జన సాగరమైన బి. కొత్తకోట

తిరుపతి:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తెలుగుదేశం ఎమ్మెల్యే ప్రవీణ్‌కుమార్‌రెడ్డి చేరిన సందర్భంగా తంబళ్ళపల్లె నియోజకవర్గంలోని బి. కొత్తకోట జనసాగరంగా మారిపోయింది.  పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం జగన్నినాదాలు మార్మోగాయి.  బహిరంగ సభకు జనం ఉప్పొంగారు. తంబళ్లపల్ల్లె నియోజకవర్గం నుంచి వేల సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. మేడలపై, చెట్లపై ఎక్కి విజయమ్మ ప్రసంగాన్ని ఆద్యంతమూ ఆసక్తిగా విన్నారు.

     బి.కొత్తకోట రహదారులన్నీ జన సాగరమయ్యాయి. తంబళ్లపల్లె ఎమ్మెల్యే ప్రవీణ్‌కుమార్‌రెడ్డి తన నియోజకవర్గ ప్రజల సమక్షంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్వహించిన బహిరంగ సభ విజయవంతమైంది. బీ కొత్తకోట వాసులు గతంలో ఎన్నడూ చూడనంత మంది జనాన్ని ఒకేసారి చూశారు.  ప్రవీణ్ ఒంటి చేత్తో సభను భారీ స్థాయిలో విజయవంతం చేసి సత్తా చాటుకున్నారు.

     తెలుగుదేశం పార్టీ నుంచి వైయస్ఆర్ కాంగ్రెస్‌లో చేరేందుకు నిర్ణయించుకున్న ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ఇందుకు ఆదివారం ముహూర్తం ఖరారు చేసుకున్నారు. నియోజకవర్గంలో పెద్దదైన బీ కొత్తకోట గ్రామాన్ని ఇందుకు వేదిక చేశారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ సమక్షంలో పార్టీలో చేరేందుకు ఆమెను ఆహ్వానించి భారీ ఎత్తున సభ నిర్వహణకు నడుం బిగించారు. వెనుకబడిన నియోజకవర్గం, రవాణా సదుపాయాలు అంతగా లేని ప్రాంతం అయినందువల్ల 30 నుంచి 40 వేల మంది జనం సభకు హాజరుకావచ్చని ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభమైన జనసంద్రం విజయమ్మ వేదిక మీదకు వచ్చే సరికి 50 వేలకు మించింది. పక్క నియోజకవర్గాల నుంచి కాకుండా తన నియోజకవర్గ ప్రజలను మాత్రమే సభకు రప్పించాలని నిర్ణయించిన ప్రవీణ్ ఇందుకోసం పది రోజులుగా నియోజకవర్గం మొత్తం సుడిగాలి పర్యటనలు చేశారు.

