ఉద్యోగుల ఉసురు పోసుకుంటున్న బాబు

పుట్టుకతో వచ్చిన కొన్ని లక్షణాలు మారవు. చంద్రబాబు ఆ కేటగిరీనే. ఒకప్పటి తొమ్మిదేళ్ల హిట్లర్ పాలకుడు బాబు కొత్త అవతారంతో, మారిన మనిషినంటూ వచ్చి, అబద్ధపు హామీలతో గద్దెనెక్కాడు. కాని చంద్రబాబు ఎప్పటికీ మారడని, మారలేడని ఆయన పాలనే రుజువు చేస్తోంది. ప్రభుత్వోద్యోగుల విషయంలో బాబు వైఖరిలో ఏ మార్పూ లేదు. ఒకప్పుడు చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో ప్రభుత్వోద్యోగులను పురుగుల్లా చూశాడని, ఆరోజులు తలుచుకుంటే ఇప్పటికీ భయం వేస్తోందని అంటారు ఉద్యోగులు. నియంత పాలనలో అప్పటి చీకటి రోజులను మళ్లీ గుర్తుకుతెస్తోంది నేటి టిడిపి ప్రభుత్వం. 

ఒకప్పటి బాబు సర్కార్లో అధికారులెవరైనా తమ సమస్యలు చెప్పుకోవడానికి వస్తే వారిని పురుగుల్లా విదిలించేవారు. ఏమాత్రం గౌరవం లేకుండా మాట్లాడేవారు. మాట్లాడబోతే గద్దింపే సమాధానంగా వచ్చేది. సిఎమ్ దగ్గరకు వినతి పత్రాలతో వచ్చిన వారిని, విసుగ్గా చూసి చేతిలోని పత్రాలను లాక్కుని, పక్కనే ఉన్న కలెక్టర్ల చేతిలో పెట్టేసి, నిర్లక్ష్యంగా వెళ్లిపోయే చంద్రబాబును నేటి కీ గుర్తు  చేసుకుని ఈసడించుకుంటారు ఉద్యోగులు. ఇక జన్మభూమి కార్యక్రమాలంటే గ్రామస్థాయి, మండల స్థాయి అధికారులు గజగజా వణికిపోయేవారు. తప్పు చేసినా చేయకున్నా ప్రజల ముందు నవ్వులపాలు చేసి, అందరి ముందు నానా దుర్భాషలాడేవారు చంద్రబాబు. ఆయన వికృత చేష్టలకు ఉన్నతాధికారులు సైతం కళ్లనీళ్లు పెట్టుకునేవారు. ఒకసారి చంద్రబాబు చేసిన అవమానాన్ని తట్టుకోలేక నీటిపారుదల శాఖ ఇంజనీరు అప్పారావు గుండెపోటుతో మరణించారు. చంద్రబాబు అప్పటి తన హయాంలో ఉద్యోగ సంఘాల నేతలను క్రూరంగా అణిచేశారు. అప్పట్లో ఎపి ఎన్జీవో సంఘం అధ్యక్షుడిగా ఉన్న పూర్ణచంద్రరావును గుప్పెట్లో పెట్టుకుని సమైఖ్య రాష్ట్రంలోని ఉద్యోగులను నౌకర్లుగా చూశారు. వారిని సమస్యలపై నోరెత్తకుండా చేశారు. ఆ నియంతృత్వపు పోకడలను భరించలేకే ప్రజలు, అధికారులు ఆయనకు 2004లో ఓటుతో బుద్ధిచెప్పారు. మళ్లీ పదేళ్లపాటు బాబుని రాజకీయ విరాగిని చేశారు. తర్వాత చంద్రబాబు కపట హామీలతో మరోసారి గద్దెనెక్కారు. తన అసలు స్వరూపాన్ని బయట పెట్టడం మొదలు పెట్టారు. ఉద్యోగులను నానా రకాలుగా వేధింపులకు గురి చేస్తున్న సర్కార్ ఇప్పుడు కాంట్రాక్ట్ లెక్చరర్లను ఉన్న పళంగా ఉద్యోగాల్లోంచి తొలగించాలని నిర్ణయించుకుంటోంది. 

