కర్నూలు : వైయస్ జగన్ మోహన్ రెడ్డిని గెలిపిస్తే రైతులకు ఏం కావాలో అది చేస్తారని కర్నూలు జిల్లా రైతు పేర్కొన్నారు. కర్నూలు జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రైతులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో అతిపెద్ద మార్కెట్ అయిన ఆదోని పత్తి మార్కెట్ యార్డులో రైతులతో పవన్ ముఖాముఖి నిర్వహించారు. రైతుల కష్టాలు ఏంటో చెబితే విందామని.. ఓ రైతును ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని పవన్ మైక్ ఇచ్చారు. అనంతరం అక్కడున్న వారందరిని ఉద్దేశించి పవన్ మాట్లాడారు. 'ఒక్క నిమిషం. మీ అందరికి నా హృదయ పూర్వక నమస్కారాలు. నేను ఇక్కడికి వచ్చింది మన రైతుల సమస్యలు వినడానికి. మీ భవిష్యత్తు కోసమే. రైతనేవాడే లేకపోతే, మన భవిష్యత్తు ఉండదు. ఒక్కసారి మీకోసమే వచ్చాను కాబట్టి రైతుల కష్టాలను విందాం' అని రైతును మాట్లాడమన్నారు. 'కోతకు సిద్దంగా ఉన్న పత్తిపంట వర్షం రావడంతో నానిపోయింది. పశువులు కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. పశువులు లేనది ప్రపంచం లేదు. ఏ ఉద్యోగస్తులు లేరు' అని రైతు తన బాధలు చెప్పుకున్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ భజం పై చేయి వేసి మరీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డినిగనుక గెలిపిస్తే.. మీరు, నేను ఆయన్ని బతిమిలాడైనా రైతులకు ఏం కావాలో అవి ఇప్పిస్తా అని ధీమాగా చెప్పారు. ఆయన మాటలకు ఆ సభకు వచ్చిన వారందరూ హర్షధ్వానాలు చేయగా, రైతు నోటివెంట వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేరు రాగానే పక్కనే ఉన్న నాదెండ్ల మనోహర్ తొత్తురపాటుకు గురయ్యారు. మీరు దయ చేసి జగన్ మోహన్ రెడ్డిని గెలిపించాలని రైతు అక్కడున్న వారిని కోరగా, పక్కనే ఉన్న పవన్ కళ్యాణ్ మొహం చిన్నబోయింది. రైతు మాట్లాడటం ఆపకపోవడంతో .. ఇక చేసేదేమీ లేక మైకు తీసుకుని .. పక్కనే ఉన్న నాదేండ్ల మనోహర్‌కు ఇచ్చారు. అప్పటికీ రైతు మాట్లాడుతూ ఉండటంతో చేసేదేమీ లేక ఇంకా ఎవరైనా మాట్లాడతారా అంటూ పవన్ ఇతరులను కోరారు.