కోర్టులు సీబీఐ ఎత్తుగడలను గమనించాలి!


వైయస్.జగన్మోహన్ రెడ్డి పట్ల జనాభిప్రాయం చీలి ఉంది. ఆయన బలమైన వ్యక్తిత్వం కలిగినవారు. వివిధ కారణాల వల్ల కొందరు ఆయనను ఇష్టపడితే మరికొందరికి ఆయనంటే గిట్టదు. చాలామందికి ఆయన మీద ప్రత్యేకించి ఏ అభిప్రాయం లేకపోనూ వచ్చు. ఆరు నెలలకు పైగా జైలులో ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సోమవారం (24-12-12) మరోసారి బెయిలు నిరాకరించింది. క్రిస్మస్‌కి ఆయన జైలులోనే గడిపారు. క్విడ్ ప్రో కో, ఆదాయానికి మించిన ఆస్తులు వంటి పలు ఆరోపణలను ఎదుర్కొంటున్న రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. చాలా నెలలుగా ఆయన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తును ఎదుర్కొంటున్నారు.

జగన్ అనుకూల, వ్యతిరేక శిబిరాలలోనివారు కాకుండా చట్టాన్నిగౌరవిస్తూ, రాజ్యాంగసంస్థలు ప్రజాస్వామికంగా పని చేయాలని కోరుకునే సామాన్యజనం ఇటీవలి న్యాయవ్యవస్థ నిర్ణయాల పట్ల ఆశాభంగం చెందారు. వారు న్యాయపరిపాలన సరిగా సాగాలని బలంగా వాంఛించేవారు. చట్టబద్ధంగా, నిష్పాక్షికమైన రీతిలో విచారణ జరిగిన మీదట నిందితుడు దోషిగా కనుక తేలితే శిక్ష పడాలని వారి భావన. కోర్టులు ప్రజాస్వామిక వ్యవస్థలో భాగం. వ్యక్తులకున్న హక్కులను, ప్రత్యేకించి ప్రజాస్వామిక, రాజకీయ హక్కులను కోర్టులు గౌరవించాలి. రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల పరిరక్షణలో సాంకేతికాంశాలేవీ అడ్డు రాకూడదు.

జగన్మోహన్ రెడ్డికి బెయిలు నిరాకరణ నేపథ్యంలో రాజ్యాంగం హామీ ఇచ్చిన హక్కులు, స్వేచ్ఛ, వాటి నిరాకరణ అన్నది ప్రజల్లో ప్రధాన చర్చనీయాంశమైంది. ప్రధానంగా మూడు అంశాలు చర్చనీయాంశాలుగా ఉన్నాయి. ఒకటి, బెయిలు పొందడానికి సంబంధించిన జగన్‌కు (ఆ మాటకొస్తే ఏ నిందితుడికైనా) ఉన్న హక్కు. రెండు, రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛల పరిధిలో జగన్ (అది మరెవరైనా సరే) హక్కులు. మూడు, వ్యక్తులను బట్టి సీబీఐ అనుసరిస్తున్న వరణాత్మక (సెలెక్టివ్) విధానం. సీబీఐపై ఒత్తిళ్ల ఆరోపణలు, తెర వెనుక నిర్ణయాలకు సంబంధించిన వదంతులు ఆట్టే ముఖ్యం కాబోవు.

కొద్ది నెలల కిందట జగన్ మొదటి బెయిలు దరఖాస్తుపై విచారణ జరిపిన హైకోర్టు ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు నిందితుడిని ఎందుకు అనుమతించకూడదంటూ సీబీఐని ప్రశ్నించింది. నేరం ఇంకా రుజువు కాని నిందితుడు, పౌరుడి న్యాయబద్ధమైన హక్కు అయిన ప్రజాస్వామిక ప్రక్రియలో పాల్గొనదలచారు. కానీ సరిగ్గా హైకోర్టు తీర్పు వెలువడే ముందురోజు సబార్డినేట్ జడ్జీలకు సంబంధించిన ఒక స్కామ్ న్యూస్ ఛానెళ్లలోనూ, వార్తాపత్రికల్లోనూ హోరెత్తింది. ఫలితం..తెలిసిందే. బెయిలు పిటిషన్ తిరస్కరించబడింది.