భారీగా స్వాగత తోరణాలు

       కొత్తకోటలో గతంలో ఎన్నడూ లేనివిధంగా స్వాగత బ్యానర్లు, ఫ్లెక్సీలతో పార్టీ నాయకురాలికి భారీ ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేశారు. నియోజకవర్గం నలుమూలల నుంచి జనం స్వచ్ఛందంగా సభకు హాజర య్యారు. శ్రీమతి విజయమ్మను చూడటానికి జనం ఎగబడ్డారు. వేదికకు సమీపంలోని జిల్లా పరిషత్తు హైస్కూల్ భవనాలపై కప్పు జనంతో నిండిపోయింది. మధ్యాహ్నం 1గంటకు సభాస్థలికి చేరుకున్న జనం 3 గంటల వరకు విజయమ్మ కోసం ఎదురు చూశారు. శ్రీమతి వైయస్ విజయమ్మ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుల మీద చేసిన విమర్శలకు జనం పెద్ద ఎత్తున స్పందించారు. చంద్రబాబు నాయుడు తన హెరిటేజ్ పాల వ్యాపారం కోసం రైతుల పాలిటి క ల్పతరువుగా వర్థిల్లిన చిత్తూరు డెయిరీ ప్రాణం తీశారని ఆమె విమర్శలు ఎక్కు పెట్టారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కారు చౌకగా తనకు కావాల్సిన వారికి ఈ ఫ్యాక్టరీ కట్టబెట్టే ఏర్పాట్లు చేస్తున్నారని రైతు సమస్యలను ఆమె ప్రస్తావించారు.   సీఎం, మాజీ సీఎం సొంత జిల్లా వాసులకే ధైర్యం కల్పించలేనప్పుడు ఇక రాష్ట్ర ప్రజలకు ఏ మాత్రం ధైర్యం ఇస్తారని శ్రీమతి విజయమ్మ సంధించిన ప్రశ్నకు జనం పెద్ద ఎత్తున స్పందించారు. టీడీపీ నేతలు చేస్తున్న ప్యాకేజీల విమర్శలను  గట్టిగానే తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. చంద్రబాబు కాంగ్రెస్ నుంచి టీడీపీకి మారినప్పుడు ఏ ప్యాకేజీ తీసుకున్నారు, వైశ్రాయ్ హోటల్‌లో ఎమ్మెల్యేలను బంధించినప్పుడు వారికి ఎన్ని ప్యాకేజీలు ఇచ్చారని నిలదీశారు. విజయమ్మ ప్రసంగానికి ఆద్యంతం సభలో కరతాళ ధ్వనులు మారుమోగాయి.

ప్యాకేజీలపై ప్రవీణ్ ప్రసంగానికి అద్భుత స్పందన

     ఎమ్మెల్యే ప్రవీణ్‌కుమార్‌రెడ్డి టీడీపీ చేస్తున్న ప్యాకేజీల ఆరోపణలను తిప్పి కొట్టిన విధానం సభకు హాజరైన వారిని ఆకట్టుకుంది. వెనుకబడిన తన నియోజకవర్గానికి హంద్రీ-నీవా ప్రాజెక్టు ద్వారా నీరివ్వాలనీ, దాహార్తితో అల్లాడుతున్న జనం సమస్యకు శాశ్వత పరిష్కారం ఇవ్వాలనే ప్యాకేజీలను తాను శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి వద్ద తీసుకున్నానని ఆయన అన్నప్పుడు జనం భారీ ఎత్తున చప్పట్లు కొట్టారు. పార్టీ అధికారంలోకి వచ్చాక తన నియోజకవర్గ రైతులను ప్రత్యేకంగా చూడాలని మరో ప్యాకేజీ తీసుకున్నానని చెప్పడం ద్వారా టీడీపీ నేతలకు ఆయన గట్టి సమాధానం ఇచ్చారు. తన తండ్రి మరణంతోనే నియోజకవర్గంలో తొలిసారి టీడీపీ జెండా ఎగిరిందని వివరిస్తూ పార్టీకి తమ కుటుంబం చేసిన సేవలను చెప్పకనే చెప్పారు. మూడు సంక్షేమ పథకాలు అమలు చేసిన ఎన్‌టీఆర్‌నే ప్రజలు దేవుడిగా కొలిచారనీ, ప్రజల కోసం లెక్కలేనన్ని పథకాలు అమలు చేసిన రాజశేఖరరెడ్డిని జనం ఇక మరచిపోగలరా అని ఆయన ప్రశ్నించినప్పుడు ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది. సభకు జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, ఎమ్మెల్యేలు కరుణాకరరెడ్డి, అమరనాథరెడ్డి, ఎమ్మెల్సీ దేశాయ్ తిప్పారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్, జెడ్‌పీ మాజీ చైర్మన్ సుబ్రమణ్యంరెడ్డి, రోజా, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, బియ్యపు మధుసూదనరెడ్డి, ఆదిమూలం, రెడ్డివారి చక్రపాణిరెడ్డి, ఉదయ్‌కుమార్, గాయత్రీదేవి, కేశవులు హాజరయ్యారు.

తాజా వీడియోలు

Back to Top