పచ్చ కాంట్రాక్టర్లకే `ఉపాధి`

– ఎస్‌డీఎఫ్‌ పేరుతో కూలీల పొట్ట కొడుతున్న ప్రభుత్వం 
– భారీ యంత్రాలు, కాంక్రీట్‌ పనులు చేయిస్తున్న వైనం 
– రెండున్నరేళ్లలో 187 జీవోలు.. రూ.500 కోట్లు పక్కదారి
– పక్క రాష్ట్రాలకు కూలీల వలసల వెనుక కారణం ఇదే..
అమ‌రావ‌తి: స్థానికంగా పనులు దొరక్క పక్కా రాష్ట్రాలకు వలసలు పెరిగిపోయాయి. కూలీలతో చేయించాల్సిన ఉపాధి హామీ పనులు నిబంధనలకు విరుద్దంగా యంత్రాలతో చేయిస్తూ కూలీల పొట్టగొడుతున్నారు. ప్రభుత్వం తమకు అనుకూలంగా జీవోలు జారీ చేసుకుని రైతుల జీవితాలతో ఆటలాడుకుంటోంది.    వ్యవసాయ కూలీలకు కనీస పనిదినాల కల్పనకు తెచ్చిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్ఫూర్తికి రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు తూట్లు పొడుస్తోంది. ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్‌డిఎఫ్‌) పేరిట ఉపాధి హామీ పథకానికి గండి కొడుతోంది. ఉపాధి హామీ, ఎస్‌డిఎఫ్‌ రెండూ కలగలపి చేస్తున్న పనుల్లో కూలీల ఉపాధి ఆవిరవుతోంది. ఉపాధి హామీ నిబంధనలకు పూర్తి విరుద్ధంగా, అడ్డగోలుగా ఎస్‌డిఎఫ్, ఉపాధి హామీ మ్యాచింగ్‌ పనులు జరుగుతున్నాయి. పొక్లయిన్లు, జెసీబీల వంటి భారీ యంత్రాలను యధేచ్ఛగా ఉపయోగిస్తున్నారు. కాంక్రీట్‌ పనులకు అధిక నిధులు వెచ్చిస్తున్నారు. ’ఉపాధి’ మార్గదర్శకాలను తుంగలోతొక్కి మెటీరియల్‌ కాంపొనెంట్‌కు, యంత్రాలకు ఎక్కువ ఖర్చు చేసి గ్రామీణ కార్మికుల పొట్ట కొడుతున్నారు. టీడీపీ సర్కారు వచ్చిన ఈ రెండున్నరేళ్లలో ఫిఫ్టీ ఫిఫ్టీ నిష్పత్తిలో ఎస్‌డిఎఫ్‌తో సుమారు రూ.500 కోట్ల ఉపాధి హామీ నిధులు లింక్‌ చేసి, లక్షలాది పని దినాలను ఎగ్గొట్టారు. 

ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నిధులివ్వరు ..
గతంలో ఎమ్మెల్యేలకు అసెంబ్లీ నియోజకవర్గ అభివద్ధి కార్యక్రమం (ఎసిడిపి) ఉండేది. మండలి వచ్చాక ఎమ్మెల్సీలకూ వర్తింపజేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నేరుగా పనులు ఇవ్వకూడదన్న ఉద్దేశంతో రాష్ట్ర విభజన తర్వాత టిడిపి సర్కారు ఈ పథకాన్ని ఎత్తేసింది. దానికి బదులుగా ఎస్‌డిఎఫ్‌ను అమలు చేస్తోంది. అధికారపార్టీ ఎమ్మెల్యేలు ఇచ్చిన ప్రతిపాదనలను ఓకే చేస్తోంది. ప్రతిపక్ష పార్టీ ఉన్న చోట టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి లేక ఏదేని పార్టీ నాయకుని ప్రతిపాదనలపై పనులు మంజూరు చేస్తోంది. ఎసిడిపి పార్టీలకు అతీతం కాగా, తమ వారికి మాత్రమే పనులు కట్టబెట్టే పతకం ఎస్‌డిఎఫ్‌. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల హక్కులకు, ప్రొటోకాల్‌కు ఎస్‌డిఎఫ్‌ భంగకరమని ఆందోళనలు చేసినా సర్కారు తన వక్ర మార్గాన్ని మానుకోలేదు. ఇదిలా ఉండగా ఎస్‌డిఎఫ్‌ పనులను సైతం నేరుగా మంజూరు చేయట్లేదు. ఉపాధి హామీ నిధులను మ్యాచ్‌ చేస్తోంది. దీంతో కూలీలకు పనులు కల్పించాల్సిన ’ఉపాధి’ నిధులు పక్కదారి పడుతున్నాయి.

యంత్రాలతో ఉపాధి పనులా..?
ఎస్‌డిఎఫ్, ఉపాధి హామీ రెండింటికీ జిల్లాలో పనులు మంజూరు చేసే అధికారం కలెక్టర్‌కే ఇచ్చారు. ఉపాధి హామీ పనులను గైడ్‌లైన్స్‌ ప్రకారం గ్రామ పంచాయతీ సర్పంచ్‌ ఆధ్వర్యంలో జరగాలి. ఖచ్చితంగా కూలీల ఉపాధి కల్పనకు అంచనా వ్యయంలో 60 శాతానికి ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గడానికి వీల్లేదు. కేవలం 40 శాతం లోపు మెటీరియల్‌ కాంపొనెంట్‌కు కేటాయించాలి. ఎస్‌డిఎఫ్‌కు మ్యాచ్‌ చేసిన పనుల్లో ఈ నిబంధనలు అసలుకే అమలు కావట్లేదు. కేవలం అంచనాల్లోనే ఉపాధి కాంపొనెంట్‌ను చూపుతున్నారు. యంత్రాలు, కాంక్రీట్‌ వర్క్స్‌కు 80 నుంచి 90 శాతం ఖర్చు చేస్తున్నారు. సరైన అంచనాలు, సోషల్‌ ఆడిట్, కలెక్టర్‌ ఆధ్వర్యంలోని కమిటీతో ఐదు శాతం రాండమ్‌ చెకింగ్‌ ఇవేమీ లేకుండానే ’ఉపాధి’ నిధులను ఖర్చు చేస్తున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. అదేంటంటే ఎస్‌డిఎఫ్‌ నిధులను యంత్రాలకు, సీసీ పనులకు కేటాయిస్తున్నామంటూ కాంట్రాక్టర్లు, అధికారులు కూడబలుక్కొని కూలీలకు అన్యాయం చేస్తున్నారు. ఎస్‌డిఎఫ్‌ ఎమ్మెల్యేల ఇష్టం కాబట్టి అధికారపార్టీ నేతలు కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి దాంతో కలిసి ఉన్న ’ఉపాధి’ నిధులను సైతం స్వాహా చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎస్‌డీఎఫ్, ఉపాధి హామీ మ్యాచింగ్‌ పనులపై 187 జీవోలు జారీ అయ్యాయి. సుమారు రూ.400–500 కోట్లు ఎస్‌డీఎఫ్‌ ఇస్తే దానికి అంతే మొత్తంలో ఉపాధి హామీ నిధులు జత చేశారు. అవన్నీ పచ్చ కాంట్రాక్టర్ల జేబుల్లోకి చేరినవే.
Back to Top