ప్రజా ప్రభుత్వానికి బాటలు

  • వైయస్‌ఆర్‌సీపీలోకి ఊపందుకున్న వలసలు
  • వైయస్‌ జగన్‌ పోరాట పటిమకు ఆకర్షితులవుతున్న ఇతర పార్టీల నేతలు
  • మొన్న కందుల దుర్గేష్‌..నిన్న వెలంపల్లి శ్రీనివాస్‌
  • రేపు కాసు మహేష్‌రెడ్డి..పార్టీ బలోపేతంపై అధినేత వైయస్‌ జగన్‌ దృష్టి
  • చేరికలతో వైయస్‌ఆర్‌సీపీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం
అవిభక్త రాష్ట్రంలో అసమర్ధ పాలన నెలకొంది. సంక్షేమ పథకాల జాడ కానరావడం లేదు. ఎన్నికల్లో అమలుకు సాధ్యం కాని హామీలు గుప్పించిన తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మాట తప్పారు. ఏ ఒక్క సంక్షేమ పథకం అమలు చేయకపోగా, అవినీతి సొమ్ముతో ఎదుటి పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయగా, ప్రభుత్వ విధానాలు నచ్చక, చంద్రబాబు మోసాలను సహించలేక ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వైపు మళ్లుతున్నారు. రెండున్నరేళ్లలో చంద్రబాబు ఏ ఒక్క మంచి పని చేయలేదు. ప్రజలను మభ్యపెడుతూ కాలయాపన చేస్తున్న తీరుపై సొంత పార్టీ నేతల్లోనే అసంతృప్తి ఎక్కువవుతోంది. దీంతో ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వైపు ఆకర్షితులవుతున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను టీడీపీ ప్రభుత్వం తూట్లు పొడవడంతో మళ్లీ రాజన్న రాజ్యం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఆయా పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు వైయస్‌ జగన్‌ ద్వారానే రాజన్న రాజ్యం సాధ్యమని భావిస్తున్నారు. వైయస్‌ జగన్‌ చేస్తున్న పోరాటాలకు ఆకర్శితులై ఒక్కొక్కరుగా వైయస్‌ఆర్‌సీపీలో చేరిపోతున్నారు. 

ఇటీవల వైయస్‌ఆర్‌సీపీలోకి భారీగా  వలసలు ప్రారంభమయ్యాయి. పార్టీ ఏర్పాటు నుంచి రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టిస్తున్న వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో పని చేసేందుకు అన్ని పార్టీల నాయకులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఎన్నికలు ఇంకా రెండున్నరేళ్లు ఉండగానే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వలసలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే కాంగ్రెస్‌ ఖాళీ కాగా.. తాజాగా టీడీపీ, బీజేపీల నుంచి ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వైయస్‌ఆర్‌సీపీలో చేరుతున్నారు.  దీంతో రెండేళ్లలో ప్రజా ప్రభుత్వం వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ప్రజా ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు సమూచిత స్థానం ఉంటుందని, చంద్రబాబు పాలనలో నష్టపోయిన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని వైయస్‌ జగన్‌ హామీ ఇవ్వడంతో ఇక ఈ దుర్మార్గ ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. వైయస్‌ జగన్‌కు అండగా నిలిచేందుకు నాయకులు, కార్యకర్తలు క్యూ కడుతున్నారు.

దావానంలా వలసలు
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వలసల పర్వం మొదలైంది. డిసెంబర్‌ నెలలోనే వరుసగా నేతలు వచ్చి చేరిపోతున్నారు. పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో కొందరు చేరితే, మరి కొందరు ఆయా నియోజకవర్గాల్లో జరుగుతున్న గడప గడపకూ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమంలో పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. డిసెంబర్‌ 12న తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్‌ తన అనుచరులతో కలిసి హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్‌ జగన్‌ సమక్షంలో పార్టీలో చేరారు. అదే రోజు అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో కనగానపల్లె ఎంపీటీసీ సభ్యులు రాజేంద్ర, రామకృష్ణారెడ్డి వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. డిసెంబర్‌ 13న విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌ తన అనుచరులతో కలిసి వైయస్‌ జగన్‌ సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి మనవడు, మాజీ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి కుమారుడు కాసు మహేష్‌ వైయస్సార్సీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది.

టీడీపీలో బీసీలకు అన్యాయం
తెలుగు దేశం పార్టీలో బీసీలకు సమన్యాయం జరగడం లేదు. అనంతపురం జిల్లా కనగానపల్లె మండల పరిషత్‌ అధ్యక్షుడిగా ఉన్న బిల్లె రాజేంద్రను ఆ పదవి నుంచి తొలగించేందుకు మంత్రి పరిటాల సునీత కుట్ర చేశారు. దీంతో మనస్థాపానికి గురైన ఎంపీపీ, వైస్‌ ఎంపీపీలు ఈ నెల 12న వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. దీంతో ఈ నెల 14న కనగానపల్లె ఎంపీపీ ఉప ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో బీసీ అభ్యర్థిని ఓడగొట్టేందుకు ఏకంగా మంత్రిస్థాయిలో ఉన్న పరిటాల సునీత రంగంలోకి దిగారు. మండల పరిషత్‌ కార్యాలయంలో మకాం వేసి మరీ ప్రలోభాలకు దిగారు. అనుకూలంగా ఓటు వేయని ఎంపీటీసీలపై దాడికి పాల్పడ్డారు. పోలీసులు, అధికారుల సాయంతో ఎన్నికను ఏకపక్షంగా జరుపుకొని అగ్రవర్ణాలకు ఎంపీపీ పదవిని కట్టబెట్టారు. 

అలాగే కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని నిడమనూరు సర్పంచ్‌గా బీసీ వర్గానికి చెందిన కోటేశ్వరరావు ఎన్నికయ్యారు. ఆయన ఇటీవల వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. దీంతో బుధవారం అర్ధరాత్రి టీడీపీకి చెందిన అగ్రవర్ణాలు కోటేశ్వరరావు ఇంటి వద్ద పార్క్‌ చేసిన కారును నిప్పంటించి తగుల బెట్టారు. ఇలా బీసీలపై అధికార పార్టీ అరాచకాలకు పాల్పడుతుండటంతో ఆ వర్గం ప్రజలు భయాందోళనకు గురై వైయస్‌ఆర్‌సీపీ వైపు వస్తున్నారు. బీసీలకు చంద్రబాబు సముచిత స్థానం కల్పించకపోవడంతో ఆ వర్గం ప్రజలు  ఒక్కొక్కరు పార్టీని వీడుతున్నారు. రోజు రోజుకు వైయస్‌ఆర్‌సీపీలో చేరికలు పెరుగుతుండటంతో పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం పెరుగుతోంది. మరో రెండేళ్లలో  ప్రజాప్రభుత్వ అధికారంలోకి రానుందని దీమా వ్యక్తం చేస్తున్నారు.  
 
Back to Top