జగన్ ఒక స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్‌పి)తో సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు. అన్నికేసుల్లోనూ చార్జిషీట్లు దాఖలైన తర్వాతే జగన్ బెయిలు పిటిషన్‌కు దరఖాస్తు చేసుకోవాలని చెబుతూ సుప్రీంకోర్టు ఆ పిటిషన్‌ను తిరస్కరించింది. జగన్‌పై ఉన్న ప్రతి కేసు, లేదా ఎవరిపై ఉన్నకేసైనా అది దానికది విడిగా ప్రత్యేకమైన కేసు అవుతుంది. దానిలో నిందితుడు బెయిలు కోరవచ్చు. కోర్టు బెయిలు మంజూరు చేయవచ్చు. లేదా చేయకపోనూ వచ్చు. కానీ అన్ని కేసుల్లోనూ చార్జిషీట్లు దాఖలు చేశాక మాత్రమే బెయిలు దరఖాస్తు చేసుకోవాలన్న రూలింగ్ వాస్తవంగా రాజ్యాంగం హామీ ఇచ్చిన హక్కులకు వ్యతిరేకం.

దర్యాప్తుల పేరిట సీబీఐ ఒక వ్యక్తిని జైలులో ఉంచదలచుకుంటే, సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత సైతం కొత్తగా కేసులు నమోదు చేసే వీలు చిక్కిందన్నమాట.  ఏదో ఒక నెపంతో చార్జిషీట్లు దాఖలు చేయడంలో కాలయాపన చేసే వెసులుబాటు కలిగిందన్నమాట. సీబీఐ మాజీ డైరెక్టర్ ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ప్రభుత్వ జోక్యం లేకుండా సదరు సంస్థ స్వతంత్రంగా వ్యవహరించడం లేదని జనం సాధారణంగా విశ్వసించ సాగారు. సీబీఐ తలుచుకుంటే విచారణ మొదలుపెట్టడానికి ముందే జగన్‌ను నెలలకొద్దీ కాలం జైలులో ఉండేలా నిర్బంధించగలదన్న మాట.

ఇది కచ్చితంగా భారత రాజ్యాంగకర్తల ఉద్దేశ్యం కాదు. రాజా సంవత్సరం పాటు జైలులో ఉన్నారు. ఆయన చేసిన నేరం ఇంకా రుజువు కావలసి ఉంది. కరుణానిధి కుమార్తె కనిమొళి ఎలాంటి నేరారోపణ జరుగకుండానే పలు మాసాలు జైలులో గడిపారు. రాజా చార్జ్‌షీట్ దాఖలుకు ముందు ఏడాది పాటు జైలులో ఉన్నారు. ఇప్పుడు 2జీకి సంబంధించిన అన్ని కేసులనూ ఒకచోటికి చేర్చారు. అవి సుప్రీంకోర్టు విచారణలో ఉన్నాయి. తమకు వ్యతిరేకంగా చార్జ్‌షీట్లు దాఖలు చేశాక రాజా, కనిమొళి జైలు నుండి విడుదల అయ్యారు!

అమెరికాతో మన దర్యాప్తు సంస్థలు, కోర్టుల పనితీరును-ప్రయోజకత్వాన్ని పోల్చి చూడండి!  జన్మతః భారతీయుడైన గోల్డ్‌మ్యాన్ సచ్స్ మాజీ డైరెక్టర్ రజత్ గుప్తా ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని ఆరోపిస్తూ 2011 అక్టోబర్ 26 న చార్జ్‌షీట్ దాఖలు చేశారు. శ్రీలంకకు చెందిన హెడ్జ్‌ఫండ్ వ్యవస్థాపకుడు, తన మిత్రుడు, వ్యాపార సహచరుడు అయిన రాజా రాజరత్నంకు బోర్డ్‌రూమ్ రహస్య సమాచారాన్ని చేరవేశారని ఆయనపై నేరారోపణ చేశారు. 2012 మే 22న విచారణ ప్రారంభం కాగా కేవలం 20 రోజుల్లో జూన్ 12న ఆయనను దోషిగా నిర్ధారిస్తూ తీర్పు వెలువడింది. నేరారోపణ జరిగినప్పుడు ఆయనను కొద్దిపాటి సమయం అరెస్టు చేశారు. గంటల వ్యవధిలోనే బెయిలుపై ఆయన విడుదల కూడా అయ్యారు. రెండేళ్ల జైలుశిక్ష విధించినప్పటికీ అప్పిలేట్ కోర్టులో ఆయనకు ఉపశమనం లభించిం దిదన్నది వేరే సంగతి. 

