<strong>జులై నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే దుకాణాలు</strong><strong>వేలంపాట... లెసైన్సులు.. లాటరీలు బంద్...</strong><strong>అభివృద్ధి పనులు ప్రయివేటుకు... మద్యం వ్యాపారం ప్రభుత్వానికా..?</strong>ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రభుత్వ రంగమంటే పరమ చిరాకు. అందుకే ఆయన అన్నిటినీ ప్రైవేటీకరించడానికే మొగ్గు చూపుతారు. నష్టాల సాకు చూపి ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయించేస్తుంటారు. అభివృద్ధి పనులన్నిటినీ ప్రభుత్వ-ప్రయివేటు భాగస్వామ్యంలో చేయడానికి మాత్రమే ఇష్టపడతారు. గత తొమ్మిదేళ్ల హయాంలోనే కాదు తాజా పదినెలల పాలనలోనూ ఆయన దీనిని అనేకమార్లు రుజువు చేసుకున్నారు. ఇపుడు రాజధాని అభివృద్ధి పనులు మొదలు సాగునీరు, రహదారులు, ఉన్నత, సాంకేతిక విద్య, వైద్య రంగాలలోని అనేక పనులను ప్రభుత్వ ప్రయివేటు భాగస్వామ్యంతోనే ప్రభుత్వం చేపడుతోంది. కొన్ని పనులనైతే పూర్తిగా ప్రయివేటుపరం చేయాలని నిర్ణయించింది కూడా.అయితే ఒకే ఒక్కటి మాత్రం ఇందుకు మినహాయింపు. అదేమిటంటే లిక్కర్ వ్యాపారం. మద్యాన్ని చంద్రబాబు ప్రధాన ఆదాయవనరుగా చూస్తారు. అందుకే ఆయన పగ్గాలు చేపట్టిన వెంటనే 1995లో మద్యనిషేధానికి తూట్లుపొడిచారు. ఊరూరా బెల్టు షాపులు విచ్చలవిడిగా పెరగడం బాబుగారి పుణ్యమే. పదేళ్ల విరామం తర్వాత పీఠం ఎక్కిన చంద్రబాబు ఇపుడు కూడా మద్యంవ్యాపారంపై కన్నేశారు. ఇప్పటివరకు ప్రయివేటు రంగంలో ఉన్న మద్యం వ్యాపారాన్ని ఇకపై రాష్ర్టప్రభుత్వమే చేపట్టాలని తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయించింది. వేలంపాట, లాటరీలు వంటి వన్నీ ఇక నుంచి బంద్. ఈ విధానం జూన్ వరకు మాత్రమే అమల్లో ఉంటుంది. జులై నుంచి బాబుగారి సర్కారే మద్యం నేరుగా విక్రయిస్తుంది. మద్యం వ్యాపారంలోకి ప్రభుత్వం రావడం ఎందుకంటే... ముడుపుల రూపంలో భారీగా ఆదాయం సమకూరుతుందట. ప్రభుత్వానికే కాదు ప్రభుత్వ పెద్దలకు కూడా ఈ ముడుపులు ఇబ్బడిముబ్బడిగా అందుతాయనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వ పెద్దలకు బాగా ముడుపులు ముట్టచెప్పిన సంస్థలకు చెందిన మద్యం బ్రాండ్లనే ప్రభుత్వ మద్యం దుకాణాల్లో విక్రయిస్తారు. ఏదైనా సంస్థ ప్రభుత్వంతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకోకపోతే ఆ సంస్థకు చెందిన బ్రాండ్లకు ప్రభుత్వ మద్యం దుకాణాల్లో చోటుండదు. ఆ బ్రాండ్లు స్టాకు లేదని చెబుతారు. తమిళనాడులో నడుస్తున్న మద్యం విధానమిదే. బాబు సర్కారు కూడా తమిళనాడును ఆదర్శంగా తీసుకోనున్నదని సమాచారం. ప్రభుత్వానికే కాక ప్రభుత్వ పెద్దలకు కూడా ఆదాయం సమకూర్చే విధానం కనుకనే ప్రభుత్వం మద్యం వ్యాపారం చేయడం వల్ల వచ్చే విమర్శలను సైతం లెక్క చేయకుండా ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. జులై నుంచి కొత్త మద్యం విధానాన్ని రాష్ర్టంలో అమలు చేయాలని ప్రభుత్వం తలపోస్తోంది. ప్రభుత్వమే మద్యం వ్యాపారంలోకి దిగుతోందంటే ఇక బెల్టు షాపులకు అడ్డే ఉండదు. రాష్ర్టంలో ప్రస్తుతం 4,380 మద్యం దుకాణాలున్నాయి. ఈ దుకాణాలను ఇక ప్రభుత్వమే నిర్వహిస్తుంది. దుకాణానికి ముగ్గురు చొప్పున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను మద్యం విక్రయాల కోసం నియమించనున్నారు. అంటే దాదాపు 12 వేలమంది కార్యకర్తలకు ఉపాథి కల్పిస్తారన్నమాట. <strong>బాబు చెప్పిందేమిటి... చేస్తున్నదేమిటి...?</strong>‘‘ప్రతి జిల్లాలో డీ అడిక్షన్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం... బెల్టు షాపులు లేకుండా చేస్తాం.. ’’ - ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలివి.. ...కానీ ఇపుడు జరుగుతున్నదేమిటంటే... విచ్చలవిడిగా బెల్టుషాపులు నడుస్తున్నాయి. కొత్తగా పర్మిట్ రూమ్‌లలో మద్యం ఏరులై పారుతోంది. వీటన్నిటికి తోడు చంద్రబాబు సర్కారు నేరుగా మద్యం వ్యాపారంలోకి దిగుతోంది.