైఎస్‌ భారతి రాత్రంతా నడిరోడ్డుపై గడిపే పరిస్థితి కాంగ్రెస్‌ పార్టీ కల్పించింది. జీవితాంతం సేవ చేసినందుకు మహానేత కుటుంబానికి సరైన బహుమానమే ఇచ్చింది. అయితే ప్రజలు మాత్రం వైయస్ఆర్ను మరవలేదు. ఆ సంక్షేమరథ సారథి కుటుంబానికి మేమున్నామంటూ అండగా నిలిచారు. వైయస్ భౌతికంగా మరణించి మూడేళ్లు అయినా ఆయన ప్రజల గుండెల్లో శాశ్వితంగా నిలిచిపోయారు.

Back to Top