ప్రభుత్వానికి ప్రజాసమస్యలపై ..చర్చించే చిత్తశుద్ధి, ధైర్యం లేదుస్టేట్ మెంట్ పేరుతో..సభను పక్కదారి పట్టిస్తున్నారుబాబు ఇన్ని విమానాలు వేసుకొని తిరుగుతున్నావ్రాష్ట్రానికి ఒక్క పరిశ్రమైనా తీసుకొచ్చావా..?
హైదరాబాద్ః అసెంబ్లీలో అధికారపార్టీ నేతలు సొంత డబ్బా కొట్టుకుంటూ ...ప్రజాసమస్యలు చర్చకు రాకుండా సభను తప్పుదోవ పట్టిస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. ఏ ఒక్క అంశంపైనా చర్చించే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదని విమర్శించారు. ప్రజాసమస్యలపైన గానీ, బిజినెస్ ప్రకారం గానీ చర్చకు రాకుండా, ఏదో రకంగా సభను పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ఫైరయ్యారు. ప్రభుత్వ అవినీతిని లేవదీస్తామనే చర్చ జరగకుండా అడ్డుకుంటున్నారని శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
శ్రీకాంత్ రెడ్డి ఏమన్నారంటే.....వెల్ ఫేర్, మైనారిటీలు సహా అనేక డిమాండ్ లపై సభలో చర్చించాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి సభలో ఉండరు. చివరగా వచ్చి స్టేట్ మెంట్ అని ఓ10 నిమిషాలు అప్పటికప్పుడు తన గొప్పలు చెప్పుకుంటారు. స్టేట్ మెంట్ చదవకుండా గొప్పలు చెప్పుకోవడం దురదృష్టకరం. స్టేట్ మెంట్ అన్నది ముఖ్యమైన విషయంలో అప్పటికప్పుడు మొత్తం సెషన్ పై ఒక్కసారే చేస్తారు. ప్రతిరోజు స్టేట్ మెంట్ రూపాన చర్చను పక్కదారి పట్టించడం దౌర్భాగ్యం.
చంద్రబాబు తీరు ఎలా ఉంటుందంటే...నావల్లే సెల్ ఫోన్ లు పెట్టుకున్నారంటాడు. ట్రెండ్ సెక్టార్ అంటాడు. ఐటీని ప్రోత్సహించానని చెప్పుకునే చంద్రబాబు రాష్ట్రానికి ఒక్క ఐటీ సంస్థనైనా తీసుకొచ్చారో తనకు తాను ప్రశ్నించుకోవాలి. హైదరాబాద్ నేనే అభివృద్ధి చేశానంటాడు. అలా చెప్పుకునే వ్యక్తి ఏపీలో ఎందుకు చేయడంలేదు. హైదరాబాద్ కు బాబు చేసిందేమీ లేదు. అప్పుడున్న పరిస్థితుల్లో ప్రపంచంవ్యాప్తంగా ఐటీ బూమ్ ఉండడం వల్ల హైదరాబాద్ కు ఆగుర్తింపు వచ్చింది. బాబు ఇన్ని మార్కెటింగ్ లు చేస్తున్నావ్, స్పెషల్ విమానాలు వేసుకొని తిరుగుతున్నావ్. రాష్ట్రానికి ఒక్క పరిశ్రమైనా తీసుకొచ్చావా అని శ్రీకాంత్ రెడ్డి నిప్పులు చెరిగారు.
తెలంగాణలో మైక్రోసాఫ్ట్, గూగుల్ సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయి. పెద్ద పెద్ద సంస్థలు వస్తున్నాయి. దానికి కూడా అప్పుడు నేను చేశాను కాబట్టి ఇప్పుడు వస్తున్నాయని బాబు తనకు తాను పొగుడుకుంటున్నాడని శ్రీకాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. బాబు ఏదీ చిత్తశుద్ధితో చేయడని శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. ఆరోజు ఎన్నికల్లో ఓడిపోతే ఓటింగ్ మిషన్ దే తప్పు అన్నాడు. ఇప్పుడు గెలిచినాక సైలెంట్ అయ్యారు. మహారాష్ట్రలో దొంగతనం చేసి జైలుకు పోయిన ప్రసాద్ అనే వ్యక్తిని ...సంఘసేవ చేసి జైలుకు పోయాడని చెప్పుకునే స్థాయికి అధికారపార్టీ నేతలు దిగజారారంటే ఎంత ఘోరమే అర్థం చేసుకోవాలి. అలాంటి వ్యక్తికి 350 కోట్ల టెండర్లు కట్టబెట్టి, సీతారామయ్యను టెండర్ కు సంబంధించి కమిటీలో పెట్టి వందల కోట్లు దోచేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు.
ప్రభుత్వ అవినీతిని ఎత్తిచూపితే చిన్న ఆధారాలు చూపమంటారు. స్పష్టమైన ఆధారాలు చూపాం. రాజధాని భూకుంభకోణంలో వాళ్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్న డాక్యుమెంట్స్ తో సహా చూపించాం. అది ఆధారం కాదంటారు. వెబ్ సైట్ ను మూసేస్తారు. ఈరకంగా అవినీతికి పాల్పడుతూ దాన్ని కవర్ చేసుకోవడానికి తమపై ఎదురుదాడి చేస్తున్నారు. విలేకరులపై కేసులు పెట్టి, బెదిరిస్తున్నారు.ఇలా చేసుకుంటూ పోతే ప్రజాస్వామ్యం అంటారా అని శ్రీకాంత్ రెడ్డి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిణామాలు జరగలేదని, ప్రజాసమస్యలపై ప్రతిపక్షం చెబుతుంటే వినేపరిస్థితి వచ్చేది గానీ, ఈరకంగా స్టేట్ మెంట్ అని ఇచ్చి అసెంబ్లీ మొత్తం సమావేశాలను బుల్డోజ్ చేసే పరిస్థితి ఉండడం బాధాకరమన్నారు.