జగన్నినాదాలు.. జయజయ ధ్వానాలు

ఖమ్మం:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జలగం బలగం తోడయ్యింది. దిక్కులు పిక్కటిల్లేలా జయజయధ్వానాలు.. జగన్నినాదాలు మార్మోగాయి. మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు కుమారుడు వెంకట్రావు చేరికను పురస్కరించుకుని ఖమ్మంలో సోమవారం రాత్రి ఏర్పాటైన బహిరంగ సభ నభూతోనభవిష్యతి మాదిరిగా తోచింది. వేల సంఖ్యలో హాజరైన ప్రజలు చేసిన నినాదాలతో పరిసరాలు ప్రతిధ్వనించాయి.  ఈ సందర్భంగా జిల్లా నలుమూలల రోడ్లు జిల్లాకేంద్రానికి దారితీశాయి. వేలాదిగా తరలివచ్చిన జనసందోహంతో పుర వీధులు కిక్కిరిశాయి. సభా ప్రాంగణం పెవిలియన్‌గ్రౌండ్ ఇసుకేస్తే రాలనిరీతిలో కిటకిటలాడింది. ‘జై జగన్...జైజై జగన్, వైఎస్‌ఆర్ అమర్ హై...వెంగళరావు అమర్ హై...’ అంటూ నినాదాలు మిన్నంటుతుండగా... మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు తనయుడు, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు, ఆయన అనుచరులు, వివిధ పార్టీలకు రాజీనామా చేసిన పలువురిని విజయమ్మ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. అంతకుముందు నగర శివారు ప్రాంతాల్లో వాహనాలను నిలిపి కాల్వొడ్డు, ఇల్లెందు క్రాస్‌రోడ్డు, వైరా రోడ్డు, బైపాస్‌రోడ్ల మీదుగా సభా ప్రాంగణానికి తరలివెళ్తూ వైఎస్‌ఆర్ అభిమానులు చేసిన నినాదాలు.. ర్యాలీలు..గిరిజన సంప్రదాయ నృత్యాలు...డప్పు నృత్యాలతో ఖమ్మం ఊగిపోయింది. లక్షకు పైగా జనం రావడంతో పెవిలియన్ గ్రౌండ్ పరిసరాలు జనంతో కిక్కిరిశాయి. ఈ సభకు జిల్లా మారుమూల ప్రాంతాల నుంచి సైతం ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. మధ్యాహ్నం నుంచే అభిమానగణం ఖమ్మం పట్టణానికి చేరుకోవడంతో ఎక్కడ చూసినా వైయస్‌ఆర్ సీపీ హడావుడే కనిపించింది. బస్సులు, కార్లు, లారీలు తదితర వాహనాల్లో వైయస్ఆర్ సీపీ కార్యకర్తలు, అభిమానులు ఆపార్టీ నేతలు ఊహించనంతగా తరలివచ్చారు. తమ వాహనాలను బైపాస్ రోడ్డు, ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్, నయాబజార్ కళాశాలలో పార్కింగ్ చేసి అక్కడినుంచి నడుచుకుంటూ బహిరంగసభ జరిగే ప్రదేశానికి తరలివచ్చారు. నగరంలోని ప్రధాన రహదారులన్నీ వైయస్ఆర్ సీపీ కార్యకర్తలతో కిటకిటలాడాయి. సాయంత్రం ఆరుగంటలకు బహిరంగ సభ ప్రదేశం జనంతో కిక్కిరిసి పోవడంతో సభ లోపలికి వెళ్లలేని ప్రజలతో మయూరిసెంటర్, భక్తరామదాసు కళాక్షేత్రం, పరిసరప్రాంతాలు నిండిపోయాయి. బహిరంగసభకు పార్టీ కేంద్రకమిటీ సభ్యులతోపాటు రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు హాజరయ్యారు. ఈ సభలో నాయకుల ప్రసంగాలు కార్యకర్తలో ఉత్సాహాన్ని నింపాయి. జగన్‌ను సీఎం చేయాలంటూ నినాదాలు చేశారు.

విజయమ్మ ప్రసంగానికి విశేష స్పందన..

     సుమారు అర్ధగంట పాటు విజయమ్మ ఉత్తేజ భరితంగా ప్రసంగించారు. ఆమె ప్రసంగానికి జనం నుంచి విశేష స్పందన లభించింది. ఆమె చంద్రబాబుపై నిప్పుల చెరుగుతున్న సమయంలో ‘జై జగన్ ’ నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగింది. ఆమె ప్రసంగిస్తున్నంత సేపు ఆకాశంలో మిరిమిట్లు గొల్పేలా సభా ప్రాంగణం వెనుకభాగంలో బాణాసంచా పేల్చారు. యువకులు ఒక్కసారిగా విజయమ్మను చూసేందుకు సభా వేదిక వద్దకు దూసుకొచ్చారు. దీంతో ఆమె రెండు సార్లు స్టేజిపై కలియ తిరుగుతూ అభివాదం చేశారు. మయూరి సెంటర్, వైరారోడ్డు, ఇల్లెందు క్రాస్‌రోడ్డు, కాల్వొడ్డు, బస్టాండ్ సెంటర్లు జనప్రవాహంలా మారాయి. నల్లగొండ జిల్లా కోదాడ, సూర్యాపేట, వరంగల్ జిల్లా మహబూబాబాద్, నర్సంపేట, కృష్ణా జిల్లా తిరువూరు, నూజివీడు నుంచి జగన్ అభిమానులు బహిరంగసభకు తరలివచ్చారు.

ఘనస్వాగతం

     హైదరాబాద్ నుంచి జిల్లా సరిహద్దు నాయకన్‌గూడెం వద్ద విజయమ్మకు కూసుమంచి మండల పార్టీ నాయకులు, లంబాడి మహిళలు సంప్రదాయ నృత్యంతో స్వాగతం పలికారు. ఆతర్వాత ఖమ్మం ఆర్‌అండ్‌బీ అతిథి గృహానికి చేరుకున్న విజయమ్మను జిల్లా నేతలు ఆహ్వానించారు. ఆరు గంటలకు విజయమ్మను జలగం వెంకట్రావుతో పాటు పార్టీ నాయకులు వేదికపైకి స్వాగతం పలికారు.

20 వేల కుటుంబాలు చేరిక..


     గతంలో ఏపార్టీలో చేరినవిధంగా జిల్లా రాజకీయ చరిత్రలోనే 20 వేల కుటుంబాలు విజయమ్మ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు జలగం వెంకట్రావు ప్రకటించారు. జిల్లాలోని పది నియోజకవర్గాల నుంచి వేలాది కుటుంబాలు విజయమ్మ సమక్షంలో పార్టీలో చేరాయన్నారు. మహానేత వైఎస్ సతీమణిని చూడడానికి మహిళలు సైతం వేలాది మంది తరలివచ్చారు. వైఎస్సార్ సీపీలో చేరిన వారిలో పలు పార్టీలకు చెందిన మాజీ జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు,ఇతర పార్టీలకు చెందిన ముఖ్యనాయకులున్నారు.

Back to Top