– మౌలిక వసతులు కల్పించి ఇచ్చేది ప్రభుత్వం
– లే అవుట్లు వేసి అమ్ముకునేది సింగపూర్ కన్సార్టియం
– భూమితో కలిపి రూ.13వేలకోట్ల పెట్టుబడి పెట్టే ప్రభుత్వానికి వచ్చేవాటా రూ.446కోట్లు
– రూ.304 కోట్ల పెట్టుబడి పెట్టే సింగపూర్ కంపెనీలకు దక్కేది రూ.5,768 కోట్లు
ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణం పేరుతో ప్రజల నుంచి బలవంతంగా ‘సమీకరించిన’ భూమి.. అందులోనూ రాజధానికి గుండె వంటి స్టార్టప్ ఏరియాలో ఇప్పుడే ఎకరా రూ.4 కోట్లు పలుకుతున్న భూమిని సింగపూర్ ప్రయివేట్ కంపెనీల కన్సార్టియంకు రాష్ట్రప్రభుత్వం అప్పగించబోతోంది.
రూ. 7వేల కోట్ల విలువ చేసే భూమిని ఆ కంపెనీలకు అప్పగిస్తోంది.. రూ. 5,500 కోట్లతో మౌలిక వసతులు కల్పిస్తోంది.. కానీ సర్కారు తిరిగి పొందేది పిసరంత.. కానీ నారా వారి రూటే సెప‘రేటు’.. సర్కారు ‘అభివృద్ధి’ చేసిన భూమిలో లే అవుట్లు వేసుకుని అమ్మేసుకునేందుకు సింగపూర్ కన్సార్టియంకు సర్వహక్కులూ రాసిచ్చేశారు. మన వాటా కింద సగటున ఓ 8.7% ఇస్తే చాలని ఒప్పేసుకున్నారు. అభివృద్ధి చేసిన భూమిని అమ్మడం కోసం ముందు నిర్ణయించిన బేసిక్ ధర ఎకరా రూ. 4.1 కోట్లను కూడా తగ్గించేసి రూ. 62 లక్షలుగా ఫిక్స్ చేసే శారు.. ఇంత నష్టమైన బేరంగానీ, ఇంత లాలూచీగానీ ముందెన్నడూ ఎరిగి ఉండరు. ఆ కథేమిటో మీరే చూడండి.
రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో భూమికి తొలుత ప్రాథమిక ధర(బేసిక్ ప్రైస్) నిర్ణయించిన సర్కార్.. తాజాగా ఫిక్స్‌డ్ ప్రైస్(నిర్ణీత ధర) ఖరారు చేసేసింది. అంటే గతంలో ప్రాథమిక ధర నిర్ణయించారు. దానికి తగ్గకుండా ఎంతకు అమ్మినా మొత్తం ధరలో ప్రభుత్వానికి వాటా ఉండేది. ఇపుడు ఫిక్స్‌డ్ ధర నిర్ణయించారు. దానిపైనే సర్కారుకు రెవెన్యూ వాటా ఇస్తారు. పైన ఎంతకు అమ్ముకున్నా సర్కారుకు సంబంధం ఉండదన్నమాట. సింగపూర్ కన్సార్టియం, బాబు అండ్ కో భారీ ధరలకు అమ్ముకుని సొమ్ము చేసుకోవాలన్న ఎత్తుగడ లో భాగంగానే భూమికి ఫిక్స్‌డ్ ప్రైస్ నిర్ణయించి.. ఆ రేటుపై వచ్చే ఆదాయంలోనే ప్రభుత్వానికి వాటా(రెవెన్యూ షేర్) ఇవ్వాలని నిర్ణయించారు. అదీ దశలవారీగా. మొత్తమ్మీద 15 ఏళ్లల్లో స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు వల్ల ఖర్చులన్నీ పోను రూ.5,768.60 కోట్ల ఆదాయం వస్తుందని సింగపూర్ కంపెనీలు తేల్చాయి. ఇందులో ప్రభుత్వానికి రూ.446 కోట్ల వాటా ఇస్తాయి. ఇలాంటి దారుణమైన డీల్‌కు చంద్రబాబు కేబినెట్ ఆమోదం తెలిపింది.
సర్కారు ఆమోదించిన సింగపూర్ కన్సార్టియం ప్రతిపాదనలివీ..
– 1,691 ఎకరాల్లోని రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టుకు రూ.3,137 కోట్ల వ్యయం అవుతుంది. ఎకరం భూమి ప్రాథమిక విలువ(బేసిక్ ప్రైస్) రూ.4.1 కోట్లుగా నిర్ణయించింది.
