ఏదిమార్పు, ఏదికూర్పు?

కాంగ్రెస్ అధిష్టానం ముందు సమాధానం లేని ప్రశ్నలేవయినా ప్రత్యక్షం కావడం పాపం- తక్షణమే రాష్ట్ర నాయకత్వంలో మార్పు క్రమం మొదలయిపోతుంది.దేశంలోని అత్యంత పురాతనమయిన రాజకీయ పక్షం కాంగ్రెస్ పార్టీ. పోలిట్రిక్స్‌లో ఆ పార్టీ కూడబెట్టుకున్న 127 సంవత్సరాల అనుభవం ప్రాతిపదికగా కాంగ్రెస్ అధిష్టానం చేసే పనుల్లోని ఆంతర్యం కనిపెట్టడం ఆ సర్వాంతర్యామికయినా సాధ్యమేనా అనిపిస్తుంది. ఒకవైపు కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న యూపీయే కూటమి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. మన రాష్ట్రం, మహారాష్ట్ర, బంగాల్, తమిళనాడు, బిహార్, కర్ణాటక తదితర ప్రాంతాల్లో కొత్త కొత్త రాజకీయ శక్తుల పొందికలు ఊహాతీతంగా సాగిపోతున్నాయి. రోజుకో కుంభకోణం -రికార్డ్ బ్రేక్ చేస్తూ- రచ్చకెక్కుతోంది. దానికి తోడు సామాజిక సేవ, ఆధ్యాత్మిక రంగాల కు చెందిన ప్రముఖులు ఒకరి తర్వాత ఒకరు రాజకీయ నినాదాలతో రంగంలోకి దిగుతున్నారు.
ఇక, ‘యువరాజు’ రాహుల్ గాంధీని ప్రధాని గద్దె మీద తక్షణమే చూడాలని ఓ మాతృహృదయం పెరపెరలాడుతోంది. వీటిల్లో ఏ కారణం చేతనయితేనేం, గడువు కన్నా ముందే పార్లమెంటుకూ, మన రాష్ట్రంతో సహా మరెన్నో రాష్ట్రాల్లోని విధాన సభలకూ ఎన్నికలు జరిగే సూచనలున్నాయని పరిశీలకులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవిలో కూర్చుని, చెప్పిందల్లా తూచా తప్పకుండా చేస్తున్న ఓ తోలుబొమ్మ నాయకుణ్ణి పదభ్రష్టుణ్ణి చెయ్యడం గురించి కాంగ్రెస్ అధిష్టానం గుంపుచింపులు పడుతోందన్న వార్త ఆశ్చర్యాన్ని కలిగించడంలో వింతేముంది?
మన ఆశ్చర్యంతోనూ, దిగ్భ్రమ-విభ్రమలతోనూ కాంగ్రెస్ అధిష్టానానికి నిమిత్తం లేదు. అందుకే, అది తన వ్యూహంలో తాను ముందుకు సా....గుతోంది. ఇక్కడ గమనంలో పెట్టుకోవలసిన విషయం ఒకటుంది. కాంగ్రెస్ అధిష్టానం భాషలో ‘అదిగో’ అంటే ఆరు నెలలు! అంచేత, ఈ కథ రాత్రికి రాత్రే వంద మలుపులూ, మెలికలూ తిరిగిపోతుందనుకోలేం. ఈ పరిణామాలను ఫాస్ట్ ఫార్వర్డ్ చెయ్యడం ఎవ్వరి తరమూ కాదు. తెలంగాణ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ప్రవర్తించిన తీరుతెన్నులు గమనించినవారికి ఈ విషయం ప్రత్యేకంగా మనవి చెయ్యవలసిన అవసరం లేదు. కాంగ్రెస్ అధిష్టానం ముందు సమాధానం లేని ప్రశ్నలేవయినా ప్రత్యక్షం కావడం పాపం- తక్షణమే రాష్ట్ర నాయకత్వంలో మార్పు క్రమం మొదలయిపోతుంది.
తెలంగాణ సమస్యకు తోడుగా ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రాణానికి 26 జీవోల కేసు ఒకటొచ్చి పడింది. తనపై విచారణ మొదలయినప్పుడే వైఎస్‌ఆర్సీపీ అధినేత- కడప ఎంపీ- జగన్మోహన్ రెడ్డి ఈ పరిణామం గురించి చెప్పనే చెప్పారు. ‘అయ్యా, సీబీఐ వారు అభ్యంతరం లేవనెత్తిన జీవోలతో నాకే సంబంధమూ లేదు- సరిగదా, వాటితో సంబంధమున్న మంత్రులు ఇప్పటికీ తమ క్యాబినెట్‌లో కొనసాగుతున్నారు స్వామీ- ఈ పాము తిరిగి తిరిగి వచ్చి పడేది మీ మెళ్లోనేనయ్యా’ అని జగన్ ఆనాడే హెచ్చరించారు. ఆయన చెప్పినట్లే అక్షరాలా జరగడం గమనార్హం.
ముందుగా మోపిదేవి, తర్వాత ధర్మాన ఈ వ్యవహారంలో ఇరుక్కున్నారు. ముందుముందు మరో నలుగరయిదుగురు మంత్రులు ఈ సర్పయాగంలో సమిధలు కానున్నారని అంటున్నారు. అటు అధిష్టానం- ఇటు ముఖ్యమంత్రీ కూడబలుక్కునే తమను బలిపశువులుగా మారుస్తున్నారని ఈ మంత్రులూ, మాజీలూ మొత్తుకుంటున్నారు. ‘ఈ విషయంలో నేను అసహాయుణ్ని!’ అనేసి చేతులు దులిపేసుకుందామని కిరణ్ కుమార్ చేసిన ప్రయత్నం పెద్దగా ఫలించలేదు. ఆమాటకొస్తే, మన తోలుబొమ్మ -కాదంటే కీలుబొమ్మ- ముఖ్యమంత్రి ఈ ఒక్క విషయంలోనే కాదు, ప్రతి విషయంలోనూ నిస్సహాయుడే! ఆ సంగతి ఆయన మీద విరుచుకు పడుతున్న వారికీ తెలుసు. అయితే, నాయకత్వం శిలువ బుజాన మోసేందుకు సిద్ధపడిన వ్యక్తికి కొన్ని రాళ్లు తగులుతూనే ఉంటాయి- తప్పదు మరి! అదంతా ఓ ప్యాకేజీలో భాగం!
ఈ మొత్తం పరిణామం పరిశీలిస్తే ఒక గమ్మత్తయిన విషయం కనిపిస్తుంది. ఈ కేసుల తేనెతుట్టెని కదిపింది కాంగ్రెస్ అధిష్టానమే. తన కర్ర పెత్తనాన్ని ఖాతరు చెయ్యక, స్వతంత్ర వ్యక్తిత్వం ప్రదర్శించిన ‘నేరానికి’ వైఎస్ జగన్‌ను వేధించడానికే ఈ కేసులను రంగం మీదకు తీసుకొచ్చింది అధిష్టానం. ఒక అంకం తర్వాత మరొకటిగా ఈ నాటకం కొనసాగుతోంది. ఫస్్టహాఫ్ అయిపోయింది. ఇంటర్వెల్ లాక్ అవసరం వచ్చి పడింది. మోపిదేవి- ధర్మానలను ప్రవేశపెట్టారు సూత్రధారులు. ఇకపై కథ మరెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.‘తక్షణంలో జీవించు!’ అని మహానుభావులయిన తాత్వికులు చెప్పిన విషయం కాంగ్రెస్ అధినేత్రికి తెలుసో లేదో గానీ ఆమె చేసేపని అదే! ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాటకం ఓ మూలమలుపు తిరిగే దశకు చేరుకుంది. ఇంతవరకూ కథ నడిపించడానికి పనికొచ్చిన పాత్రలు ఇకపై అనవసరం. వాటిని నిర్దాక్షిణ్యంగా పక్కన పడేయాలి. కిరణ్ కుమార్ రెడ్డి అలాంటి ఓ ఖాళీ పాత్ర! దాన్ని తప్పించకపోతే, -‘ఓటికుండకు మోతెక్కువ’ అన్న సామెత చందంగా- తలనెప్పి కలిగించగలదు. అంచేత, అటు తెలంగాణ, ఇటు 26 జీవోల కేసులు- మరో వైపు మరేదో అసంతృప్తీ వీటన్నిటికీ ఒకే జవాబుగా సీఎంను తప్పించాలనే కాంగ్రెస్ అధిష్టానం అనుకుని ఉండొచ్చు! ఆ పార్టీలో తోలుబొమ్మలకు కరువా? జుట్టుపోలిని తప్పిస్తే బంగారక్కను తెరమీదకు ఎక్కించవచ్చు! అది వారికి ఎంతలో పని? ఎటొచ్చీ కష్టపడి ఈ మార్పు(?)కూర్పులను లోతుగా విశ్లేషించడానికి పూనుకునే మనలాంటి అమాయకులకే అనవసరమయిన ఆయాసం!!

 
Back to Top