తిరిగి జగన్ కేసుకు వద్దాం. హైకోర్టులో బెయిలు నిరాకరణ తర్వాత జగన్ జైలులో తన 90 రోజుల స్టాచ్యుటరీ గడువు ముగిసిందనీ, సీబీఐ చార్జ్‌షీట్లు దాఖలు చేయడంలో విఫలమైనందున తనకు బెయిలు ఇవ్వాలనీ కోరుతూ మరో పిటిషన్ వేశారు. నిర్ణీత గడువులోపు సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు చేయని పక్షంలో నిందితునికి చట్టబద్ధంగా బెయిలు కోరే హక్కు ఉంటుంది. ఈ దరఖాస్తుపై 2012 డిసెంబర్ 20, 21 తేదీలలో వాదనలు జరుగగా జస్టిస్ శేషశయనారెడ్డి కేసును విచారించారు. సీబీఐ ఢిల్లీ నుంచి అడిషనల్ సొలిసిటర్ జనరల్ హరేన్ పి. రావల్‌ను రప్పించగా, జగన్ తరఫున ప్రసిద్ధ క్రిమినల్ లాయర్ సి. పద్మనాభ రెడ్డి వాదించారు.

జగన్‌ను 19 ఏ కేసులో అరెస్టు చేసినట్లు తన రిమాండ్ రిపోర్టులో ఇదివరకు పేర్కొన్న సీబీఐ ఇప్పుడు ఆ అరెస్టు కేవలం వాన్‌పిక్ కేసుకు సంబంధించింది మాత్రమేనని జస్టిస్ శేషశయనారెడ్డికి నివేదించింది. వాన్‌పిక్ కేసులో మోపిదేవి వెంకటరమణ కూడా జైలులో ఉన్నారు. అయితే సీబీఐ ఇచ్చిన ఈ స్పష్టత సీఆర్‌పీసీ సెక్షన్ 437 కింద రెగ్యులర్ బెయిలు కోసం దాఖలు చేసిన మరో దరఖాస్తు విషయంలో జగన్‌కు ఉపయోగపడలేదు.

ఆగస్టు 13న సీబీఐ ఇప్పటికే వాన్‌పిక్ కేసులో చార్జ్‌షీట్ దాఖలు చేసినందున నిందితుడికి అందులో బెయిలు కోరే హక్కుంది. జగన్‌కు బెయిలు నిరాకరిస్తూ అక్టోబర్ 5న సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పుడు దర్యాప్తు పూర్తి చేయడానికి తమకు మూడు నెలలు మాత్రం చాలునని సీబీఐ చెప్పింది. ఈ గడువు 2013 జనవరి 5 నాటికి ముగుస్తుంది. రెగ్యులర్ బెయిలు పిటిషన్‌ను జస్టిస్ శేషశయనారెడ్డి బుధవారం విచారించారు. ఆయన సీబీఐని స్టేటస్ రిపోర్టు సమర్పించమని ఆదేశిస్తూ కేసును 2013 జనవరి 4కు వాయిదా వేశారు. ఈ దృష్ట్యా ఆ రోజు జగన్‌కు కీలకం.

సాధారణంగా ప్రభుత్వ నిర్ణయ ప్రక్రియలో మూడు దశలు ఉంటాయి. 1. ప్రత్యేక వ్యక్తులకు లేదా కంపెనీలకు ప్రయోజనం కలిగేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. మంత్రివర్గ ఆమోదం, ప్రభుత్వ కార్యాలయ ప్రక్రియ, ఒప్పందాల వంటివాటితో ఈ నిర్ణయాలు అమలులోకి వస్తాయి. 2. నిర్ణయాల అమలుకు ప్రభుత్వం జీవోలు జారీ చేస్తుంది. 3. క్విడ్ ప్రో కో (పరస్పరలబ్ధి) ద్వారా మరెవరైనా అనుచిత ప్రయోజనం పొందారా అని ప్రభుత్వం ఆరా తీసే ప్రయత్నం చేస్తుంది.