– ఇందులో అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఏడీసీ) వాటా రూ.222 కోట్లు.. సింగపూర్ కన్సార్టియం వాటా రూ. 304 కోట్లు. మిగతా నిధులను భూమిని తనఖా పెట్టడం, విక్రయించడం ద్వారా సమకూర్చుకుంటుంది. ఏడీపీలో సింగపూర్ కన్సార్టియం వాటా 58 శాతం.. రాష్ట్ర ప్రభుత్వ వాటా 42 శాతం.
– ఏడీసీ, సింగపూర్ కన్సార్టియం రెండు కలిసి సంయుక్తంగా ఏడీపీని ఏర్పాటు చేస్తాయి. ఇందులో ఆరుగురు సభ్యులు ఉంటారు. సింగపూర్ కన్సార్టియం ప్రతినిధులు నలుగురు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు ఇద్దరు సభ్యులుగా ఉంటారు. ఏడీపీకి సింగపూర్ కన్సార్టియం ప్రతినిధే ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. దీనిని బట్టి సింగపూర్ కంపెనీలు చెప్పిందే వేదం అని అర్ధం కావడం లేదూ?
– ఉత్ప్రేరక అభివృద్ధి కోసం ముందుగా 50 ఎకరాలను ఉచితంగా సింగపూర్ కన్సార్టియంకు అప్పగించాలి. ఇందులో ఎనిమిది లక్షల చదరపు అడుగుల్లో భవనాలు నిర్మించి విక్రయిస్తారు. ఇందులో ఒక్క పైసా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వాటా ఇవ్వరు.
– రెండో దశలో 200 ఎకరాలను నామమాత్రపు ధరపై సింగపూర్ కన్సార్టియంకు అప్పగించాలి. ఈ భూమిలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల ద్వారా వచ్చే ఆదాయంలో రాష్ట్ర ప్రభుత్వానికి వాటా ఉండదు.
– 1,691 ఎకరాలను విక్రయించగా వచ్చే ఆదాయంలో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి వాటా(రెవెన్యూ షేర్) ఇస్తామని ప్రతిపాదించింది.
– ఈ ప్రతిపాదనలపై ప్రభుత్వం ఆమోదముద్ర వేసిన తర్వాతే స్విస్ ఛాలెంజ్ విధానంలో టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది.
– రెవెన్యూ షేర్‌లో ప్రభుత్వానికి ఎంత వాటా ఇస్తామన్నది సింగపూర్ కన్సార్టియం గోప్యంగా ఉంచడాన్ని హైకోర్టు తప్పుపడుతూ టెండర్ల ప్రక్రియను ఆపేయాలని సెప్టెంబరు 12, 2016న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
స్టార్టప్ ఏరియా అప్పగింత
పేరుకు స్విస్ చాలెంజ్ విధానం అయినప్పటికీ ఎటువంటి ఛాలెంజ్ లేకుండా సింగిల్ టెండర్‌పై సింగపూర్ కంపెనీలకు రాజధాని స్టార్ట్ అప్ ఏరియా ప్రాంతం 1691 ఎకరాలను అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తొలి దశలో అంటే తొలి ఐదేళ్లలో సింగపూర్ కంపెనీలు రెవెన్యూ వాటా కింద రాష్ట్ర ప్రభుత్వానికి 5 శాతం మేర, రెండో దశలో అంటే మరో ఐదేళ్లలో 7.5 శాతం, మూడో దశలో అంటే ఇంకో ఐదేళ్లలో 12 శాతం రెవెన్యూ వాటా ఇవ్వనుందని సీఆర్‌డీఏ ముఖ్యకార్యదర్శి అజయ్ జైన్ సోమవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే ఉత్తర్వుల్లో ఎంత ఆదాయంలో ఐదు శాతం అనేది స్పష్టం చేయలేదు. ఇటీవల ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలోని హై పవర్ కమిటీతో పాటు కేబినెట్ ఆమోదించిన ఫైలులో మాత్రం ఆదాయం నిర్ధారించారు. ఆ ఆదాయ వివరాలను ఉత్తర్వుల్లో పేర్కొనకుండా గోప్యంగా ఉంచారు. బాబు రహస్యంగా సింగపూర్ కంపెనీలతో లాలూచీ పడుతూ రాజధాని భూములను నిలువునా దోచిపెడుతున్నారు.