కర్నూలు : దివంగత నేత వైయస్ రాజ శేఖర్‌రెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి హత్యలో పెద్ద కుట్రే ఉన్నట్టు స్పష్టమవుతోంది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలన్న ప్రత్యర్థుల వ్యూహంలో భాగంగానే ఈ హత్య జరిగినట్టు తెలుస్తోంది. హత్య ఎవరు చేశారో పూర్తిస్థాయిలో విచారణ జరిపి నిర్ధారించాల్సిన ప్రభుత్వ పెద్దలు రాజకీయాలు మాట్లాడడంపై ప్రజలు మండిపడుతున్నారు. కేసు పక్కదోవ పట్టించే విధంగా టీడీపీ నేతలు వ్యాఖ్యలు చేయడాన్ని తప్పు పడుతున్నారు. రాష్ట్రంలో రాక్షసపాలన నడుస్తోందని, ఈ హత్యోదంతమే నిదర్శనమని అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా..వైయస్ వివేకానందరెడ్డిని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉందంటే బోలెడు కారణాలు కనిపిస్తున్నాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు.. అదీ పోలింగ్‌కు సరిగా 26 రోజుల ముందు వివేకానందరెడ్డిని హత్య చేయడం వల్ల ఓ బలమైన సంకేతం ఇవ్వాలన్న తాపత్రయం కనిపిస్తోంది. పులివెందులలోనే వివేకాను హత్య చేస్తే వైయస్ఆర్ కాంగ్రెస్ శ్రేణుల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా చేయవచ్చన్న వ్యూహం కనిపిస్తోంది. వైయస్ఆర్ , కర్నూలు జిల్లాలో వైయస్ వివేకానందరెడ్డికి పరిచయాలున్నాయి. వైయస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా రెండు జిల్లాల రాజకీయాల్లో వివేకానందరెడ్డి క్రియాశీలకంగా ఉండేవారు. అజాత శుత్రువైన వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసును నిష్పక్షపాతంగా విచారణ జరపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.