మొదటి రెండు దశలు సర్వసత్తాక రాష్ట్రం ఆజమాయిషీలోనే జరిగాయి. ఆయా శాఖల కార్యదర్శులు, మంత్రుల రాతకోతలతో ఈ ప్రక్రియ అంతా పకడ్బందీగా జరిగింది. కనుక సాక్ష్యాలను తారుమారు చేయడమన్న ప్రశ్నే తలెత్తదు. కిరణ్ కుమార్ రెడ్డి కానీ రోశయ్య కానీ వారి ప్రభుత్వాలు అంతకు ముందటి ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలను కాదనలేదు. ఆ నిర్ణయాలను వేటినీ రద్దు కూడా చేయలేదు. మంత్రివర్గ సమావేశాలలో సక్రమ పద్ధతిలో సమష్టిగా తీసుకున్ననిర్ణయాలుగా పేర్కొంటూ వైయస్‌ఆర్ ప్రభుత్వ నిర్ణయాలనన్నిటినీ ప్రస్తుత ప్రభుత్వం ఆమోదించింది. పైపెచ్చు సుప్రీంకోర్టులో అరడజను మంది మంత్రులకు న్యాయసహాయం కూడా అందిస్తోంది. అంటే సుప్రీంకోర్టులో ఈ మంత్రులను సమర్థించడం కోసం ప్రభుత్వ ఖజానా నుంచి లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు లెక్క.

బెయిలిస్తే సాక్షులను ప్రభావితం చేస్తారనీ, సాక్ష్యాధారాలను చెరిపేస్తారనీ జగన్‌ బెయిలును వ్యతిరేకిస్తూ సీబీఐ న్యాయస్థానాలలో వాదించింది. సాక్షులంతా రాష్ట్రప్రభుత్వంలో అధికారులు. సాక్ష్యాధారాలన్నీ అధికారిక పత్రాలే కనుక వాటిని చెరిపివేయడం సాధ్యమే కాదు. దర్యాప్తు కొనసాగుతున్నప్పుడు నిందితుడికి బెయిలును ఒక హక్కుగా కోరే హక్కు లేదంటూ సీబీఐ వాదిస్తోంది. ఇది పౌరుడి హక్కులకు, దేశంలో ప్రజాస్వామ్యం పాత్రకు సంబంధించిన ప్రశ్న. నిందితుడైనా కాకున్నారాజ్యాంగం ద్వారా పౌరుడికి సంక్రమించిన హక్కు ఉండే తీరుతుంది. 

క్రిమినల్ చట్టం ప్రకారం పూర్తి స్థాయి విచారణ జరిగి, నేరం రుజువయ్యేంత వరకు ఎవరూ శిక్షార్హులు కారు. సందేహానికి తావు లేకుండా నేరం రుజువై నిందితునికి శిక్ష పడితే అప్పుడు ఆ శిక్షాకాలం వరకు అతడి హక్కులు నియంత్రించబడతాయి. చివరకు ఖైదీల హక్కులకు కూడా రాజ్యాంగం పూచీపడింది.

జగన్ కేసులో పరిస్థితులు ఇంకా ఆ దశకు చేరలేదు. ప్రస్తుతానికి ఆయన కేవలం నిందితుడు మాత్రమే. ఆయన నేరం ఇంకా రుజువు కావాలసి ఉంది.  ఈ స్థితిలో కోర్టులు రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కులను, రాజ్యాంగస్ఫూర్తిని దృష్టిలో ఉంచుకుని వ్యవహరించవలసి ఉంటుంది. ఒకవైపు ఈ కేసులో  నిందితుడు రాజకీయ నాయకుడు. మరోవైపు నిబంధనలు, సంప్రదాయాలు, పూర్వ ఉదాహరణలు, సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నాయి. కాగా ఇంకోవైపు రాజ్యాంగం పూచీ పడిన ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛలతో కూడిన ప్రజాస్వామిక స్ఫూర్తిని కలుపుకుని సాగవలసి ఉంది.

కోర్టులు ఈ కారకాంశాలన్నిటినీ సమతౌల్యం చేస్తూ ఏ అంశంతోనూ ప్రభావితం కాకుండా తమ తీర్పులు వెలువరించాలి. న్యాయ, సాంకేతిక అంశాలతో పాటు అవి నిందితుడి హక్కులను, స్వేచ్ఛలను కూడా దృష్టిలో ఉంచుకోవాలి.  విచారణ లేకుండా, చార్జిషీట్లు సైతం దాఖలు చేయకుండానే నిందితుడు జైలులో నెలలకొద్దీ కాలం మగ్గిపోవడం కూడా అంతే రాజ్యాంగవ్యతిరేకం.
- కె.రామచంద్రమూర్తి
ఎడిటర్ ఇన్ చీఫ్
(ది హన్స్ ఇండియా సౌజన్యంతో)

27-12-2012 (గురువారం) (THURSDAY THOUGHTS కాలమ్)
'Courts must see through CBI's game'
శీర్షికతో ప్రచురితమైన ఆంగ్లవ్యాసానికి తెలుగు అనువాదం

తాజా ఫోటోలు

Back to Top