అమరావతి : వైయస్ జగన్ ప్రభుత్వ హయాంలో పేదలకు చేరువైన సూపర్ స్పెషాలిటీ వైద్యం.. కూటమి ప్రభుత్వ తీరుతో ఇక క్రమంగా దూరం కాబోతుంది. ప్రభుత్వ వైద్యానికీ, చికిత్సలకు కూడా డబ్బులు కట్టే పరిస్థితులు రాబోతున్నాయి. ఇందులో భాగంగానే చంద్రబాబు ప్రభుత్వం కొత్త మెడికల్ కాలేజీలను అడ్డుకుంటూ.. ఎంబీబీఎస్ సీట్లు రద్దు చేయిస్తూ.. ప్రైవేటీకరణ దిశగా అడుగులు ముందుకు వేస్తోంది. తద్వారా వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన వైద్య విప్లవానికి పూర్తిగా తూట్లు పొడుస్తోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటు ద్వారా ఉచిత సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను పేద ప్రజలకు చేరువ చేసేందుకు గత వైఎస్ జగన్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేసింది. ఏకంగా 17 మెడికల్ కాలేజీలు, వాటికి అనుబంధంగా బోధనాస్పత్రులు ఏర్పాటు చేయాలని నిర్ణయించి వైద్య విప్లవానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా తొలిదశలో 5 మెడికల్ కాలేజీలను ప్రారంభించింది. ఈ విద్యా సంవత్సరంలో మరో ఐదు కాలేజీలను ప్రారంభించాల్సి ఉంది. కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణపై మోజుతో ఈ ఒక్క విద్యా సంవత్సరంలోనే ఏకంగా 700 ఎంబీబీఎస్ సీట్లను పోగొట్టి నీట్ విద్యార్థులకు తీవ్ర నష్టం చేకూర్చింది. అలాగే బోధనాస్పత్రుల ఏర్పాటుకు అడ్డుపడి పేదల వైద్యానికి గండి కొట్టింది. టెరిషరీ కేర్ బలోపేతమే లక్ష్యంగా.. ప్రభుత్వ వైద్య రంగంలో ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ అని మూడు లేయర్‌లుగా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ విస్తరించి ఉంది. ప్రైమరీ కేర్‌లో విలేజ్ క్లీనిక్‌లు, పీహెచ్‌సీలు, సెకండరీ కేర్‌లో సీహెచ్ïÜలు, ఏరియా, జిల్లా ఆస్పత్రులుంటాయి. టెరిషరీ కేర్‌లో బోధనాస్పత్రులు, సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రులు ఉంటాయి. ప్రజలు తీవ్రమైన జబ్బుల బారినపడినప్పుడు మెరుగైన చికిత్సలు అందించడంలో టెరిషరీ కేర్ కీలక పాత్ర పోషిస్తుంది. 2019 నాటికి రాష్ట్రవ్యాప్తంగా కేవలం 12 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, వీటికి అనుబంధంగా బోధనాస్పత్రులు ఉండేవి. దీంతో గ్రామీణ ప్రజలు మెరుగైన చికిత్సల కోసం 50 నుంచి 100 కి.మీ పైగా దూరం ప్రయాణించి టెరిషరీ కేర్ ఆస్పత్రులను చేరుకోవాల్సి వచ్చేది. ఈ పరిస్థితిని గుర్తించిన వైఎస్ జగన్ ప్రభుత్వం ఏకంగా రూ.8 వేల కోట్లకు పైగా నిధులతో 17 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. తద్వారా అప్పటి వరకు జిల్లా, ఏరియా ఆస్పత్రులు, సీహెచ్‌సీలు ఉన్న చోట.. ప్రభుత్వం ఆధ్వర్యంలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలతో బోధనాస్పత్రులు అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళిక రచించింది. గుండె, మెదడు, కిడ్నీ, క్యాన్సర్ తదితర రోగాలకు ఉచితంగా మెరుగైన వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు.. వైద్యులు, అధునాత పరికరాలు, సిబ్బందిని సమకూర్చేలా కార్యాచరణ రూపొందించి ఆ దిశగా చర్యలు చేపట్టింది. విద్య, వైద్యంతో ప్రజలకు మేలు.. కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుతో రాష్ట్ర విద్యార్థులకు వైద్య విద్య అవకాశాలు పెరగడంతో పాటు ఆయా ప్రాంతాల్లోని పేద ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు మరింత చేరువవుతాయి. ఇప్పటివరకూ జిల్లా, ఏరియా ఆస్పత్రులు, పీహెచ్‌సీలు ఉన్న చోట్ల బోధనాస్పత్రులు ఏర్పాటైతే నిపుణులైన వైద్యులు అందుబాటులోకి వస్తారు. అధునాతన వైద్య పరికరాలు, ల్యాబ్‌లు సమకూరి.. వైద్య సేవలు, రోగనిర్ధారణ సేవల్లో నాణ్యత పెరుగుతుంది. ఎంబీబీఎస్‌లో చేరే విద్యార్థులు నాలుగేళ్ల తర్వాత హౌస్ సర్జన్‌లుగా అందుబాటులోకి వస్తారు. వీరు నిరంతరం ఆస్పత్రుల్లో అందుబాటులో ఉండటం వల్ల రోగులకు సేవలు మరింత మెరుగవుతాయి. నాలుగైదేళ్ల తర్వాత పీజీ సీట్లు కూడా సమకూరితే.. స్పెషలిస్ట్ వైద్యుల సంఖ్య పెరిగేది. పేదల్లో ఆందోళన చంద్రబాబు చెబుతున్న గుజరాత్ పీపీపీ విధానంతో ఉచిత వైద్య సేవలపై పేదల్లో ఆందోళన మొదలైంది. ప్రైవేట్ వ్యక్తులకు కొత్త మెడికల్ కాలేజీలను అప్పగిస్తే వారి అజమాయిషీలో నడిచే బోధనాస్పత్రుల్లో వైద్య సేవల కోసం ప్రజలు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ తరహా విధానాన్ని రాష్ట్రంలో ప్రవేశపెట్టి పేదల ప్రయోజనాలకు తూట్లు పొడిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. చేరువలోనే మెరుగైన వైద్యసేవలు వందల ఏళ్ల చరిత్ర కలిగిన బందరు నగరంలో 2019 ముందు వరకూ సరైన వైద్య సేవలు అందుబాటులో లేవు. తీవ్ర అనారోగ్యం పాలైన వారు 70 కి.మీ ప్రయాణించి విజయవాడకు వెళ్లేవాళ్లు. ఈ పరిస్థితిని గుర్తించిన వైఎస్ జగన్ ప్రభుత్వం కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో కొత్త మెడికల్ కాలేజీ నెలకొల్పింది. అప్పటి వరకు 300 పడకలుగా ఉన్న జిల్లా ఆస్పత్రిని.. 600 పడకల బోధనాస్పత్రిగా అభివృద్ధి చేసింది. 150 ఎంబీబీఎస్ సీట్లతో మెడికల్ కాలేజీని ప్రారంభించింది. 60కి లోపు వైద్యులు ఉండే ఈ ఆస్పత్రిలో ప్రస్తుతం వంద మంది వరకూ వైద్యులు అందుబాటులోకి వచ్చారు. స్టాఫ్ నర్సులు, ఇతర సహాయక సిబ్బంది సంఖ్య గణనీయంగా పెరిగింది. రోజుకు 700 మేర ఓపీలు నమోదు అవుతున్నాయి. వ్యయ ప్రయాసలు తగ్గాయి గతంలో మచిలీపట్నంలో జిల్లా ఆస్పత్రి ఉండేది. కానీ అనుభవజ్ఞులైన వైద్యులు ఉండేవారు కాదు. దీంతో చిన్నచిన్న సమస్యలకు కూడా విజయవాడకు వెళ్లాల్సి వచ్చేది. రోడ్డు ప్రమాదాల క్షతగాత్రులు, ఇతర రోగులు 70 కి.మీ దూరం ప్రయాణించి విజయవాడకు వెళ్లేలోగా ప్రాణాపాయం సంభవించేది. వైయస్ జగన్ ప్రభుత్వం బోధనాస్పత్రి ఏర్పాటు చేయడంతో అనుభవజ్ఞులైన వైద్యులు అందుబాటులోకి వచ్చారు. గతంతో పోలిస్తే సేవలు మెరుగయ్యాయి. ప్రైవేట్‌పై మోజుతో ఆస్పత్రిని నిర్లక్ష్యం చేస్తే పేదలకు తీరని నష్టం జరుగుతుంది. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆస్పత్రి నడిస్తేనే పేదలకు న్యాయం జరుగుతుంది. – ఎ. గాంధీ, మచిలీపట్నం ప్రైవేటీకరణ నిర్ణయంతో పేదలకు చేటు .ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేట్ వ్యక్తుల ద్వారా నిర్వహించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సమా జానికి హానికరం. ప్రభుత్వం ఏదైనా కానీ.. ప్రజల శ్రేయస్సు కోసం తీసుకున్న నిర్ణయాలు, పనులను కొనసాగించాలి. అలా చేయకుండా మంజూరైన ఎంబీబీఎస్ సీట్లు వద్దనడం, కాలేజీల నిర్మాణాలను ఆపేయడం వంటి పనులు హర్షణీయం కాదు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఎన్ని ఏర్పాటైతే.. అంతగా పేదలకు మేలు జరుగుతుంది. ప్రైవేట్ వ్యక్తుల అజమాయిషీలోకి బోధనాస్పత్రులు వెళ్లడం వల్ల.. పేదల ప్రయోజనాలు దెబ్బతింటాయి. చికిత్సలకు డబ్బులు చెల్లించాల్సి వస్తోంది. – డాక్టర్ ఎంవీ రమణయ్య,చైర్మన్, రాష్ట్ర ప్రజారోగ్య వేదిక