బాబొస్తే ఉన్న జాబూ పోతుంది
విభజనకు ముందు ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 8వేలమంది కాంట్రాక్టు లెక్చరర్లు ఉండేవారు.  విభజన తర్వాత ఎక్కువ శాతం ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నారు. బాబొస్తే జాబొస్తుంది అంటూ ఎన్నికల ముందు ప్రచారం చేసిన చంద్రబాబు, కాంట్రాక్టు లెక్చరర్లను పర్మినెంట్ చేస్తానని హామీ ఇచ్చారు. మూడున్నరేళ్లుగా ఆ హామీ ఊసే ఎత్తని బాబు ఏకంగా వారి ఉద్యోగాలకే ఇప్పుడు ఎసరు పెట్టబోతున్నారు. అసలు కాంట్రాక్టు ఉద్యోగం అనే విధానాన్ని మొదలు పెట్టింది చంద్రబాబే. 2000 సంవత్సరం ముందు వరకూ డిగ్రీ, ఇంటర్ కళాశాలల్లో అధ్యాపకుల నియామకానికి ప్రత్యేకంగా ఒక కాలేజీ సర్వీస్ కమీషనరేట్ ఉండేది. బాబు దాన్ని రద్దు చేశాడు. జీవో 143 జారీ చేసి కాంట్రాక్టు ఉద్యోగాలకు తెరతీశాడు. దాంతో రెగ్యులర్  పోస్టుల భర్తీకి గండి కొట్టినట్టైంది. ప్రభుత్వం పేస్కేలు తో సంబంధం లేకుండా అతి తక్కువ జీతాలతో కాంట్రాక్టు ఉద్యోగులను నియమించాడు బాబు. దాని వల్ల ప్రభుత్వోద్యోగాలు సంపాదించుకోవాలనుకున్న ఎందరో తమ ఉపాధిని కోల్పోయారు.  ఆస్థానంలో కాంట్రాక్టు లెక్చరర్లు అరకొర జీతాలతో ఏళ్ల తరబడి పని చేశారు. అటు ప్రభుత్వ, ఇటు ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలు  లేక వేలాదిగా ఉన్న నిరుద్యోగులు అతి తక్కువ వేతనాలకే కాంట్రాక్టు ఉద్యోగాలకు తలలు వంచారు.

కాంట్రాక్టు లెక్చరర్లకు జీతాలు పెంచిన వైయస్సార్ 
చంద్రబాబు సర్కార్ ను గద్దె దించి అధికారంలోకి వచ్చి వైయస్ రాజశేఖర్ రెడ్డి కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యలను సావధానంగా విన్నారు. కాంట్రాక్టు లెక్చరర్ల వేతనాలు రెగ్యులర్ లెక్చరర్ల బేసిక్ వేతనంతో సమానం చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. 2011లో వీరి వేతనం 18వేలకు పెరిగింది. ఆ తర్వాత నుండి వారి జీతాల్లో ఎదుగుదలే లేదు. గత ఏడాది కాంట్రాక్టు అధ్యాపకులు తమను రెగ్యులర్ చేయాలని కోరుతూ సమ్మె చేయగా, ఉద్యోగ భద్రత కల్పిస్తామని, దశల వారీగా రెగ్యులరైజ్ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఏకీకృత సర్వీస్ నిబంధనల పేరిట వారి ఉద్యోగాలకే ఎసరు పెట్టబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాల్లో 4000మంది కాంట్రాక్టు లెక్చరర్లు ఉన్నారు. వారిలో 1900 మందికి పైగా ఉద్యోగులను ఇంటికి పంపాలని ఆలోచిస్తోంది టిడిపి గవర్నమెంట్. ఈ మేరకు త్వరలోనే ఉత్తర్వులు రానున్నాయని సమాచారం. 

ఉద్యోగులను నిలువునా ముంచే చంద్రబాబు
ఇక పిఆర్సీ విషయంలోనూ బాబు సర్కార్ తీరుపై ఉద్యోగులు మండి పడుతున్నారు. 10వ పిఆర్సీ అమలు ఇంత వరకూ జరగలేదని వారు ఆరోపిస్తున్నారు. 11నెలల పిఆర్సీకి గండికొట్టిందే కాకుండా, మిగిలిన పది నెలల బకాయిలు కూడా రెండున్నరేళ్లుగా ఇవ్వడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2013 జూన్లో  పీఆర్సీ అమలు చేయాలి. కాని పిఆర్సీ కమిటీ జాప్యం కారణంగా 2015 ఏప్రిల్ కుగాని అమలుకు నోచుకోలేదు. రాష్ట్ర విభజన తేదీ అంటే 2014జూన్ రెండో తేదీనించి పిఆర్సీ వేతన బకాయిలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 2015మార్చికల్లా పదినెలల పిఆర్సీ బకాయిలు చెల్పిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ ఇంత వరకూ నెరవేరనే లేదు. మళ్లీ 11వ పిఆర్సీ కోసం వేతన సవరణ సంఘానికి లెక్కలు మందిపు కోసం కనీసం పది నెలల సమయం కావాలి. ఇంత వరకూ పాత బకాయిలే చెల్లించకుండా చంద్రబాబు సర్కార్ కాలం వెళ్లబుచ్చుతోంది. ఆర్థిక పరిస్థితి బాలేదంటూ చంద్రబాబు చెప్పే సాకులను విని ఉద్యోగులు విసిగిపోయారు. కోట్లాది రూపాయిలు ఖర్చు చేస్తూ విదేశీ ప్రయాణాలు చేస్తున్నబాబు ఉద్యోగుల దగ్గరకొచ్చేసరికి బీద అరుపులు అరుస్తున్నాడంటూ దుయ్యబట్టారు. ప్రభుత్వోద్యోగులను అన్ని విధాలా మోసం చేసే బాబు ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పడానికి వెనుకాడమని, 2004ను గుర్తు చేస్తామంటున్నాయి ఉద్యోగ సంఘాలు. 

Back to Top