హలో... ఇది హనుమన్న 'మథనం


మేధో మథనం... ఇబ్బందుల్లో ఉన్న ప్రతి సంస్థా తరచూ వాడే పదమిది. అదిప్పుడు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు నోట్లో పడింది. దానికి ఇటీవలే రాజ్యసభ సభ్యత్వాన్ని సంపాదించుకున్న చిరంజీవి వంత పాడారు. అవును మేధో మధనం జరగాల్సిందేనన్నారు. పనిలో పనిగా తన వైయస్ఆర్ కాంగ్రెస్‌పై తన దుగ్ధా తీర్చుకున్నారు.

హైదరాబాద్‌లోని జూబ్లీ హాలులో సెప్టెంబరు 8వ తేదీన 'సేవ్ కాంగ్రెస్' పేరుతో హనుమన్న ఓ సదస్సు ఏర్పాటు చేశారు. దానికి మాజీ మంత్రులు వసంత నాగేశ్వరరావు, చిన్నారెడ్డి, హాజరయ్యారు. అప్పటిదాకా చప్పగా ఉందనుకున్న సదస్సు ఓ అతిథి రాకతో జోరందుకుంది. మెగాస్టార్‌గా మన్ననలందుకున్న కొణిదల శివశంకర వరప్రసాద్ ఉరఫ్ చిరంజీవే ఆ అతిథి. ఆయన వస్తూనే వీహ్‌చ్‌పై ప్రశంసలందుకున్నారు. మేధోమథనాలు సాగాల్సిందేనన్నారు.  పనిలో పనిగా అన్యాపదేశంగా మహానేత డాక్టర్ వైయస్ఆర్ పైనా, ఆయన కుమారుడు జగన్‌మోహన్ రెడ్డిపైనా విమర్శలు కురిపించారు.
కాంగ్రెస్ మరో రాజ్యసభ సభ్యుడు కె.వి.పి. రామచంద్రరావు సెప్టెంబరు ఏడో తేదీ రాత్రి ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఆవిష్కరింపజేసిన 'ప్రజాప్రస్థానం' పుస్తక కార్యక్రమంలోనూ చిరంజీవి కాలు పెట్టారు. సోనియా గాంధీ పంపిన సందేశాన్ని టి. సుబ్బిరామిరెడ్డి చదువుతుంటే ఆయన ముఖ కవళికలు మారిపోవడాన్ని పలువురు గమనించారు. అదే రోజు ఎల్లో మీడియా అండతో పీటీఐ వండి వార్చిన కాంగ్రెస్ పార్టీతో వైయస్ఆర్ కాంగ్రెస్ విలీనం వార్త కూడా ఆయనకు చెమటలు పట్టించింది. ఎందుకో అభద్రతా భావానికి గురయ్యారు. అంతే విమర్శలందుకున్నారు.
మేధో మథనం అంటే మంచి చెడులను విశ్లేషించుకుంటూ పార్టీ పురోభివృద్ధికి ఏం చేయాలనేది నిర్ణయించుకోవాలి.. దీనిని పక్కన పెట్టి ప్రతి ఒక్కరూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై అవాకులూ చవాకులూ పేలారు. అందరూ నోరు పారేసుకున్నవారే. కాంగ్రెస్ పార్టీని కాపాడేందుకంటూ పెట్టిన సదస్సును తమను కాపాడుకోవడానికి వినియోగించుకున్నవారే. కేవీపీ నిర్వహించిన పుస్తకావిష్కరణలో పాల్గొన్న చిరంజీవిని (అలియన్) గ్రహాంతర జీవిగా కొన్ని పత్రికలు అభివర్ణించాయి. పైపైచ్చు ఆ కార్యక్రమంలో ఆయనకు నోరు విప్పే అవకాశం దక్కలేదు.
అసలు ఇలాంటి సదస్సు నిర్వహించేందుకు వీహెచ్‌కు ఉన్న అర్హతేంటి అని ప్రశ్నించిన వారూ లేకపోలేదు. వీలు చిక్కినప్పుడల్లా ఉన్నంత కాలం డాక్టర్ వైయస్ఆర్‌పై నోరుపారేసుకున్న ఆయన ఇప్పుడూ ఆగట్లేదు. పైగా విమర్శల దాడిని వైయస్ జగన్‌మోహన్ రెడ్డిపై మొదలుపెట్టారు. పదవి కోసం సమయానుకూలంగా ప్లేటు ఫిరాయించే హనుమన్న మేధోమథనం ఆ నలుగురికే పరిమితమై అభాసుపాలైంది.

Back to Top